Anantapur: వామ్మో ఈ టెన్షన్ మా వల్ల కాదు.. సెలవు పెట్టేస్తున్నాం.. రాజకీయ ఒత్తిళ్లతో అధికారుల సామూహిక సెలవులు
రాజకీయ నాయకుల ఒత్తిళ్లు భరించలేక మండల పరిషత్ కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బంది మూకుమ్మడిగా సెలవులో వెళుతున్నట్లు వెల్లడించారు. ఈ ఘటన..అనంతపురం జిల్లాలోని తలుపుల మండలంలో చోటుచేసుకుంది.
రాజకీయ నాయకుల మధ్య విభేదాలు ఉండటం సహజమే. వేర్వేరు పార్టీలకు చెందిన వారైతే ఒకరినొకరు బాహాటంగా విమర్శించుకుంటారు. మరి ఒకే పార్టీలో ఉన్నవారైతే? అదో కోల్డ్ వార్ అని చెప్పవచ్చు. ఒకరినొకరు డైరెక్టుగా విమర్శించుకోలేరు. ఏమైనా అంటే మీడియాలో బ్రేకింగ్ న్యూస్ అయిపోతుంది. ఇక పార్టీ అధినేత కంటపడితే ఇద్దరి రాజకీయ జీవితాలకు ఎసరు తప్పదు. ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య నలిగిపోయే చిన్న ఉద్యోగుల బాధ అయితే వర్ణణాతీతం అని చెప్పవచ్చు. కరవమంటే కప్పుకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఉంటుంది వీరి పరిస్థితి.
సరిగ్గా ఇలాంటి కోల్డ్ వార్.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సిద్దారెడ్డి, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు పూల శ్రీనివాస్ రెడ్డి మధ్య నడుస్తున్నట్లు అనంతపురం జిల్లాలో టాక్. వీరి మధ్య ఉన్న విభేదాల కారణంగా.. అధికారులు ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. ఒకరు ఒక పని చేయమంటే, ఇంకొకరు వద్దంటారని.. ఈ రెండింటి మధ్యలో సతమతమవుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక మూకుమ్మడిగా సెలవులో వెళుతున్నట్లు జిల్లాలోని తలుపుల మండల పరిషత్ కార్యాలయంలో పనిచేసే అధికారులు వెల్లడించారు.
అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలో వైసీపీ నేతల మధ్య విబేధాలు ప్రభుత్వ అదికారులకు ముచ్చెమటలు పెట్టిస్తున్నాయి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లు భరించలేక మండల పరిషత్ కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బంది మూకుమ్మడిగా సెలవులో వెళుతున్నట్లు వెల్లడించారు. ఈ ఘటన.. జిల్లాలోని తలుపుల మండలంలో చోటుచేసుకుంది. ఈ మేరకు తాము సామూహిక సెలవులపై వెళుతున్నామంటూ జిల్లా పరిషత్ సీఈవో, కలెక్టర్కు వినతి పత్రం అందించారు. బుధవారం (నేటి) నుంచి తాము సామూహిక సెలవులపై వెళ్తున్నట్లు వినతి పత్రంలో పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్ల వల్ల తాము పనిచేయలేకపోతున్నామని సిబ్బంది.. ఉన్నతాధికారుల వద్ద వాపోయారు. రాజకీయ ఒత్తిళ్ల నుంచి తమకు ఉపశమనం కల్పించాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.
సిద్దారెడ్డి, పూల శ్రీనివాస్ రెడ్డి రాజకీయ ఒత్తిళ్లే కారణం..
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సిద్దారెడ్డి, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు పూల శ్రీనివాస్ రెడ్డి మధ్య విభేదాల కారణంగానే అధికారులు ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. వీరి మధ్య విభేదాలతో తాము నలిగిపోతున్నట్లు ఉన్నతాధికారుల వద్ద వాపోయారు. అందుకే మూకమ్మడిగా సెలవులు పెడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
Also Read: Hyderabad News: బోటి కూర కోసం మందుబాబు రచ్చరచ్చ.. వేడి వేడిగా ఇవ్వలేదంటూ కాగుతున్న నూనె పోసి దాడి..
Also Read: Warangal Crime: వరంగల్‌లో దారుణం.. సొంత అన్న ఫ్యామిలీపై కత్తులతో దాడి.. ముగ్గురు అక్కడికక్కడే మృతి