Gudivada Amarnadh : విశాఖ సదస్సుకు దిగ్గజాలను ఆహ్వానించాలనే దావోస్ వెళ్లలేదు - ఆహ్వానం అందలేదని దుష్ప్రచారం చేస్తున్నారన్న గుడివాడ అమర్నాథ్ !
దావోస్ పెట్టుబడుల సదస్సుకు ఎందుకు వెళ్లలేదో గుడివాడ అమర్నాథ్ వివరించారు. ఆహ్వానం రాలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
Gudivada Amarnadh : దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం అందలేదంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఖండించారు. విశాఖలో దావోస్ సదస్సులో పాల్గొనాలంటూ నవంబర్ 25వ తేదీనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందిందని అందుకు సంబంధించిన లేఖ ప్రతిని మీడియా ముందుంచారు. గత ఏడాది దావోస్ సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వైద్య రంగంలో తీసుకువస్తున్న సంస్కరణల గురించి ప్రపంచ దేశాలకు తెలిసేలా చేశారని అమర్నాథ్ చెప్పారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్, గ్రీన్ ఎనర్జీ గురించి కూడా వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివరించిన తీరుకు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన పలువురు పారిశ్రామికవేత్తలు అభినందించారని ఆయన చెప్పారు.
మార్చిలో విశాఖలో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు ప్రపంచంలోని పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందునే దావోస్ సదస్సుకు వెళ్లలేదని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. దావోస్ వెళ్లి తాను చాలా ఘనత సాధించానని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడును ఆ సదస్సులో మాట్లాడమని నిర్వాహకులు ఎప్పుడైనా ఆహ్వానించారా? అని అమర్నాథ్ ప్రశ్నించారు. మన రాష్ట్రం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి పక్క రాష్ట్రాలు, పక్క దేశాలు కూడా మాట్లాడుకోవాలన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన అన్నారు. మన గురించి మనమే మాట్లాడుకోవాలన్నది చంద్రబాబు నాయుడు ఆలోచన అని విమర్శించారు. దావోస్ సదస్సులో మైక్రోసాఫ్ట్ అధినేతలను కలిశానని, ఆంధ్రప్రదేశ్ కు మైక్రోసాఫ్ట్ కంపెనీ వస్తోందని చంద్రబాబు నాయుడు ప్రకటించిన మరుక్షణమే తాము ఆంధ్రప్రదేశ్ లో మైక్రోసాఫ్ట్ కంపెనీని ఏర్పాటు చేయడం లేదని ఆ సంస్థ అధినేతలు చెప్పటం ఎంత సిగ్గుచేటని అమర్నాథ్ ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చింది రాజీవ్ గాంధీ. హైదరాబాదులో హైటెక్ సిటీకి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు. ఇవన్నీ మర్చిపోయిన చంద్రబాబు నాయుడు తానే హైటెక్ సిటీ నిర్మించానని, కంప్యూటర్ కూడా తానే కనిపెట్టానని చెప్పుకోవడాన్ని చూసి రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకుంటున్నారని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడుకి మ్యాటర్ వీక్.. పబ్లిసిటీ పీక్.. అంటూ అమర్నాథ్ సెటైర్ వేశారు. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇలా ఉంటే.. ఆయన క్యాబినెట్ లో పనిచేసిన మరో మంత్రి.. దావోస్ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం రాలేదని, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగడం లేదని చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. దావోస్ సదస్సు గురించి విజయవాడ దావూద్ ఇబ్రహీం మాట్లాడటం దురదృష్టకరమని ఆయన అన్నారు. అనేక రకాల కేసులతో సంబంధం ఉన్న మాజీ మంత్రి తమ ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు లేదని అమర్నాథ్ అన్నారు.
రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై లోకేష్ శ్వేత పత్రం కోరడం దూరంగా విడ్డూరంగా మంత్రి అమర్నాథ్ అన్నారు. ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తన హయాంలో ఏడాదికి 11 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు మాత్రమే తీసుకువచ్చారని, కరోనా పరిస్థితులను కూడా తట్టుకొని జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువస్తున్నారని ఆయన వివరించారు. జగన్మోహన్ రెడ్డి కార్య దీక్ష, పట్టుదల చూసి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని ఆయన చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు ముందే రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి అమర్నాథ్ చెప్పారు.జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని ప్రారంభిస్తున్న విషయమై విలేకరులు మంత్రి అమర్నాథ్ ను ప్రశ్నించగా ఆ వాహనం మీద టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రచారాలు ప్రారంభిస్తే మంచిదని సలహా ఇచచారు.