Vellampalli Srinivas: 'ఆ సమయంలో ఏం జరిగిందో అర్థం కాలేదు' - చంద్రబాబు జగన్ పై కుట్ర చేశారన్న మాజీ మంత్రి వెల్లంపల్లి
Andhrapradesh News: సీఎం జగన్ పై రాయి దాడి ఘటనపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. జగన్ కు గాయం తగిలిన వెంటనే తనకూ గాయమైందని.. ఆ సమయంలో ఏం జరిగిందో అర్థం కాలేదని అన్నారు.
Vellampalli Srinivas Responds On Attack on Cm jagan Incident: విజయవాడలో 'మేమంతా సిద్ధం' (Memantha Siddam) బస్సు యాత్ర చేస్తుండగా సీఎం జగన్ (CM Jagan) పై సింగ్ నగర్ వద్ద రాయి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ (Vellampalli Srinivas) కు సైతం గాయమైంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఘటన సమయంలో జరిగిన పరిస్థితిని వివరిస్తూనే టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. 'సీఎం జగన్ కు రాయి తగిలిన వెంటనే నాకు గాయమైంది. ఆ సమయంలో ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. నాకు కనుగుడ్డు మీ ర్యాష్ అయ్యింది. విపరీతమైన నొప్పి వస్తోంది. సీఎం జగన్ కూడా నొప్పితో విలవిల్లాడారు. ఆయనపై హత్యాయత్నానికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశాను. పోలీసులు, ఎన్నికల కమిషన్ ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని విచారణ చేయాలి. చంద్రబాబు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. సీఎం జగన్ పై కుట్ర చేశారు. చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఎన్నికల కోసం డ్రామాలాడే అలవాటు చంద్రబాబుదే. అలిపిరి బాంబు దాడిలో ఒక చేతికి గాయమైతే, మరో చేతికి కట్టు కట్టించుకుని డ్రామా ఆడింది చంద్రబాబు కాదా.?. స్కిల్ కేసులో అరెస్టైతే ఒంటినిండా జబ్బులు ఉన్నాయని డ్రామా ఆడింది చంద్రబాబు కాదా.?. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడిని జైలులో పెడితే డ్రామాలు ఆడారు. అలాంటి వాళ్లు మా ముఖ్యమంత్రిని వివరిస్తారా.?. టీడీపీ నాయకులు నెల రోజుల్లోనే దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు.' అని వెల్లంపల్లి మండిపడ్డారు.
'ఆ బిల్డింగ్ నుంచే దాడి'
మరోవైపు, సీఎం జగన్ పై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో భాగంగా శనివారం సాయంత్రం సీఎం జగన్ విజయవాడ చేరుకున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ జగన్ రాత్రి 8:10 గంటలకు సింగ్ నగర్ డాబాకొట్ల వద్దకు చేరుకోగానే రాయి దాడి జరిగింది. అయితే, ఆ సమయంలో ఆయన పక్కకు జరగడంతో ఎడమ కంటి కనుబొమ్మపై బలమైన గాయమైంది. అనంతరం పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లికి సైతం రాయి తగలడంతో గాయమైంది. ఘటన జరిగిన వెంటనే బస్సులోకి వెళ్లిన ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. అటు, ఘటనా స్థలాన్ని క్లూస్ టీం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఘటనా ప్రాంతంలోని సీసీ ఫుటేజీలను జల్లెడ పడుతున్నారు. స్థానికంగా ఓ స్కూల్ భవనం, గంగానమ్మ గుడికి మధ్యలో చెట్ల దగ్గర నుంచి దాడి జరిపినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కుడివైపు జనావాసాలు ఉండడంతో ఎడమవైపు స్కూల్, గంగానమ్మ గుడి మధ్య ప్రాంతాన్ని నిందితుడు ఎంచుకున్నట్లు గుర్తించారు. పూర్తిగా చీకటి, చెట్లు ఉండడంతో ఎవరికీ కనిపించకుండా.. దాడికి పాల్పడిన తర్వాత సులభంగా తప్పించుకోవచ్చని నిందితుడు ఆ ప్రాంతాన్ని దాడికి ఎంచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దాదాపు 30 అడుగుల దూరం నుంచి రాయిని బలంగా విసిరినట్లు తెలుస్తోంది. బస్సు యాత్ర విజయవాడలోకి శనివారం సాయంత్రం ప్రవేశించగానే.. రాత్రి యాత్ర సాగే మార్గంలో విద్యుత్ సరఫరా నిలిపేస్తుండడాన్ని ఆగంతుకుడు ఆసరాగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Stone Attack: సీఎంపై రాయిదాడి ఘటనలో ఎన్నో అనుమానాలు, అదే టైంలో కరెంట్ ఎందుకు పోయిందో?