East Godavari News : కో-ఆపరేటివ్ బ్యాంకు బోర్డు తిప్పేస్తోందా? ఆందోళనకు దిగిన ఖాతాదారులు !
East Godavari News : తూర్పుగోదావరి జిల్లాలోని ఓ కో-ఆపరేటివ్ బ్యాంక్ వద్ద ఖాతాదారులు ఆందోళనకు దిగారు. తమ సొమ్ము తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గత పది రోజులుగా బ్యాంక్ యాజమాన్యం ఆచూకీ లేకపోవడంతో ఖాతాదారుల్లో గుబులు రేపుతోంది.
East Godavari News : విశ్రాంత ఉద్యోగులు, సామాన్య ప్రజలు అధిక వడ్డీకి ఆశపడి కో-ఆపరేటివ్ బ్యాంకులో సొమ్ములు దాచుకున్నారు. ఇప్పుడు ఆ బ్యాంకు యాజమాన్యం బోర్డు తిప్పేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని వార్తలు రావడంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. దీంతో బ్యాంకులు చుట్టూ అధికారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా బ్యాంకు సిబ్బంది పత్తా లేకుండా పోవడంతో అనుమానాలు మరింత బలపడి ఆందోళన బాటపట్టారు ఖాతాదారులు.
అవకతవకలపై తనిఖీలు
డీసీవో అధికారులు, కో-ఆపరేటివ్ బ్యాంకు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కాకినాడ రూరల్ మండలంలోని సర్పవరం జంక్షన్ వద్ద ది జయలక్ష్మి ఎం.ఏ. ఎం కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరు మీద 1999 నుంచి సెంట్రల్ బ్రాంచ్ ఏర్పాటు చేశారు. ఈ బ్యాంకుకు రాష్ట్ర వ్యాప్తంగా 28 బ్రాంచీలు ఏర్పాటు చేసి అధిక సంఖ్యలో సొమ్మును ఖాతాదారుల నుంచి వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై గత నాలుగు రోజుల నుంచి ఈ కో-ఆపరేటివ్ బ్యాంకు సరిగ్గా తీయకపోవడం, డిపాజిటర్ల సొమ్ములను తిరిగి ఇవ్వకపోవడంపై అనేక సందేహాలు ఖాతాదారులకు మొదలయ్యాయి. దీంతో అధిక సంఖ్యలో ఖాతాదారులు బ్యాంకు వద్దకు వస్తుండడంతో గందరగోళం నెలకొంది. బ్యాంకు వద్దకు చేరుకున్న ఖాతాదారులు నిరసన తెలుపుతున్నారు. ఈ సందిగ్ధతపై డిప్యూటీ డీసీవో జవహర్ వివరణ ఇస్తూ ది. జయలక్ష్మి కో ఆపరేటివ్ సొసైటీకు రాష్ట్రంలో 28 బ్రాంచ్ లు ఉన్నాయని, కానీ సెంట్రల్ కార్యాలయంలో అవకతవకలు జరిగాయని, ఇంతకు ముందు ఇదే సొసైటీలో పనిచేసిన వ్యక్తి ఫిర్యాదు మేరకు రికార్డులను తనిఖీ నిర్వహించడం జరుగుతుందన్నారు.
పోలీస్ కస్టడీలో యజమాన్యం
సుమారు పది నుంచి పదిహేను రోజులు రికార్డుల తనిఖీలు నిర్వహిస్తామని డిప్యూటీ డీసీవో జవహర్ తెలిపారు. తదుపరి బ్యాంకు నిర్వహణ కార్యక్రమాలపై వివరాలు తెలియజేస్తామన్నారు. అయితే రికార్డుల తనిఖీల్లో యాజమాన్యాలు ఉండవలసిన అవసరం ఉందని, వారు పోలీసు కస్టడీలో ఉన్నారని, వారు అందుబాటులో ఉంటే వెంటనే తనిఖీలు చేస్తామన్నారు. ది.జయలక్ష్మి కో ఆపరేటివ్ బ్యాంకు మేనేజర్ పద్మావతి మాట్లాడుతూ యాజమాన్యం గత వారం రోజులుగా అందుబాటులో లేరని, వారు మాట్లాడే వరకు వేచి ఉండాలని ఖాతాదారులకు తెలిపారు. ఖాతాదారులతో పాటుగా తాను కూడా బ్యాంకులో సొమ్ములను డిపాజిట్ చేశానన్నారు. ఖాతాదారులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. తమ సొమ్ము భద్రంగా ఉందా లేదా అన్న అయోమయ స్థితిలో ఉన్నారు. ఇదిలా ఉంటే కోనసీమ జిల్లాలోని అమలాపురంలో ది. జయలక్ష్మి కో ఆపరేటివ్ బ్యాంకు బ్రాంచ్ వద్ద ఖాతాదారులు తమ డిపాజిట్లు తిరిగి తక్షణం చెల్లించాలని ఆందోళన బాట పట్టారు.