Indian Railways Good News: గ్రాండ్ ట్రంక్ రూట్లో త్వరలో మూడో లైను పూర్తి, ఉత్తరాది నుంచి దక్షిణాదికి రయ్ రయ్
భారత రైల్వేకు వెన్నెముక లాంటి గ్రాండ్ ట్రంక్ మార్గంలో 3 ప్రధాన ప్రాజెక్టుల మూడో లైన్ పనులు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. లైన్ల మొత్తం దూరం 712 కిలోమీటర్లు కాగా, రూ. 7,261 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

Grand Trunk Route 3 projects third Line | భారత్‌లో సుదూర ప్రయాణాలు, తక్కువ ఖర్చుతో సౌకర్యవంతంగా జర్నీ చేయడానికి రైలు జర్నీని ఎంచుకుంటారు. త్వరలోనే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు రైళ్ల రాకపోకలు మరింత ఈజీ కానున్నాయి. భారతీయ రైల్వేకు వెన్నెముక లాంటి గ్రాండ్ ట్రంక్ మార్గంలో 3 ప్రధాన ప్రాజెక్టులు మూడో లైన్ పనులు ప్రస్తుతం నిర్మాణం చివరి దశలో ఉన్నాయి. మొత్తం 712 కిలోమీటర్ల మేర, రూ. 7,261 కోట్ల వ్యయంతో ఈ మూడో లైన్ పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా కాజీపేట-బల్లార్ష మూడో రైలు మార్గం నిర్మాణం అక్టోబర్‌లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక విజయవాడ-గూడూరు లైన్, కాజీపేట-విజయవాడ మూడో లైన్ పనులు డిసెంబర్‌లోపు పూర్తవుతాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు భావిస్తున్నారు.
అత్యంత కీలకమైన గ్రాండ్ ట్రంక్ రైలు మార్గం
ఈ రైల్వే లైన్ ప్రాజెక్టులు పూర్తైతే బల్లార్ష- కాజీపేట- విజయవాడ- గూడూరు మధ్య మూడో రైల్వే లైన్ అందుబాటులోకి వస్తుంది. దీంతో ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ రైళ్లు రెండింటి ప్రయాణ వేగం పెరుగుతుంది. రైల్వే శాఖ అదనంగా మరిన్ని రైళ్లను నడపటం సాధ్యమవుతుంది. ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది, ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న వేళల్లో రద్దీ తగ్గి రైళ్లు సమయానికి నడిచే అవకాశం మెరుగవుతుంది. గ్రాండ్ ట్రంక్ రైలు మార్గం దేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాలను కలుపుతూ వెళ్లే అత్యంత కీలక రైలు మార్గంగా మారనుంది. ఈ మార్గంలో బల్లార్ష- కాజీపేట, కాజీపేట- విజయవాడ, విజయవాడ- గూడూరు మార్గాలు అత్యంత కీలకం అని తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల నుంచి దేశంలోని ఏ ప్రాంతానికైనా ప్రయాణించాలంటే గ్రాండ్ ట్రంక్ రైలు మార్గం ప్రధాన మార్గంగా ఉంటుంది. ప్రస్తుత మూడో లైన్ ప్రాజెక్టులు పూర్తయ్యాక హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, అలాగే విజయవాడ నుంచి చెన్నై సిటీకి రైళ్ల రాకపోకలు మరింత వేగంగా సాగుతాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నై, ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలకు ప్రయాణం తక్కువ సమయం లో పూర్తవుతుంది.
దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ మాట్లాడుతూ.. గ్రాండ్ ట్రంక్ మార్గంలోని మూడు ప్రాజెక్టుల్లో మూడో లైను పనులు త్వరలోనే పూర్తవుతాయి. ఆ లైన్ అందుబాటులోకి వస్తే రైల్వేశాఖ ఈ మార్గాల్లో మరిన్ని రైళ్లు నడపుతుంది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్‌ట్రంక్ మార్గంలో ఈ రైల్వే లైన్ ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయి. ఆ లైన్ మార్గాల్లో రైళ్లు పరుగులు పెడితే బొగ్గు, సిమెంటు, వ్యవసాయ ఉత్పత్తులు దేశంలోని పలు ప్రాంతాలకు గతంలో కంటే వేగంగా చేరతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా గ్రాండ్ ట్రంక్ మార్గం ద్వారా రైళ్లను మరింత వేగంగా నడపటానికి వీలవుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రయాణం వేగవంతం కావడంతో, జర్నీ టైం సైతం భారీగా తగ్గుతుందన్నారు.
బల్లార్ష - కాజీపేట ప్రాజెక్టు ఖర్చు రూ.2063 కోట్లు
2015-16లో అనుమతి ఇచ్చారు. మొత్తం దూరం 205 కి.మీ. తెలంగాణలో 159 కి.మీ, మహారాష్ట్రలో 46 కి.మీ ఉంది. ప్రస్తుతానికి 187 కి.మీ దూరం పూర్తయింది. ఇక మిగిలిన లైన్ బెల్లంపల్లి- మందమర్రి, ఆసిఫాబాద్- సిర్పూర్ కాగజ్ నగర్ (18 కి.మీ) పెండింగ్ లైన్ అక్టోబర్ లోగా పూర్తిచేయనున్నారు.
కాజీపేట- విజయవాడ ప్రాజెక్టు ఖర్చు రూ.1,952 కోట్లు
2012-13లో ఈ లైనుకు అనుమతి లభించింది. మొత్తం దూరం 219 కి.మీ కాగా ఆంధ్రప్రదేశ్‌లో 35 కి.మీ, తెలంగాణలో 184 కి.మీ ఉంది. ప్రస్తుతానికి 149 కి.మీ మేర పనులు పూర్తయ్యాయి. మిగిలిన నెక్కొండ, ఖమ్మం (70 కి.మీ) లైన్ మార్గాన్ని డిసెంబర్ వరకు పూర్తిచేయాలని రైల్వేశాఖ భావిస్తోంది.
విజయవాడ- గూడూరు ప్రాజెక్టు ఖర్చు రూ.3,246 కోట్లు
ఈ లైనుకు 2015-16లో అనుమతు రాగా.. మొత్తం రైల్వే లైను దూరం 288 కి.మీ కాగా ఇప్పటివరకూ 250 కి.మీ పూర్తయింది. పెండింగ్ ఉన్న చుండూరు- విజయవాడ రూట్ 38 కి.మీటర్ల మార్గాన్ని డిసెంబర్ వరకు పూర్తి చేయాలని రైల్వే శాఖ చర్యలు చేపట్టింది.






















