AP News : ఏపీలో బీసీ కులగణన - సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు !
ఏపీలో బీసీ కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ప్రత్యేక కమటీని నియమించింది.
AP News : ఆంధ్రప్రదేశ్ లో బీసీ కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కులగణనకు వచ్చే నెల 15 న శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, సమాచార పౌరసంబంధాలు, సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ ప్రకటించారు. వెనుక బడిన తరగతి వర్గాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో అత్యంత వెనుకబడిన కులాలను గుర్తించి, వారిని ఉన్నత స్థాయికి తీసుకురావాలనే లక్ష్యంతోనే ఈ సమగ్ర కులగణన చేపడుతున్నామని తెలిపారు.
1901 నుండి 1941 వరకూ ప్రతి పది సంవత్సరాలకు ఒక సారి కులగణన జరిగిందన్నారు. ఆ తర్వాత జరగలదేన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తదుపరి 1951 నుండి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనగణన మాత్రమే నిర్వహించడం జరుగుతోందన్నారు. జనగణనలో ఎస్సీ, ఎస్టీ జనాభాను తప్ప మిగిలిన అన్ని కులాలను కలిపి లెక్కిస్తున్నారని తెలిపారు. బి.సి. వర్గంలో ఎన్నో వెనుక బడి కులాలు ఉన్నాయని, ఆ కులాల్లో అత్యంత వెనుకబడిన కులాలను గుర్తించి వారి అభ్యున్నతికి అనుగుణంగా ప్రభుత్వ పథకాలను రూపొందించి అమలు పర్చాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.
రాష్ట్రంలో కులగణన జరిపించాలనే డిమాండు ఎప్పటి నుండో ఉందని, రాష్ట్రంలో బి.సి. వర్గాలకు చెందిన పలువురు నాయకులు, ప్రజలు ఎన్నో విజ్ఞాపనలు, వినతులు ప్రభుత్వానికి అందజేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు ఈ డిమాండును ఏమాత్రము పట్టించుకోకుండా బి.సి.వర్గాలను నిర్లక్ష్యం చేయడం జరిగిందన్నారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి బి.సి. వర్గాలకు అత్యంత ప్రాధాన్యత నివ్వడమే కాకుండా పది మంది బి.సి.లకు మంత్రుల పదవులను కూడా కట్టబెట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 139 బి.సి.కులాలను గుర్తించి కులాల వారీగా కార్పొరేషన్లను కూడా ఏర్పాటు చేయడమే కాకుండా నవరత్నాల పథకాలను పెద్ద ఎత్తున ఆయాకులాల వారికి అందజేయడం జరుగుచున్నదన్నారు.
బి.సి.ల్లో అత్యంత వెనుకబడిన కులాలను గుర్తించి వారి అభ్యున్నతికి అనుగుణంగా పథకాలను రూపొందించి అమలు పర్చాలనే లక్ష్యంతో ఈ ఏడాది ఏప్రిల్ 11 న మహాత్మా జ్యోతీరావు ఫూలే జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలో కులగణన చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. ప్రతి పదేళ్లకు ఒక సారి జరిగే జనగణనతో పాటు సమగ్ర కులగణనను కూడా రాష్ట్రంలో జరిపించాలని గత బడ్జెట్ సమావేశాల్లో శాసన సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగిందన్నారు. అయితే ఇప్పటి వరకూ కేంద్రం నుండి ఎటు వంటి సమాదానం రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలకు అనుగుణంగా రాష్ట్రంలో కులగణన చేయించాలని గత శాసన సభా సమావేశాల్లో తీర్మానించడం జరిగిందన్నారు.
అందుకు అనుగుణంగా బి.సి., ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు గ్రామ, వార్డు సచివాలయ శాఖలకు చెందిన ముఖ్యకార్యదర్శులతో ఇప్పటికే ఒక అధ్యయన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కమిటీ నేతృత్వంలో గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల సహకారంతో రాష్ట్రంలో కులగణనను వచ్చే నెల 15 నుండి ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకై ప్రత్యేకించి ఒక యాప్ ను కూడా రూపొందించడం జరిగిందన్నారు. ఈ కులగణనలో భాగంగా బి.సి. నాయకులు, కుల పెద్దల నుండి సూచనలు,సలహాలు సేకరించేందుకు విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు మరియు తిరుపతి ప్రాంతాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా బి.సి. కులాల నుండి తగు సూచనలు, సలహాలు స్వీకరించేందుకు ఒక ఇ-మెయిల్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.