TDP And Janasena: టీడీపీ-జనసేన పొత్తులో మరో కీలక స్టెప్, మూడ్రోజుల పాటు సమన్వయ సమావేశాలు
TDP And Janasena: రేపటి నుంచి మూడ్రోజుల పాటు టీడీపీ-జనసేన సమన్వయ సమావేశాలు జరగనున్నాయి. జిల్లా స్థాయి నేతలు భేటీ కానున్నారు.
TDP And Janasena: ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పొత్తులపై రెండు పార్టీలు అధికారిక ప్రకటన చేయగా.. పరస్పర సమన్వయంతో ముందుకెళ్తున్నాయి. కలిసి సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవడంతో పాటు ఎలా ముందుకెళ్లాలనే విషయంపై చర్చించుకుంటున్నారు. ఇటీవల రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. టీడీపీ-జనసేన మధ్య జరిగిన తొలి సమన్వయ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు.
జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని రెండు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఏపీలోని కరువు పరిస్థితులు, రైతు సమస్యలపై ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ తీర్మానం కూడా చేశారు. దీంతో పాటు ఉమ్మడి మ్యానిఫెస్టోపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. టీడీపీ ఇప్పటికే ఆరు గ్యారెంటీల పేరుతో మినీ మ్యానిఫెస్టో ప్రకటించింది. ఈ మ్యానిఫెస్టో బాగుందని కితాబిచ్చిన పవన్.. జనసేన సిద్దాంతాలకు అనుగుణంగా కొన్ని మార్పులు సూచించారు. ఈ మార్పులపై టీడీపీ కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేయగా.. నవంబర్ 1న ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రకటించనున్నారు.
ఈ క్రమంలో పొత్తులో టీడీపీ, జనసేన మరో అడుగు ముందుకేశాయి. రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీలు ఏకమవ్వగా.. జిల్లా స్థాయిలో కూడా నేతల మధ్య సమన్వయం కుదిరేలా కార్యాచరణ రూపొందించారు. అందులో భాగంగా ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జిల్లా స్థాయిలో టీడీపీ-జనసేన సమన్వయ సమావేశాలు జరగనున్నాయి. 29, 30,31వ తేదీల్లో ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. ఇరు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సమన్వయ సమావేశాలకు సీనియర్ నేతలు హాజరుకానున్నారు. జిల్లా స్థాయిలో ఎలా కలిసి పనిచేయాలనే అంశంతో పాటు ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేయడంపై చర్చించనున్నారని తెలుస్తోంది. జిల్లా స్థాయిలో కూడా రెండు పార్టీల నేతల మధ్య సమన్వయం ఏర్పడటానికి ఈ సమావేశాలు కీలకంగా మారనున్నాయి. ఈ సమావేశాలను రాష్ట్రస్థాయి నేతలు పర్యవేక్షించనున్నారు.
ఈ సమావేశాల్లో ఎలాంటి అంశాలు చర్చించాలనే దానిపై ఇటీవల జనసేన పొలిటికల్ అపైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ జనసేన జిల్లా అధ్యక్షులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయిలో టీడీపీతో నేతలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై పలు సూచనలు చేశారు. జిల్లా స్థాయిలో టీడీపీ నేతలను కలవాలని, వారితో కలిసి కార్యక్రమాలకు ప్లాన్ చేయాలని తెలిపారు. ఏపీలో ఎన్నికలకు కొద్ది నెలలు మాత్రమే సమయం ఉంది. దీంతో పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి. మొన్నటివరకు లోకేష్ యువగళం పాదయాత్ర, చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారెంటీ యాత్ర, పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రతో ప్రజల్లోనే ఉన్నారు. ఇటీవల చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ కార్యక్రమాలకు బ్రేక్ పడింది. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ కార్యక్రమాలు చేపడుతుంది. ప్రజా సమస్యలపై ప్రశ్నించడంపై టీడీపీ దృష్టి పెట్టలేదు. చంద్రబాబు అరెస్టైన సమయంలో టీడీపీతో పొత్తుపై పవన్ చేసిన ప్రకటన తెలుగు తమ్ముళ్లకు కాస్త ధైర్యం ఇచ్చింది.