MLC Ashok Babu: ఉద్యోగులు ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఉద్యోగులు బుద్ధి చెబుతారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఉద్యోగులు బుద్ధి చెబుతారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి అంశంపై రాజకీయ విమర్శలు చేసే మంత్రులు ఉద్యోగుల జీతాలపై ఎందుకు నోరు విప్పరు? అని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు నిలదీశారు.
‘‘చిలకపలుకులతో జగన్ రెడ్డిని వెనకేసుకొచ్చేవాళ్లు 11వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వలేదని మాత్రం ముఖ్యమంత్రిని అడగలేరు. జీతాలు, పింఛన్లకు నెలకు రూ.5,500 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటే.. జగన్ సర్కార్ నేటికి కేవలం రూ.2,500 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఎంతమందికి జీతాలు.. పింఛన్లు ఇచ్చారంటే ఆర్థిక శాఖ నీళ్లు నములుతోంది. అగ్నిపర్వతంలోని లావాలా ఉద్యోగులు, వారి కుటుంబాలు ఈ ప్రభుత్వాన్ని కచ్చితంగా దహిస్తారు. ఉద్యోగులు.. ఉపాధ్యాయులు తమతో లేరని సకలశాఖల మంత్రి అన్నప్పుడే వారిపై జగన్ వైఖరి ఏమిటో అర్థమైంది. 13 లక్షల పైచిలుకు ఉద్యోగుల్లో కేవలం లక్షన్నర మందే నీలిరక్తం నింపుకున్నారనే నిజాన్ని ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల్ని ఎన్నికల విధులకు దూరం పెట్టినంత మాత్రాన జగన్ అనుకున్నవి జరగవు.’’ అని అశోక్‌బాబు అన్నారు.
జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాదని.. అంధకారంలోకి వెళుతుందని ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. అప్పుడు రావాలి జగన్ అన్న ప్రజలు.. ఇప్పుడు పోవాలి జగన్.. రావాలి బాబు; సైకో పోవాలి సైకిల్ రావాలి అని నినాదాలు చేస్తున్నారని అశోక్ బాబు చెప్పారు. జగన్ చేసిన దుర్మార్గాలపై ప్రజలను మభ్య పెట్టడానికి చంద్రబాబును అరెస్ట్ చేయించారని, రాష్ట్రంలో టీడీపీ ప్రతిఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తుంది చెప్పారు .
విద్యార్థుల విషయంలో జగన్ రెడ్డి కంస మామ పాత్ర పోషిస్తున్నారు. 4 ఏళ్లలో ఒక గురుకుల పాఠశాలను నిర్మించారా? అని అశోక్ బాబు ప్రశ్నించారు. పిచ్చోడు విశాఖపట్నం వెళ్తున్నారు కాబట్టి మంచోళ్లను విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండి పడ్డారు. సీఎం జగన్‌కు తెలిసింది అరాచకం.. దోపిడీ అని అశోక్ బాబు అన్నారు. ప్రభుత్వ కుట్రలో భాగస్వాములయ్యే అధికారులంతా భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకుంటారని, టీడీపీ అధికారంలోకి రాగానే జగన్ రాజకీయ కుట్రలు... వాటిలో పావులుగా మారిన అధికారులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తుందని అశోక్ బాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గాలను రాష్ట్రంలోని ప్రజలు ఎత్తిచూపాల్సిన సమయం ఆసన్నమైందని బాబు వెల్లడించారు. రాష్ట్రాన్ని జగన్ సమూలంగా నాశనం చేయడానికి సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. రాజధాని అమరావతిలో జరగాల్సిన పనులన్నీ నిలిచిపోయాయి. దీనిపై కూడా రాష్ట్ర మంత్రులు స్పందించడం లేదని ఆరోపించారు. ఏ చట్టాలు.. తమనెవరు ఏమి చేయలేరన్న దుర్మార్గపు విధానాలతో ప్రభుత్వం ముందుకెళుతుందని దుయ్యబట్టారు. విశాఖ కేంద్రంగా సీఎం జగన్ సాగించాలనుకుంటున్న పాలన మూడు నాలుగు ముచ్చట అని అశోక్ బాబు ధ్వజమెత్తారు. 30 వేల కోట్ల అమరావతి ప్రాజెక్టులను నాశనం చేసి తమ సైకో స్వభావాన్ని ముఖ్యమంత్రి మరోసారి బయటపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.