Kachidi Fish: కాసులు కురిపించిన కచిడి చేపలు... జాలర్ల వలకు చిక్కిన అరుదైన మీనం... లక్షల్లో పలికిన ధర
ఓ అరుదైన మీనం ఆ జాలర్లకు సిరులు కురిపించింది. తూర్పుగోదావరి జిల్లాలో మత్స్యకారుల వలలో చిక్కిన కచిడి చేపలు లక్షల్లో అమ్ముడుపోయాయి.
తూర్పుగోదావరి జిల్లాలో మత్య్సకారుడికి కచిడి చేపలు కాసులు కురిపించింది. అరుదుగా దొరికే ఈ చేపలకు స్థానికంగా చాలా గిరాకీ ఉంటుంది. వేలలో, కొన్ని సార్లుల్లో లక్షల్లో అమ్ముడుపోతుంటాయి. వల వేసిన ప్రతిసారీ జాలర్లు అరుదైన చేపలు వలలో చిక్కాలని తమ కష్టాలు గట్టేక్కాలని కోరుకుంటారు. అరుదైన చేపలు వలలో చిక్కితే కాసులు కురుస్తాయని ఆరాటపడతాడు. కానీ ఇలా జరగడం చాలా అరుదు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో కృష్ణా జిల్లా జాలర్లు వేసిన వలలో అరుదైన కచిడి చేపలు పడ్డాయి.
Also Read: Raksha Bandhan: ఆవు పేడతో అద్భుత రాఖీలు.. అబ్బో! వీటిని ట్రై చేస్తే నిజంగా ఎన్ని ఉపయోగాలో..
మగచేపకు మరింత గిరాకీ
జాలర్ల వలలో రెండు కచిడి చేపలు చిక్కాయి. అందులో ఒకటి మగది, మరొకటి ఆడది. అంతర్వేది పల్లిపాలెం హార్బర్‌లో అమ్మకానికి పెట్టిన కచిడి చేపలను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఈ చేపల్లో మగది 16 కిలోల బరువు ఉండగా, ఆడచేప 15 కిలోలు తూగింది. ఈ చేపలను సొంతం చేసుకునేందుకు స్థానిక వ్యాపారులు పోటీపడ్డారు. స్థానిక మార్కెట్ లో వీటిని అమ్మకానికి పెట్టగా మగ చేప లక్ష రూపాయలు, ఆడచేప రూ.30 వేలకు అమ్ముడు పోయాయి. ఈ చేపల పొట్ట భాగంలో ఉండే అవయవాలకు ఔషద గుణాలుంటాయని అంటున్నారు. మగ చేపలో ఎక్కువగా ఔషధాలు ఉండడం వల్ల దానికి ఎక్కువ రేటు ఉంటుందని మత్య్సకారులు తెలిపారు. ఈ ఔషధ గుణాల వల్లే కచిడి చేపలకు అధిక గిరాకీ ఉంటుందని మత్స్యశాఖ ఏడీ కృష్ణారావు తెలిపారు. ఇలాంటి చేపలు అరుదుగా జాలర్ల వలలో చిక్కుతాయని తెలిపారు.
గోల్డెన్ ఫిష్... సర్జరీ దారం
కచిడి చేప శాస్త్రీయ నామం ప్రొటోనిబియా డయాకాన్తస్. కచిడి చేపను సముద్రంలో గోల్డెన్ ఫిష్‌గా పిలుస్తుంటారు. ఈ చేప జాలర్ల వలకు చిక్కితే నిజంగా బంగారం దొరికనట్టే. లక్షలు కురిపించే ఈ చేపలు చాలా అరుదుగా వలలో చిక్కుతాయి. ఇవి దొరికితే మత్స్యకారుల పంట పండినట్లే. కచిడి చేప ఓ ప్రాంతంలో స్థిరంగా ఉండదు. సముద్రంలో ఒక చోట నుంచి మరో చోటికి తిరుగుతూ ఉంటుంది. చాలా సుదీర్ఘ ప్రాంతాలకు పయనిస్తూ ఉంటుంది. ఈ చేపల నుంచి శస్త్రచికిత్సల సమయంలో వైద్యులు కుట్లు వేయడానికి ఉపయోగించే దారాన్ని తయారు చేస్తారు. చేప పొట్టభాగం నుంచి ఈ దారాన్ని తయారుచేస్తారు. ఈ దారం కాలక్రమేణా శరీరంలో కలిసిపోతుంది. ఖరీదైనా వైన్ తయారు చేసే పరిశ్రమల్లో కచిడి చేపను ఉపయోగిస్తారు. ఈ చేప రెక్కలు వైన్‌ను క్లీన్ చేయడానికి వినియోగిస్తారని చెబుతుంటారు.