Killi Kriparani : శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి షాక్ - కిల్లి కృపారాణి రాజీనామా ! కాంగ్రెస్ లో చేరే చాన్స్
Andhra News : కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమె శ్రీకాకుళం లోక్‌సభకు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.
Former Union Minister Killi Kriparani has resigned from YCP : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శ్రీకాకుళం జిల్లా వైసిపి కి గట్టి షాక్ తగిలింది..ఆపార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పార్టీకి రాజీనామా చేశారు.పార్టీ కోసం కష్ట పడి పనిచేసిన తగిన గుర్తింపు లేని కారణంగా ఆమె రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బుదవారం శ్రీకాకుళం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె తన రాజీనామా విషయాన్ని వెల్లడించారు.పార్టీలో తనను అడుగడుగున అవమానాలకు గురిచేశారనీ,టెక్కలి నియోజకవర్గంలో తనని అణచి వేసేందుకు కుట్రలు పన్నారని కృపారాణి ఆరోపించారు.
జగన్ కోసం అండగా నిలబడినా అన్యాయం చేశారు !
జగన్ ఓదార్పు యాత్ర సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆజ్ఞలు సైతం కాదని జగన్ కు అండగా నిలబడ్డాననీ అలాంటి నాకు పార్టీలో సరైన స్థానం గుర్తింపు లేకపోవడం తో పార్టీని విడనాడల్సి వచ్చిందని తెలిపారు.రానున్న ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ నియజకవర్గం నుండి పోటీ చేసి తానేంటో నిరూపిస్తానని సవాల్ విసిరారు.తనకు గౌరవం ఇచ్చే పార్టీలో చేరుతానని స్పష్టం చేశారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున లోక్ సభ ఎన్నిక్లలో పోటీ చేసి టీడీపీ దిగ్గజ నేత ఎర్రన్నాయుడుని ఓడించారు. ఆమెకు నాటి యూపీయే టూ ప్రభుత్వంలో కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పదవి కూడా దక్కింది.
పార్టీ పదవిని తీసేయడంతో అవమానంగా ఫీలైన కృపారాణి
వైసీపీ అధికారంలోకి వచ్చాక జిల్లా వైసీపీ అధ్యక్షురాలిగా ఆమె పనిచేశారు. ఆమె రాజ్యసభ సీటు ఆశించారు. కానీ దక్కలేదు. తరవాత మంత్రిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ పదవిని తొలగించి.. జిల్లాఅధ్యక్ష పదవిని ఇచ్చారు. ఈ కారణంగా కిల్లి కృపారాణికి ఆ పదవి కూడా దూరమయింది. ఆమె టెక్కలి అసెంబ్లీ సీటు కోరుకున్నారని ప్రచారంలో ఉంది. కానీ ఆమెను శ్రీకాకుళం ఎంపీ సీటు నుంచి పోటీ చేయించాలని భావించారు. మరి ఏమైందో తెలియదు శ్రీకాకుళం ఎంపీ, టెక్కలి ఎమ్మెల్యే టికెట్ ఆమెకు ఇవ్వలేదు. దాంతో ఆమె వైసీపీ కార్యకలాపాలకు పూర్తిగా దూరం అయ్యారు. తీవ్ర అసంతృప్తికి లోను అయిన కిల్లి కృపారాణి టీడీపీ వైపు వెళ్తారన్న ప్రచారం జరిగింది.
కాంగ్రెస్ తరపున లోక్‌సభకు పోటీ చేసే అవకాశం
చివరికి కాంగ్రెస్ లో చేరితే బెటర్ అని ఆమె నిర్ణయించుకున్నారు అని అంటున్నారు. ఇటీవల ఆమె హైదరాబాద్ , ఢిల్లీ వెళ్లారని కాంగ్రెస్ పెద్దలతో చర్చల జరిపినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ తరపున శ్రీకాకుళం ఎంపీ సీటులో ఆమె పోటీ చేసే అవకాశం ఉంది. ఆమె కుమారుడు అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.