Andhra Pradesh: జాకీ పరిశ్రమ తరలిపోవడానికి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డే కారణం, డీఎస్పీకి సీపీఐ నేతలు ఫిర్యాదు
Andhra Pradesh:: రాప్తాడు సమీపంలో జాకీ పరిశ్రమ తరలిపోవడానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డే కారణమనంటూ సీపీఐ నాయకులు అనంతపురం డీఎస్పీ ప్రసాద్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
Andhra Pradesh: అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలో జాకీ పరిశ్రమ తరలిపోవడానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డే కారణమంటూ సీపీఐ నాయకులు జిల్లా డీఎస్పీ ప్రసాద్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై సుమోటగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ కోరారు. ఆయనతో పాటు జిల్లా కార్యదర్శి జాఫర్, రైతు సంఘం నాయకులు ఉన్నారు. జాకీ పరిశ్రమ తరలిపోవడాని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డే కారణం అని అన్నారు. ఎమ్మెల్యే అయినంత మాత్రాన ప్రకాష్ రెడ్డి తోపా.. లేకుంటే మోర్కా.. అంటూ కామెంట్లు చేశారు. ప్రతిపక్ష పార్టీగా అందరూ స్పందిస్తారని, దీనికి ఎమ్మెల్యే సరైన సమాధానం చెప్పాలన్నారు.
ప్రకాష్ రెడ్డిది తరచూ పార్టీలు మార్చే నైజాం అని ఘాటుగా విమర్శించారు. ఐదేళ్లు ఎమ్మెల్యేగా రామకృష్ణ పని చేసినా సొంత ఇల్లు లేదని, మీలాగ కురబల ఇంటిని కబ్జా చెయ్యలేదని అన్నారు. కమ్యూనిస్టు పార్టీల కార్యాలయాలను ముట్టడిస్తామని తోపుదుర్తిలో చందు మాట్లాడుతాడా.. అంటూ ఫైర్ అయ్యారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని తెగేసి చెప్పారు. రాప్తాడు నియోజకవర్గంలో ఒక్క పని అయినా చేశావా అంటూ ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు. ప్రకాష్ రెడ్డి క్యారెక్టర్ ను సొంత సోదరులే చంపేస్తున్నారంటూ జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు.
ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై పరిటాల సునీత ఫైర్...
జాకీ పరిశ్రమకు కేటాయించిన భూములను తిరిగి రైతులకు అప్పగించే దమ్ము రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉందా అంటూ మాజీ మంత్రి పరిటాల సునీత ప్రశ్నించారు. గాండ్లపర్తిలో రైతుల కోసం పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు. రైతుల కోసం ముసలి కన్నీరు కార్చే ప్రకాష్ రెడ్డి రైతులకు చేసిందేమీ లేదని తేల్చి చెప్పారు. పోలీసులను అడ్డంపెట్టుకుని తన పాదయాత్ర కార్యక్రమాలకు అనేకమైన ఆటంకాలు కలగజేస్తున్నారని ఆరోపించారు. ఏదేమైనా రైతుల కోసం పాదయాత్ర విజయవంతం చేస్తానని.. అవసరమైతే రైతుల కోసం జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధం అన్నారు.
పాదయాత్ర చేపడతామని తాము 15 రోజుల కిందట వెల్లడించామని మాజీ మంత్రి పరిటాల సునీత తెలిపారు. కానీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సీఎం జగన్ పేరు చెప్పి ఏదో కార్యక్రమం నిర్వహించారు. అయినా పోలీసులకు గౌరవం ఇచ్చి ఒకరోజు తరువాత నేడు పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. శాంతియుతంగా పాదయాత్ర చేయాలని పోలీసులు సూచించగా, మేం అదే విధంగా పాదయాత్ర చేస్తున్నామని.. కేవలం రైతుల సమస్యలు తెలుసుకుని వారికి అండగా నిలుస్తామన్నారు. యద్ధం చేయడానికి రాలేదని, బాంబులు, కత్తులు, కటార్లు లాంటివి తీసుకురాలేదని.. ఆటంకాలు కలిగించకూడదన్నారు. శాంతియుతంగా మేం చేస్తున్న యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, కానీ వందలాది మంది పోలీసులను ఇక్కడికి రప్పించి అదనపు భద్రతా చర్యలు చేపట్టడం సరికాదన్నారు.
కేవలం పాదయాత్ర చేసి రైతుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఉద్దేశపూర్వకంగా పెద్ద సంఖ్యలో ఇక్కడికి రప్పించారని, విజిల్స్ వేయకూడదు అంటూ ఎన్నో ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు. పాదయాత్రలో పాల్గొంటున్న వారికి పథకాలు రావని బెదిరింపులకు పాల్పడుతున్నారని, మూడేన్నరేళ్లు అయిందని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేరు కూడా నియోజకవర్గ ప్రజలకు తెలియదని ఎద్దేవా చేశారు. కొందర్ని మీ ఎమ్మెల్యే ఎవరు అని అడిగితే.. సీఎం జగన్ పేరు చెబుతున్నారని, రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పరిస్థితి ఇలా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం అంత వయసు కూడా లేని ప్రకాష్ రెడ్డి టీడీపీ అధినేతపై కామెంట్లు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.