(Source: ECI | ABP NEWS)
Andhra Pradesh News: సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో ప్రయాణించిన కామన్ మ్యాన్, తర్వాత జరిగింది ఇదీ
AP CM Chandrababu | కొవ్వూరు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు వాహనంలో డప్పు కళాకారుడు, చర్మకారుడు ప్రయాణించి తన సమస్యలను వివరించారు. సమస్యలు తీర్చుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Common Man Travelled in CM Convoy | కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పేదల సేవలో కార్యక్రమంలో పాల్గోనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ కిరాణా దుకాణం వద్ద ఆగారు. దుకాణదారు వ్యాపారం ఎలా ఉందంటూ వాకబు చేశారు. కిరాణా దుకాణాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దు కోవచ్చో దుకాణ యజమానికి సూచనలిచ్చారు. అదే సమయంలో ఆ దుకాణం వద్ద వస్తువులు కొనుగోలు చేస్తున్న చర్మకారుడు పోశిబాబును ఆప్యాయంగా పలకరించారు.
ఇప్పుడు ఆ బెదిరింపులు తగ్గాయి
చర్మకార వృత్తిలో అవసరమైన ఉపకరణాలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటావని ఆరా తీశారు. పోశిబాబు చెప్పిన అంశాలను సీఎం ఆసక్తిగా విన్నారు. గతంలో వ్యాపారాలు చేసుకునే వారిని బెదిరించే వారని ఇప్పుడు ఆ బెదిరింపులు తగ్గాయని సీఎంకు కిరాణా దుకాణదారు వివరించారు. అనంతరం చెప్పులు కుట్టడంతో పాటు మేదరపని కూడా చేస్తానని పోశిబాబు సీఎం కు తెలిపారు. డప్పు కొట్టేవాళ్లకు ఇచ్చే పెన్షన్ అందుతోందా అంటూ పోశిబాబును సీఎం ఆరా తీశారు.
గతంలో రూ.1000.. ఇప్పుడు రూ.4 వేలు
గతంలో చంద్రబాబు ప్రభుత్వంలోనే వెయ్యి రూపాయల పెన్షన్ తీసుకున్నానని.. ఇప్పుడు రూ. 4 వేలు తీసుకుంటున్నానని సీఎంకు చెప్పారు. మీ కుల వృత్తిని కూడా చూస్తానంటూ పోశిబాబును తన కారులో కూర్చొబెట్టుకున్న సీఎం ఆయన ఇంటికి తీసుకెళ్లారు. కారులోనే మార్గమధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు- చర్మకారుడు పోశిబాబు మధ్య సుదీర్ఘ సంభాషణ చోటు చేసుకుంది. సుమారు రెండు కిలో మీటర్ల మేర పోశిబాబును తన కారులో వెంటపెట్టుకుని చర్మకారుని ఇంటికి చంద్రబాబు వెళ్లారు. కొవ్వూరు నియోజకవర్గంలోని ధర్మవరం నుంచి మలకపల్లి వరకూ తన కారులోనే పోశిబాబును ఎక్కించుకుని సీఎం ప్రయాణించారు. కారులో వెళ్తూ పోశిబాబుతో ముఖ్యమంత్రి వివిధ అంశాలపై మాట్లాడారు. పోశిబాబు నుంచి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. చర్మకారుడు పోశిబాబు కుటుంబ సభ్యుల వివరాలు, వాళ్లు ఏం చేస్తున్నారనే అంశంపై ఆరా తీశారు.

ముఖ్యమంత్రి పక్కన కూర్చొనే అవకాశం తనకు దేవుడిచ్చిన వరమని పోశిబాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే తాను పేదల గురించి తెలుసుకోవడానికే వచ్చానని సీఎం స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో తన లాంటి వాళ్లు చాలా ఇబ్బంది పడ్డారని.. రాష్ట్రం అడుగంటి పోయిందని పోశిబాబు ముఖ్యమంత్రితో అన్నారు. ప్రజలందరి జీవన ప్రమాణాలు మెరుగవ్వాలనేదే తన ప్రయత్నమని సీఎం చంద్రబాబు వివరించారు. అనంతరం డప్పు కళాకారుడిగా ఆయనకు రూ. 4 వేల రూపాయల పెన్షన్ ను అందించారు. 2018లో ఇల్లు ఇచ్చారు కానీ.. గత ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడం వల్ల తాను ఇంటిని కట్టుకోలేక పోయానని పోశిబాబు సీఎంకు ఫిర్యాదు చేశారు. కారు దిగి పోశిబాబు ఇంటికి వెళ్లి..ఆయన తయారు చేసిన డోలు, డప్పులు, చెప్పులు, మేదర వస్తువులను ముఖ్యమంత్రి పరిశీలించారు.
100 రోజుల్లోగా ఇంటి నిర్మాణం
పోశిబాబు ఇంటి గట్టుపై కూర్చొని ఆయనతో సుదీర్ఘంగా మాట్లాడిన చంద్రబాబు ఇంట్లోకి వెళ్లి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. పేదరికం నుంచి బయటపడాలంటే తానేం చేయాలని చంద్రబాబు ప్రశ్నించారు. తన ఇంటి నిర్మాణానికి సంబంధించిన బిల్లులు ఇప్పించాలని, చెప్పులు కుట్టే దుకాణం ఏర్పాటుకు ఆర్థిక సాయం కావాలని చర్మకారుడు పోశిబాబు సీఎం ను కోరారు. దీనిపై స్పందించిన సీఎం వెంటనే మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. 100 రోజుల్లోగా ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో పాటు అవసరమైతే తాను ఆర్థిక సాయం చేస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పోశిబాబు తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేసిన ముఖ్యమంత్రి ఆయనకు డబ్బులు చెల్లించారు. ముఖ్యమంత్రి స్వయంగా తమ ఇంటికి రావటం.. అనుకోని వరాలివ్వటంతో చర్మకారుడు, డప్పుకళాకారుడైన పోశిబాబు కుటుంబం అమితానందాన్ని వ్యక్తం చేసింది.





















