East Godavari: జగనన్న ఉన్నాడు జాగ్రత్త... గుంతల రోడ్డుపై ఫ్లెక్సీ... వైరల్ అవుతున్న వీడియో
జగనన్న ఉన్నాడు జాగ్రత్త.. అంటూ గుంతల రోడ్డుపై వెలిసిన ఓ ఫ్లెక్సీ తూర్పుగోదావరి జిల్లాలో వైరల్ అవుతోంది. అనపర్తి రోడ్డుకు మరమ్మతులు చేయాలని గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు.
ఏపీలో చాలా ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలు వివిధ రూపాల్లో నిరసనలు చేస్తున్నాయి. జనసేన పార్టీ కూడా రోడ్ల మరమ్మతులు చేపట్టాలని తీవ్రస్థాయిలో నిరసనలు చేసింది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా వీలు దొరికినప్పుడల్లా రోడ్ల స్థితిపై ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇవాళ కూడా వడ్డేశ్వరంలో రోడ్లపై గుంతలు పూడ్చి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ ఫొటోతో వెలిసిన ఫ్లెక్సీలు వైరల్ అవుతున్నాయి.
Also Read: కొడుకు పెళ్లి కోసం ఊరికి రోడ్డు... ఓ తండ్రి ఆలోచనపై గ్రామస్తుల హర్షం
Don't think anybody in the Country has received this honor.. hehe pic.twitter.com/x01PO6yzfs
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) December 12, 2021
జగన్ ఫ్లెక్సీలు వైరల్
తూర్పు గోదావరి జిల్లాలో సీఎం జగన్ ఫొటోలతో వెలిసిన ఫ్లెక్సీలు వైరల్ అవుతున్నాయి. జిల్లాలోని అనపర్తి కెనాల్ రోడ్డు గుంతలమయంగా మారింది. ఈ రోడ్డును మరమ్మతులు చేయాలంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త అంటూ గోతుల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అనపర్తి- బలభద్రపురం మధ్య సీఎం జగన్ ఫొటోతో ఉన్న ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త అంటూ రోడ్డు వేసేవరకు ఫ్లెక్సీ తీయకూడదు అని తీసిన వారు రోడ్డుపైనే పోతారు అని ఫ్లెక్సీ పెట్టారు. 'జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త... ఈ బోర్డు వేసే వరకు ఏవరైనా తొలగిస్తే వారి కుటుంబాలు ఈ రోడ్లపైనే పోతాయి' అని గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు పెట్టారు.
ప్రభుత్వం ఏంచెబుతుందంటే...
గోదావరి జిల్లాలో రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నాయని స్థానికులు అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్థానికులు చొరవ చూపి సొంత ఖర్చులతో తమ గ్రామాల్లో రోడ్లు వేసుకుంటున్నారు. ఏపీలో అత్యధిక ప్రాంతాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ముఖ్యంగా డెల్టా ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. రోడ్ల మీద ప్రయాణించాలంటే ప్రజలకు నరకయాతన తప్పడం లేదు. మరమ్మత్తులు చేసేందుకు వర్క్ ఛార్జ్ సిబ్బంది లేకపోవడం ప్రధాన కారణంగా అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నిధులు వెచ్చించకపోవడం, కాంట్రాక్టర్ల పెండింగు బిల్లులు చెల్లించకపోవడం అసలు కారణమనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా రోడ్ల పరిస్థితులు బాగోలేదని చెబుతూనే గత ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తుంది. వర్షాకాలం ముగియగానే రోడ్లకు మరమ్మత్తులు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
Also Read: ఏపీలో శాంతి భద్రతలు దిగజారాయి... తిక్కారెడ్డిపై దాడి ఘటనపై డీజీపీకి చంద్రబాబు లేఖ