Home Minister Taneti Vanita : చిన్నారులపై అఘాయిత్యాల కామెంట్స్ పై హోంమంత్రి వివరణ, ముందు వెనక కట్ చేసి ప్రసారం చేస్తున్నారని ఆరోపణ
Home Minister Taneti Vanitha : జి.కొత్తపల్లిలో హత్యకు గురైన గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులను హోం మంత్రి తానేటి వనిత పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Home Minister Taneti Vanitha : ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై స్థానికులు దాడి చేశారు. అతి కష్టం మీద పోలీసులు ఎమ్మెల్యేను ఆ గ్రామం నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ హత్య కేసులో సంబంధం ఉందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న ఎంపీటీసీ బజారియా పరారీలో ఉన్నారు. ఈ క్రమంలో హోంమంత్రి తానేటి వనిత ఆదివారం గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితులను పట్టుకుంటామని స్పష్టం చేశారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అనంతరం హోంమంత్రి తానేటి వనిత దేవరపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. హోంమంత్రి తానేటి వనిత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, జక్కంపూడి రాజా, ఇతర వైస్సార్సీపీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
బాధ్యులపై కఠిన చర్యలు
హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. జి.కొత్తపల్లిలో గంజి ప్రసాద్ హత్య సంఘటన దురదృష్టకరం. వైస్సార్సీపీ నేత గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. నిందితులు ఎంతటివారైనా సరే కఠినంగా శిక్షిస్తాం. ఈ రోజు బాధిత కుటుంబ సభ్యులను జి.కొత్తపల్లి లో పరామర్శించాం. హత్యకు గురైన గంజి ప్రసాద్ మృతి పార్టీకి తీరని లోటు. హత్య కేసులో కొంతమంది వ్యక్తులు పోలీసులకు లొంగిపోయారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో బజారయ్య అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. బజారయ్య కోసం ఇప్పటికే పోలీసులు గాలిస్తున్నారు. సంఘటనపై పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.
ముందు వెనక కట్ చేసి
దిశ యాప్ ఉపయోగించుకోలేని చిన్నారుల భద్రత విషయాన్ని తల్లి చూసుకోవాలని మాత్రమే తాను చెప్పానని మంత్రి అన్నారు. ముందు వెనక కట్ చేసి వ్యాఖ్యలను ప్రసారం చేయడం సరికాదన్నారు. ఎవరు పదవికి పనికి వస్తారో తేల్చాల్సింది ప్రజలు అని టీడీపీ నేతల విమర్శలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. రమ్య కేసులో దిశ చట్టం స్ఫూర్తితో సత్వర న్యాయం జరిగిందన్నారు. తల్లి బాధ్యతను గుర్తుచేస్తే దానిని వక్రీకరించారన్నారు. పిల్లల సంరక్షణలో తండ్రి కన్నా తల్లుల బాధ్యత ఎక్కువగా ఉంటుందన్న సందర్భంలో తాను మాట్లాడానని హోంమంత్రి తానేటి వనిత అన్నారు.