Ganta Tweet On GIC : పెట్టుబడుల సదస్సుకు ముందు ప్రభుత్వానికి గంటా ప్రశ్నలు - అమర్నాథ్ విమర్శలు !
పెట్టుబడుల సదస్సుపై గంటా శ్రీనివాసరావు ప్రభుత్వానికి 20 ప్రశ్నలు సంధించారు. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Ganta Tweet On GIC : విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఓ లేఖ సంధించారు. గంటా శ్రీనిసరావు చేసిన ఓ ట్వీట్ వైరల్‌గ మారుతోంది. ఈ అంశంపై ఆయన తెలుగులో వైసీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఇరవై అంశాలపై సూటిగా ప్రశ్నించారు. అందులో రాజధాని లేకపోవడం దగ్గర్నుంచి జాకీ పరిశ్రమను తరిమి వేయడం వరక అనేక కీలక సందేహాలు ఉన్నాయి. వాటన్నింటికీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రపంచ పెట్టుబడుల సమావేశానికి ముందు ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు. pic.twitter.com/6V27SIwuYs
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) March 2, 2023
సూటిగా 20 ప్రశ్నలు అడిగిన గంటా శ్రీనివాసరావు
దావోస్ పెట్టుబడుల సదస్సుకు ఏపీ ప్రభుత్వం వెళ్లకపోవడానికి కారణం ఏమిటో చెప్పాలని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. దావోస్‌కు వెళ్లకపోవడం వల్ల జరిగిన నష్టం ఏమిటో ఇప్పటికైనా గుర్తించారా అని లేఖలో ప్రశ్నించారు. కియా అనుబంధ పరిశ్రమలు ఒక్క దానిని కూడా ఎందుకు ఏర్పాటు చేయించలేకపోయారు, లూలూ పరిశ్రమను వెళ్లగొట్టిన అంశం పెట్టుబడిదారుల సదస్సులో చెబుతారా ? బోగాపురం ఎయిర్ పోర్టును నాలుగేల్ల పాటు పట్టించుకోకుండా.. ఇప్పుడు శంకుస్థాపన పేరుతో హడావుడి చేయడం ఎందు్కు ?, లా అండ్ ఆర్డర్ లేదని చెప్పి పెట్టుబడులు ఆకర్షిస్తారా?, జీతాలు ఇవ్వలేని రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా ? అదానీ డేటా సెంటర్‌కు గతంలోనే శంకుస్థాపన చేసినా ఇంత వరకూ పనులు మొదలు పెట్టలేదని ఇంకా ఎందుకు భూములు కేటాయించారో చెప్పాలని గంటా డిమాండ్ చేశారు.
విశాఖలో ఐటీ ఉద్యోగులు ఎందుకు తగ్గిపోయారు ?
టీడీపీ హయాంలో విశాఖలో 50వేల మంది ఐటీ ఉద్యోగులు ఉండేవారు .. ఇప్పుడు రెండు మూడు వేల మంది కూడా లేరు..ఐటీ కంపెనీైలను ఎందుకు తరిమేశారు ? హెచ్‌ఎస్‌బీసీ వెళ్లిపోకుండా ఎందుకు ఆపలేకపోయారు ? సరైన ఉపాధి అవకాశాలు లేని రాష్ట్రంలో సగటు పౌరుడి కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిందన్న విషయాన్ని గుర్తించారా ? నాలుగేళ్ల వరకూ పట్టించుకోకుండా.. ఎన్నికలకు ఏడాది ముందు పెట్టుబడుల సదస్సు పేరుతో హడావుడి చేయడానికి కారణం ఏమిటో చెప్పాలని గంటా శ్రీనివాసరావు డమాండ్ చేశారు. ఇవన్నీ రాజకీయ దురుద్దేశంతో రాస్తున్న ప్రశ్నలు కాదని ఏపీలో సగటు పౌరుడుకి ఉన్న సందేహాలని గంటా స్పష్టం చేశారు.
చంద్రబాబు రాసిన లేఖపై గంటా సంతకం పెట్టినట్లుగా ఉందన్న గుడివాడ అమర్నాథ్
గంటా శ్రీనివాసరావు లేఖపై పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. దావోస్ వెళ్లి తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్ని పెట్టుబడులు తెచ్చారని ప్రశ్నించారు. అసలు ఏపీకి రాజధాని లేకుండా చేసింది చంద్రబాబేనని ఆరోపించారు. చంద్రబాబు రాసిన లేఖపై గంటా శ్రీనివసరావు సంతకం పెట్టినట్లుగా ఉందన్నారు.