Gidugu Rudraraju: వేరే పార్టీల నేతలు టచ్‌లో ఉన్నారు, టైమ్ చూసుకుని కాంగ్రెస్‌లోకి జంప్: గిడుగు రుద్రరాజు
AP PCC Chief Gidugu Rudraraju: జనవరి 26వ తేదీ నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లబోతున్నామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. ఏపీలో కేబినెట్ మంత్రులకూ గౌరవం లేదు అన్నారు.
AP PCC Chief Gidugu Rudraraju: కడప: ఏపీలో కాంగ్రెస్ లో ఇటీవల భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి శైలజానాథ్ ను తప్పించి గిడుగు రుద్రరాజుకు బాధ్యతలు అప్పగించారు. ఇక అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఏం చేయబోతోంది, మరోవైపు కేంద్రంలో పార్టీ జాతీయ అధ్యక్ష పగ్గాలు మల్లిఖార్జున ఖర్గేకు అప్పగించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ చేయాల్సిన రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. జనవరి 26వ తేదీ నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లబోతున్నామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. ఏపీలో కేబినెట్ మంత్రులకూ గౌరవం లేదు అన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’కు ఏపీలో అనూహ్య స్పందన వచ్చిందన్నారు. ఇతర పార్టీల నేతలు తమతో టచ్‌లో ఉన్నారని, టైమ్ చూసుకుని వాళ్లు పార్టీలో చేరతారంటూ పిడుగు లాంటి వార్త చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ సంస్థాగత అభివృద్ధి కోసం జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చెప్పారు. వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా కడప నగరంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. జవనరి 26వ తేదీ నుంచి 2 నెలల పాటు పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రణాళికలు రూపొందిస్తున్నా అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రథమ శత్రువు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. సర్పంచ్‌లకు నిధులు, విధులు లేకుండా పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు. కేబినెట్ మంత్రులకు కూడా గౌరవం లేదని, రాష్ట్రంలో అన్యాయాలు, అక్రమాలు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాదయాత్రకు అనుమతి కోరుతూ డీజీపీకి వినతిపత్రం
జనవరి 26 నుంచి రెండు నెలలపాటు పాదయాత్రతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లబోతున్నామని గిడుగు రుద్రరాజు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టే పాదయాత్రకు అనుమతి కావాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో నంబర్ 1ను సాకుగా చూపించి తమ పార్టీ చేపట్టనున్న పాదయాత్రను అడ్డుకుంటే కనుక ఏం చేయాలో పార్టీ నేతలం ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇతర పార్టీల నేతలు తమతో టచ్ లో ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తూ, డెవలప్ మెంట్‌ను గాలికి వదిలేసిందని విమర్శించారు.
ఏపీలో కాంగ్రెస్ ను బలోపేతం చెయ్యడమే తన లక్ష్యం అంటున్నారు గిడుగు రుద్రరాజు. మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు ఈ పదవి రావడానికి తన విధేయతే కారణం అంటున్నారు. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న సీనియర్ నేతలను కలుపుకుని ముందుకు వెళతానంటున్న పార్టీ నూతన అధ్యక్షుడు పార్టీయే తన కులం, గోత్రం అంటున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానన్నారు. అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళతానన్నారు. ప్రజా సమస్యలు, విభజన హామీలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ గుర్తింపు ఉంటుందని, ముఖ్యంగా కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు ఉంటుందన్నారు. కార్పొరేషన్ ఛైర్మన్‌గా, ఎమ్మెల్సీగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసే అవకాశం తనకు లభించిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉందన్న ఆయన.. పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానన్నారు.