YSRCP Internal Fight : వైసీపీలో పెరిగిపోతున్న నేతల మధ్య గొడవలు - పార్టీ పెద్దల ముందే కొట్టుకున్న పొన్నూరు నేతలు !
పొన్నూరు వైఎస్ఆర్‌సీపీలో ముదురుతున్న అంతర్గత వివాదాలు. రీజనల్ కోఆర్డినేటర్ ముందు రోశయ్య, రావి వర్గాలు కొట్టుకున్నాయి.
YSRCP Internal Fight : నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య వివాదాలను పరిష్కరించేందుకు వైఎస్ఆర్‌సీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాల్లో ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. పొన్నూరు నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు ఐ ప్యాక్ సిబ్బందితో కలిసి రీజనల్ కోఆర్డినెటర్ మర్రి రాజశేఖర్ పార్టీ నేతలతో సమవేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే రోశయ్య వర్గంతో పాటు రావి వెంకటకరమణ వర్గం నేతలు కూడా హాజరయ్యారు. మధ్యలో ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరగడంతో. దాడులకు దిగారు. దీంతో ఐ ప్యాక్ సిబ్బంది..మర్రి రాజశేఖర్ ఆందోళనకు గురయ్యారు.
నేతలపై సీరియస్ అయిన మర్రి రాజశేఖర్
పార్టీ సమావేశంలో అంతర్గతంగా చర్చించుకోవాల్సింది పోయి పరస్పర దాడులకు దిగడంపై. . మర్రి రాజశేఖర్ ఇరవురు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీ క్రమశిక్,ణను దాటితే సహించేది లేదని.. పార్టీ హైకమాండ్ కు నివేదిక ఇచ్చి చర్యలకు సిఫారసు చేస్తానని హెచ్చరించారు. దాంతో పార్టీ నేతలు మళ్లీ తమ వాదన వినిపించేందుకు ప్రయత్నించారు.
గత ఎన్నికల్లో రావి వెంకటరమణను కాదని రోశయ్యకు టిక్కెట్
ఎమ్మెల్యే కిలారి రోశయ్య గత ఎన్నికల్లో చివరి క్షణంలో టిక్కెట్ తెచ్చుకున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి రావి వెంకటరమణ వైసీపీలో పని చేసుకుంటున్నారు. 2014లో ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లోనూ ఆయనే పోటీ చేస్తారని అనుకున్నారు కానీ.. సర్వేలు అనుకూలంగా రాలేదు. ఆ నియోజకవర్గంలో బలంగా ఉండే కాపు సామాజికవర్గం నుంచి నేతను నిలబెట్టాలనే ఆలోచనతో రావి వెంకటరమణను పక్కన పెట్టి.. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు అయిన కిలారి రోశయ్యకు చాన్స్ ఇచ్చారు. ఆయన అనూహ్యంగా విజయం సాధించారు. అయితే వ్యక్తిగత ప్రవర్తన ఇతర కారణాల వల్ల ఆయనపై అసంతృప్తి పెరిగిపోయిందన్న అభిప్రాయం పార్టీలో ఉంది.
ఇటీవల రావి వెంకటరమణ పార్టీ నుంచి సస్పెండ్ - అయినా పార్టీ కార్యక్రమాల్లోనే నేత
కానీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు ..సీఎం జగన్ వద్ద చనువు ఉంది. అందుకే ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో పార్టీకి నష్టం చేస్తున్నారని రావి వెంకటరమణపై ఫిర్యాదు చేశారు. కొన్నాళ్ల క్రితం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కానీ.. ఆయన అనుచర వర్గం మొత్తం.. త్వరలోనే నిజాలు తెలుసుకుంటారని.. రావి వెంకటరమణను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించి టిక్కెట్ ఇస్తారని భావిస్తున్నారు. అందుకే పార్టీ సమావేశాలు ఎక్కడ జరిగినా తమ నేత వాయిస్ వినిపిస్తున్నారు. రావి వెంకటరమణ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీీ సస్పెన్షన్ ఎత్తి వేసినట్లుగా అధికారికంగా ప్రకటించలేదు.