Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Andhra Pradesh Election Nominations: ఏపీ, తెలంగాణతో పాటు నాలుగో దశలో పోలింగ్ జరిగే స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల కానుంది. అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పణ సమయంలో ఇవి పాటించాలి.
5 persons allowed with contestants for nominations: అమరావతి: దేశ వ్యాప్తంగా ఇదివరకే మూడు దశల ఎన్నికలకు నోటిఫికేషన్ కేంద్ర ఎన్నికల సంఘం (CEC) విడుదల చేసింది. నాలుగో విడత ఎన్నికల నోటిఫికేషన్ ను గురువారం విడుదల చేయనుంది ఈసీ. ఏపీ, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో.. మొత్తంగా 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో మే 13న నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 18న నాల్గో దశ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. దాంతో గురువారం నుంచే ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఏప్రిల్ 25న నామినేషన్ స్వీకరిస్తారు. ఏప్రిల్ 26న నామినేషన్లు పరిశీలన, ఉపసంహరణ గడువు ఏప్రిల్ 29న ముగియనుంది. మే 13న ఎన్నికలు నిర్వహించి, జూన్ 4న ఓట్లు లెక్కించి విజేతల్ని ప్రకటించనునన్నారు.
అభ్యర్థులు ఎంత డిపాజిట్ చేయాలంటే..
పార్లమెంటుకు పోటీ చేసే జనరల్ అభ్యర్ధులు రూ.25,000, అసెంబ్లీకి పోటీ చేయనున్న అభ్యర్థులు రూ.10,000 ధరావతు (Election Deposit) చెల్లించాల్సి ఉంటుందని ఈసీ తెలిపింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు జనరల్ అభ్యర్థులు చెల్లించే మొత్తంలో 50 శాతం చెల్లిస్తే సరిపోతుంది. ఈ నామినేషన్ ప్రక్రియ రికార్డు చేసేందుకు నామినేషన్లను స్వీకరించే చోట పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా అభ్యర్ధుల ఊరేగింపులను, నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియను సైతం వీడియో రికార్డింగ్ చేస్తారు.
నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- అభ్యర్థులు నామినేషన్ల దాఖలకు 13 రకాల డాక్యుమెంట్లను తీసుకురావాలి.
- పార్లమెంటుకు పోటీచేసే అభ్యర్ధులు ఫారమ్ 2ఏ, అసెంబ్లీకి పోటీ చేసేవారు ఫారమ్ 2బి లో ధరఖాస్తు చేయాలి.
- నోటిఫైడ్ తేదీలలో ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 3.00 వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుంది.
- పబ్లిక్ సెలవు దినాలలో నామినేషన్ స్వీకరించబడదు.
- అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్ దాఖలు చేయవచ్చు.
- నామినేషన్లను ఆర్ఓ కు గానీ, సంబంధిత ఏఆర్ఓకు మాత్రమే సమర్పించాలి.
- అభ్యర్ది తన నామినేషన్‌ను నేరుగా గానీ, తన ప్రపోజర్ ద్వారా గానీ సమర్పించవచ్చు.
- అభ్యర్ధి నామినేషన్‌తో పాటు తమ పేరిట కొత్తగా తెరిచిన బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించాలి.
- 2 కంటే ఎక్కువ నియోజకవర్గాల నుండి అభ్యర్థులు నామినేషన్లను ఫైల్ చేయడం కుదరదు.
- నామినేషన్ల దాఖలు సమయంలో 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా 3 వాహనాలు అనుమతించనున్నారు
- అభ్యర్ధితో సహా ఐదుగురు వ్యక్తులు మాత్రమే ఆర్ఓ ఆఫీస్‌లోకి ప్రవేశించవచ్చు.
- నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయనున్నారు.
- అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశారు.
- సువిధ యాప్ ద్వారా నామినేషన్లను దాఖలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, వాటి కాపీలను భౌతికంగా ఆర్ఓకు అందజేయాల్సి ఉంటుంది.
- ఫారమ్-26 ద్వారా తన అఫడవిట్‌ను సమర్పించాలి.
- ఫారమ్ 26 స్టాంప్ పేపర్ యొక్క విలువ రూ. 10 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.
- భౌతిక స్టాంప్ పేపర్ అందుబాటులో లేకుంటే E స్టాంప్ కూడా ఉపయోగించవచ్చు.
- అభ్యర్థి నామినేషన్ వేసిన దగ్గర నుంచీ, ఖర్చు అతని ఖాతాలో లెక్కించడం జరుగుతుంది.
- పత్రికల్లో వచ్చే ప్రకటనలు, పెయిడ్ న్యూస్ వార్తలను సైతం అభ్యర్థి ఖాతాలో లెక్కించనున్నారు