YS Sharmila: 'ఏదో ఆశించి నేను పాదయాత్ర చేయలేదు' - వైఎస్సార్ పాలనకు, జగనన్న గారి పాలనకు పొంతన లేదన్న షర్మిల
YS Sharmila Speech: వైఎస్ ఆశయ సాధన కోసమే తాను కాంగ్రెస్ లో చేరానని ఏపీసీసీ చీఫ్ షర్మిల పునరుద్ఘాటించారు. వైసీపీ నేతల విమర్శలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
![YS Sharmila: 'ఏదో ఆశించి నేను పాదయాత్ర చేయలేదు' - వైఎస్సార్ పాలనకు, జగనన్న గారి పాలనకు పొంతన లేదన్న షర్మిల congress leader ys sharmila comments on cm jagan YS Sharmila: 'ఏదో ఆశించి నేను పాదయాత్ర చేయలేదు' - వైఎస్సార్ పాలనకు, జగనన్న గారి పాలనకు పొంతన లేదన్న షర్మిల](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/26/d6b82bba3a8ff6d2cbdf1ba3ce7adb4f1706259527830876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
YS Sharmila Counter to Yscrp Leaders Comments: ఏదో ఆశించి తాను పాదయాత్ర చేయలేదని.. ఏదో ఆశించి ఎప్పుడూ తన అన్న జగన్ వద్దకు తాను వెళ్లలేదని ఏపీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila) అన్నారు. విజయవాడలోని (Vijayawada) పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆమె పాల్గొని.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వైసీపీ నేతలు తనపై చేస్తున్న విమర్శలపై కౌంటర్ ఇచ్చారు. ఎవరో తనకు కితాబు ఇస్తే తన విలువ ఎక్కువ కాదని.. కితాబు ఇవ్వకపోయినా తన విలువ తక్కువ కాదని అన్నారు. 'నేను వైఎస్సార్ రక్తం. రాజశేఖర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిల కాకుండా ఎలా పోతుంది.?. నా కుమారుడికి వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టుకున్నా. నాకు చాలా దగ్గర మనిషి కొండా రాఘవరెడ్డి కూడా నేను అడిగి పాదయాత్ర చేశానని మాట్లాడారు. భారతమ్మ చేయాలనుకున్న పాదయాత్ర నేను చేశానట. స్వార్థం కోసమే పాదయాత్ర చేశానని అంటున్నారు. మీ ఆరోపణలు నిజం కాదని నేను ప్రమాణం చేయగలను. మీరు చేయగలరా.?. మేము అక్రమ సంపాదనకు స్కెచ్ వేశామని అంటున్నారు. నా భర్త అనిల్ ఒక్కరోజు కూడా జగన్ ను కలవలేదు. అధికారంలోకి వచ్చాక నేను మా అమ్మ విజయమ్మతో ఒక్కసారి మాత్రమే జగన్ వద్దకు వెళ్లాను. ఇవాళ్టి వరకూ ఏదీ ఆశించి నేను జగన్ వద్దకు వెళ్లలేదు. అందుకు మా అమ్మే సాక్ష్యం. దమ్ముంటే విజయమ్మను అడగండి. వైఎస్సార్ ఆశయ సాధన కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను.' అని షర్మిల వ్యాఖ్యానించారు.
'రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు'
అన్ని వర్గాల వారి కోసం అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని.. ఆయన భారీ విగ్రహాలు పెడితే పేదల ఆకలి తీరదని షర్మిల అన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు వంద శాతం పెరిగాయని మండిపడ్డారు. అంబేడ్కర్ గురించి గొప్పలు చెప్పడం కాదని.. ఆయన ఆశయాలను అమలు చేయాలని హితవు పలికారు. 'కొందరు నియంతల్లా మారి రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ నిధులను దారి మళ్లించి సొంత అవసరాలకు వాడుకున్నారు. దళితులపై కపట ప్రేమ చూపే వారికి తగిన బుద్ధి చెప్పాలి. ప్రాంతీయ పార్టీల బడుగు, బలహీన వర్గాలను సమానంగా చూడడం లేదు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీలకు మద్దతు తెలపబోమని ప్రజలు ప్రమాణం చేయాలి.' అని పిలుపునిచ్చారు.
పార్టీ నేతలతో సమావేశం
అనంతరం, కృష్ణా జిల్లా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో షర్మిల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు గిడుగు రుద్రరాజు, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, కొప్పుల రాజు, పల్లం రాజు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. 'నేను వైఎస్ రక్తం. పులి కడుపున పులే పుడుతుంది. వైఎస్సార్ పాలనకు జగనన్న గారి పాలనకు చాలా వ్యత్యాసం ఉంది. వైఎస్ హయాంలో పోలవరం పనులు 32 శాతం పూర్తి చేశారు. రూ.5 వేల కోట్లు ఖర్చు చేశారు. ఆయన మరణం తర్వాత ప్రాజెక్ట్ పక్కన పడింది. చంద్రబాబు వచ్చినా, జగనన్న గారు వచ్చినా ప్రాజెక్టు ముందుకు కదలలేదు. వైఎస్సార్ 17 శాతం నిధులు కేటాయిస్తే.. జగనన్న కేవలం 2.5 శాతం నిధులు ఖర్చు చేశారు. ఏపీలో 19 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతున్నారు. బీజేపీతో దోస్తీ కోసం చంద్రబాబు, జగన్ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. 25 మంది ఎంపీలను ఇస్తే ఒక్క రోజు కూడా హోదాపై మాట్లాడలేదు. పోలవరం లేదు, రాజధాని లేదు, ప్రత్యేక హోదా లేదు.. ఉన్నవన్నీ అప్పులే. ఒక్క సీటు లేని బీజేపీ రాష్ట్రాన్ని శాసిస్తోంది. అభివృద్ధి కావాలంటే రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. హస్తం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్దాం.' అని షర్మిల నేతలకు పిలుపునిచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)