CM Jagan Review: వారికి కొత్త ఇళ్లు మంజూరు చేయాలి.. వెంటనే పనులు మొదలు పెట్టాలి
వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని.. సీఎం జగన్ అన్నారు. బాధితుల సమస్యలు విని.. పరిష్కారించాలన్నారు.
వరద బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల కలెక్టర్లతోపాటు అధికారులు ఇందులో పాల్గొన్నారు. తాగునీటి వసతుల పునరుద్ధరణపైనా దృష్టి పెట్టాలని సీఎం అన్నారు. చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగితే.. కాలువలు సహా ప్రత్యామ్నాయ విధానాల ద్వారా బయటకు పంపే ఏర్పాట్లు చేయాలని చెప్పారు. దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం, 104 కాల్ సెంటర్‌కు వచ్చిన కాల్స్.. పరిష్కారానికి తీసుకున్న చర్యలు, 2 వేల రూపాయల అదనపు సాయంపై సమీక్షలో మాట్లాడారు. వరదల తర్వాత చేపట్టాల్సిన పనులపైనా సీఎం జగన్ సమీక్షించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను ఆదుకొనేందుకు ఇంత వేగంగా చర్యలు తీసుకోవడం గతంలో ఎప్పుడూ లేదు. బాధిత కుటుంబాలకు అన్నిరకాలుగా పరిహారాన్ని అందించాం. ఇళ్లు ధ్వంసమైన వారికి, మరణించిన వారికి వారం రోజుల్లో ఆయా కుటుంబాలకు పరిహారం ఇచ్చి వారికి అండగా ఉన్నాం. రేషన్, నిత్యావసరాలతో పాటు రూ. 2వేలు సాయం చేశాం. నష్టపోయిన రైతులకు యుద్ధప్రాతిపదికన ఎన్యుమరేషన్ పూర్తిచేసి సీజన్ ముగిసేలోపు.. వారికి సాయం ఇస్తాం.
- వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి
ఇన్‌పుట్ సబ్సిడీ అందాలంటే ఒకప్పుడు.. కనీసం ఏడాది సమయం పట్టేదని సీఎం అన్నారు. కానీ ఇప్పుడు పంట నష్టపోయిన సీజన్ ముగిసేలోపు పరిహారం అందిస్తున్నామని చెప్పారు. అధికారులు పరిహారాన్ని వేగంగా అందించేలా ప్రణాళికలు చేశారన్నారు. వరదల వల్ల నష్టపోయిన వారికి కూడా సరైనా సమయంలో సాయం, పరిహారం అందించినా కూడా కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు.
'పంట నష్టంపై ఎన్యుమరేషన్ పూర్తయిన వెంటనే సోషల్ ఆడిట్ కూడా నిర్వహించాలి. పూర్తిగా ధ్వంసమైన ఇళ్ల స్థానంలోనే కొత్త ఇళ్లను మంజూరు చేయాలి. వెంటనే పనులు మొదలు పెట్టాలి. వారికి తాత్కాలిక వసతి ఏర్పాట్లకు చర్యలు చేపట్టాలి. చెరువులకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చెరువులకు మధ్య అనుసంధానం ఉండాలి. చెరువులు నిండగానే అదనంగా వచ్చే నీటిని నేరుగా కాల్వలకు పంపించే వ్యవస్థను నిర్మించాలి.' అని సీఎం జగన్ అన్నారు.
అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో నీటిని నిల్వచేయలేని పరిస్థితి ఏర్పడిందని సీఎం అన్నారు. చాలాచోట్ల తాగునీటి సరఫరాకు ఆధారమైన చెరువులకూ గండ్లు పడినట్టు చెప్పారు. పట్టణాలు, గ్రామాల్లో తాగునీటికి కొరత రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకొని బలమైన ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లినప్పుడు వచ్చే విజ్ఞప్తులపై ఉదారంగా స్పందించాలని సీఎం జగన్ కోరారు.
Also Read: CM Meet Central Team : విపత్తు నిర్వహణలో బాగా పని చేశారు.. సీఎం జగన్‌కు కేంద్ర బృందం అభినందన !