Vijayanagaram News: ఎస్పీ బాలు పాటలు వినిపిస్తూ వృద్ధురాలికి సర్జరీ - విజయనగరం జిల్లా వైద్యుల ఘనత
Andhra News: విజయనగరం జిల్లా రాజాంలో జీఎంఆర్ కేర్ ఆస్పత్రి వైద్యులు ఓ వృద్ధురాలికి ఎస్పీ బాలు పాటలు చూపించి శస్త్రచికిత్స నిర్వహించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా సంగీతం సాయంతో ఆపరేషన్ చేశారు.
Doctors Doing Surgery To Old Woman By Showing SP Balu Songs: మ్యూజిక్.. మాటల్లో చెప్పలేని అద్భుతం. సంగీతంతో రాళ్లు కూడా కరుగుతాయనేది నానుడి. ఆహ్లాదకరమైన సంగీతం వింటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి సంగీతంతోనే వైద్యులు ఓ వృద్ధురాలికి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. లెజండరీ సింగర్ ఎస్పీ బాలు పాటలు చూపిస్తూ ఆమెకు ఆపరేషన్ చేశారు. ఈ ఘటన విజయనగరం (Vijayanagaram) జిల్లాలో జరిగింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాం (Rajam) పట్టణానికి చెందిన నల్ల సత్యవతి (65) కాలు చేయి పనిచేయకపోడంతో కుటుంబీకులు జీఎంఆర్ కేర్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెదడులో రక్తస్రావం జరుగుతున్నట్టుగా గుర్తించారు. అయితే అప్పటికే గుండె వ్యాధితో బాధపడుతున్న ఆమెకు మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ చేస్తే కోలుకోవడం కష్టమై ప్రాణాపాయం ఏర్పడే పరిస్థితి ఉందని గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేయాల్సి రావడం.. ఇలాంటి స్థితితో వైద్యులకు సవాల్‌గా మారింది. దీంతో వృద్ధురాలు మెలకువగా ఉండగానే మెదకుడు ఆపరేషన్ చేయాలని కుటుంబ సభ్యులకు చెప్పగా వారు అంగీకరించారు.
ఎస్పీ బాలు పాటలు చూపిస్తూ..
ఈ క్రమంలో సంగీతం సాయంతో వృద్ధురాలికి వైద్యులు ఆపరేషన్ చేశారు. లెజండరీ సింగర్ ఎస్పీ బాలు పాడిన 'మాటే రాని చిన్నదాన్ని..' పాటతో సహా ఆమెకు ఇష్టమైన కొన్ని పాటలను చూపించి శస్త్రచికిత్స నిర్వహించారు. దీంతో కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె ఎప్పటిలాగే కాళ్లు చేతులు పని చేస్తూ ఆరోగ్యంగా కోలుకుంది. అయితే ఇటువంటి అరుదైన శస్త్ర చికిత్స రెండు జిల్లాల్లో ఇప్పటివరకు జరగలేదని ఇదే మొదటిసారి జరిగిందని జీఎంఆర్ కేర్ హాస్పిటల్ డైరెక్టర్ రాజేంద్ర తెలిపారు. శస్త్ర చికిత్సను విజయవంతంగా చేసిన న్యూరో సర్జన్ డాక్టర్ వినోద్ కుమార్‌ను, మత్తు డాక్టర్ కిరణ్ కుమార్‌ను సిబ్బందిని అభినందించారు.
'తమకు ఇష్టమైన సంగీతం వినడం వల్ల నరాలు తేలికపడుతాయి. రోగులు సుపరిచితమైన పాటలు వినడం ద్వారా ఆపరేషన్ ప్రక్రియ సౌలభ్యంగా, పరధ్యానాన్ని సృష్టిస్తాయి. పీడియాట్రిక్ రోగులు ప్రక్రియల సమయంలో కార్టూన్లతో నిమగ్నమైనట్లే, వృద్ధులకు క్లిష్ట సమయాల్లో ఆపరేషన్ చేయాల్సి వస్తే వారి ఆందోళనను మధురమైన సంగీత వినిపించడం ద్వారా తగ్గించవచ్చు. విజయవంతమైన ఫలితం కోసం ఇలా కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది.' అని వైద్యులు పేర్కొన్నారు.