CM Jagan To Delhi : ఆరో తేదీన ఢిల్లీకి సీఎం జగన్ - మోదీ, అమిత్ షాలతో భేటీ అయ్యే అవకాశం !
ఆరో తేదీన సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని హోంమంత్రులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.
CM Jagan To Delhi : ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఢిల్లీ వెళ్లాలనుకున్నారు. కానీ అప్పట్ల అపాయింట్‌మెంట్లు ఖరారు కాకపోవడంతో వెళ్లలేదు. ఈ సారి ఖరారు కావడంతో ఢిల్లీ టూర్ పెట్టుకున్నారని చెబుతున్నారు. సీఎం జగన్ రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో ఉండే అవకాశం ఉంది.
ఏపీలో ముందస్తు ఎన్నికలపై కొంత కాలంగా చర్చజరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సైతం.. అక్టోబర్ నెలలోనే వస్తుండటం.. అది కూడా ఆరు నుంచి ఏనిమిదో తేదీ మధ్యన రిలీజ్ కావొచ్చనే సమాచారం వస్తున్న క్రమంలోనే.. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ షెడ్యూల్ ఖరారు కావడంతో మరోసారి చర్చ ప్రారంభమయింది. అయితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగాలంటే ముందు అసెంబ్లీని రద్దు చేయాలి. నోటిఫై చేయాలి. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈసీ స్వయంగా పర్యటించి సంతృప్తి చెందాలి. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తారు. ఇవాళ అసెంబ్లీ రద్దు చేసి.. రేపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం అనేది సాధ్యం కాదని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఈ వార్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఖండిస్తూ వస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఏపీలో ఎన్నికల 2024 ఏప్రిల్ నెలలో జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఏడు నెలల ముందు టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది. ఇలాంటి సమయంలో జగన్ ఢిల్లీకి వెళ్లి మోదీ, అమిత్ షాలతో భేటీ అవుతుండటంతో.. ఎన్నికలతోపాటు చంద్రబాబు అరెస్టు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. చంద్రబాబు అరెస్టుకు దారి తీసిన పరిణామాలు, శాంతిభద్రతల పరిస్థితుల గురించి ప్రధాని మోదీకి సీఎం జగన్ నివేదిక ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మరో వైపు ఏపీ ప్రభుత్వం తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంటోంది. అప్పులకోసం ప్రతీ వారం ఆర్బీఐ వద్ద బాండ్లు వేలం వేస్తున్నా.. నిధుల కొరత వెంటాడుతోంది. కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున బిల్లులు చెల్లించాల్సి ఉంది. వచ్చే జనవరిలోపు రూ. పదిహేను వేల కోట్లు బిల్లులు చెల్లింపులు చేయాల్సి ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆ నిధుల సమీకరణ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పెట్టనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ. పది వేల కోట్ల వరకూ ఇస్తారని భావిస్తున్నారు. మరికొన్ని అంశాల్లోనూ కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రానికి సీఎం జగన్ విజ్ఞప్తులు చేసే అవకాశం ఉంది.