Kalyan Ram Hot Comments: ఎటు ఉండాలో ఎలక్షన్ టైంలో నేను తారక్ నిర్ణయించుకుంటాం- ఏపీ రాజకీయాలపై కల్యాణ్‌రామ్ హాట్ కామెంట్స్
వైసీపీ కామెంట్లు చేసినా, టీడీపీ కవర్ చేసుకోవాలని చూసినా.. కల్యాణ్ రామ్ వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది.
Nandamuri Kalyanram Comments On AP Politics: హీరో కల్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram ) కొత్త సినిమా డెవిల్(Devil) విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆయన మీడియాకు వరుస ఇంటర్వ్యూలిస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలలో సినిమా టాపిక్ తో పాటు రాజకీయాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అధికారాన్ని నిలబెట్టుకోడానికి వైసీపీ(YSRCP), ఎలాగైనా జగన్(Jagan) ని పడగొట్టాలని టీడీపీ(TDP)-జనసేన(Janasena) కృత నిశ్చయంతో ఉన్నాయి. ఈ దశలో కల్యాణ్ రామ్ ఏవైపు ఉంటారు..? ఏపీ రాజకీయాలపై ఆయన కామెంట్ ఏంటి అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. అయితే ఆ సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంతకీ కల్యాణ్ రామ్ ఎటువైపు..?
నందమూరి తారక రామారావు(NTR) మనవళ్లుగా కల్యాణ్ రామ్ కానీ, జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) కానీ.. టీడీపీకే సపోర్ట్ చేయాలి. కానీ కల్యాణ్ రామ్ తన ఇంటర్వ్యూలో నేరుగా ఆ మాట చెప్పలేదు. ఆలోచించి చెబుతామన్నారు. ఇందులో ఆలోచించడానికేముంది..? అనేదే అసలు ప్రశ్న. కల్యాణ్ రామ్ ఏపీ రాజకీయాల్లో ఏ పార్టీకయినా సపోర్ట్ చేస్తే.. కచ్చితంగా అది టీడీపీ అయి ఉండాలి. అది మినహా వేరే పార్టీకి ఆయన సపోర్ట్ చేయలేరు. అలాగని టీడీపీకి వ్యతిరేకంగానూ మాట్లాడలేరు. మరి ఇక్కడ కూడా ఆయన ఆలోచించి చెబుతామని ఎందుకన్నారు..? తాను తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ చర్చించుకుని ఓ నిర్ణయానికి వస్తామని ఎందుకు చెప్పారు..? అంతగా చర్చించాల్సిన అంశాలేముంటాయి..? పోనీ చర్చించాక అయినా టీడీపీని కాదని వేరే పార్టీకి వారు మద్దతు తెలపగలరా..? ఈ ప్రశ్నలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.
వైరల్ చేస్తున్న వైసీపీ..
ప్రస్తుతం వైసీపీ నేతలు ఈ వ్యాఖ్యల్ని వైరల్ చేస్తున్నారు. టీడీపీకి కల్యాణ్ రామ్ మద్దతు లేదని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీకి సపోర్ట్ చేయట్లేదని, దానికి కల్యాణ్ రామ్ వ్యాఖ్యలే నిదర్శనం అంటున్నారు. వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి కల్యాణ్ రామ్ వీడియో వైరల్ అవుతోంది. వైసీపీ బ్యాచ్ కామెంట్లు కూడా టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నాయి.
ఎందుకిలా..?
కల్యాణ్ రామ్ టీడీపీ విషయంలో అలాంటి కామెంట్ చేసి ఉండాల్సింది కాదు. కానీ ఆయనకు అది తప్పనిసరిగా మారింది. ఎందుకంటే..? త్వరలో డెవిల్ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ టైమ్ లో ఆయన పొలిటికల్ వ్యాఖ్యలు చేస్తే కచ్చితంగా అది సినిమాకి నష్టమేనని చెప్పాలి. పవన్ కల్యాణ్ సినిమాలకు ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. ఓ సినిమా రిలీజ్ టైమ్ లో టికెట్ రేట్లు తగ్గిస్తారు, ఇంకో సినిమా రిలీజ్ టైమ్ లో స్పెషల్ షోలు ఇవ్వరు, పవన్ బర్త్ డే వస్తే అసలు ప్లాస్టిక్ బ్యానర్లపైనే బ్యాన్ విధిస్తారు. ఇలాంటి టైమ్ లో ఏపీలో డెవిల్ కలెక్షన్లపై తన వ్యాఖ్యల ప్రభావం పడుతుందేమోనని కల్యాణ్ రామ్ ఆలోచించినట్టు టీడీపీ వర్గాలంటున్నాయి. నందమూరి హరికృష్ణ తనయుడుగా కల్యాణ్ రామ్ కి కూడా టీడీపీపై అధికారం, బాధ్యత ఉందని.. ఆ బాధ్యతను ఆయన తప్పించుకోలేరని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వంతో లేనిపోని గొడవలు ఎందుకని కల్యాణ్ రామ్ సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు. ఏపీలో ఎన్నికల టైమ్ కి నందమూరి ఫ్యామిలీ అంతా ఒకే తాటిపైకి చేరుతుందని, ఈసారి టీడీపీ అధికారంలోకి రావడం గ్యారెంటీ అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
వైసీపీ కామెంట్లు చేసినా, టీడీపీ కవర్ చేసుకోవాలని చూసినా.. కల్యాణ్ రామ్ వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై అధికారికంగా ఇంకా ఎవరూ స్పందించలేదు. అటు టీడీపీ, ఇటు వైసీపీ సానుభూతిపరులు మాత్రం కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.