Jagan Flight : సాయంత్రం సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ! రాత్రి ఢిల్లీకి బయలుదేరిన సీఎం జగన్
సీఎం జగన్ ఢిల్లీ బయలుదేరిన ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో మళ్లీ గన్నవరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. దీంతో ఆయన తిరిగి తాడేపల్లికి వెళ్లిపోయారు. అనంతరం రాత్రి 9 గంటలకు దిల్లీకి వెళ్లారు.
Jagan Flight : ఆంధ్రప్రదేస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరిన ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి గాల్లోకి లేచిన కాసేపటికే విమానం వెనక్కి తిరిగి వచ్చింది. గన్నవరం విమానాశ్రయంలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. తర్వాత జగన్ వెంటనే తాడేపల్లికి వెళ్లిపోయారు. తర్వాత అధికారులు విమానంలో తలెత్తిన సమస్యలపై ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. విమానం టేకాఫ్ అయిన తర్వాత ఏసీలో సమస్యను గుర్తించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం పై ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ఇదీ
ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు సన్నాహక సమావేశంకోసం ఢిల్లీ వెళ్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఏసీ వాల్వ్‌లో లీకేజి కారణంగా ప్రైజరైజేషన్ సమస్య తలెత్తిందని పైలట్ గుర్తించినట్టుగా ప్రాథమికంగా తెలిసిందని అధికారులు తెలిపారు. సమస్యను గుర్తించిన పైలట్ తిరిగి గన్నవరం విమానాశ్రయానికి మళ్లించారు. ఢిల్లీ పర్యటనకోసం ముఖ్యమంత్రి, అధికారుల బృందం సాయంత్రం 5:03 గంటలకు టేకాఫ్ అయ్యింది. కాసేపటికే పైలట్ విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. తిరిగి సాయంత్రం 5:27 గంటలకు గన్నవరంలో ల్యాండ్ అయ్యారు. సీఎం తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఢిల్లీకి బయల్దేరిన సీఎం జగన్
సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడానికి అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. సోమవారం రాత్రి 9 గంటలకు సీఎం జగన్ ఢిల్లీకి పయనమయ్యారు. సీఎం జగన్ వెంట సీఎస్ జవహర్‌రెడ్డి, సీఎం స్పెషల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఓఎస్డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి, సీఎస్‌వో చిదానందరెడ్డి దిల్లీ వెళ్లారు.
పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీకి ప్రయత్నాలు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై ఇటీవల విస్తృతంగా ప్రచారం జరిగింది. వరుసగా రెండు రోజుల పాటు ఆయన పర్యటనలు వాయిదా వేసుకోవడంతో.. ఏ క్షణమైనా ఢిల్లీకి వెళ్లవచ్చని అనుకున్నారు. అయితే చివరికి 30, 31వ తేదీల్లో వెళ్లాలని అనుకున్నారు. కానీ విమానంలో సాంకేతిక లోపంతో జగన్ ఢిల్లీ వెళ్లలేకపోయారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల అపాయింట్ మెంట్లను కూడా సీఎం జగన్ అడిగారని .. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా జగన్ భేటీ అవ్వాలనుకున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే వారి అపాయింట్‌మెంట్లపై క్లారిటీ లేదు.
అదనపు అప్పుల కోసం అనుమతి కోసం నిర్మలా సీతారామన్‌తో భేటీ అవ్వాలనుకున్న సీఎం జగన్
ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి. జీతాలు , పెన్షన్లు ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఆర్బీఐ ద్వారా మంగళవారం 1557 కోట్ల రుణం తీసుకుంటున్నారు. అయితే ఆ తర్వాత రుణ పరిమితి ఇక లేదు. ఇంకా ప్రభుత్వం ఓడీలోనే ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ కష్టాల నుంచి బయటపడాలంటే.. కేంద్రం మరింత ఉదారంగా సాయం చేయాల్సి ఉందని.. ఆ దిశగా కేంద్రానికి జగన్ విజ్ఞప్తి చేసే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ ఇప్పుడు .. జగన్ ఢిల్లీ చేరుకోలేకపోయారు. మంగళవారం ఉదయం చేరుకునే అవకాశం ఉంది.
తెలంగాణ సర్కార్‌పై గవర్నర్‌దే పైచేయి - హైకోర్టులో ఏం జరిగిందంటే ?