AP CM Jagan: శభాష్ సర్పంచ్.. గ్రామ సమస్యపై సీఎం జగన్‌కు లేఖ... సీఎం స్పందనతో అధికారులు పరుగులు
ఏపీలో ఓ గ్రామ సర్పంచ్ చేసిన పనికి అందరూ శభాష్ అంటున్నారు. గ్రామ సమస్యలపై నాకెందుకులే అని వదిలేయకుండా ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. దీంతో అధికారులు ఆఘమేఘాలపై పనులు ప్రారంభించారు.
ఏపీలో రహదారుల పరిస్థితులు అధ్వానంగా మారాయి. ప్రధాన రహదారులతో సహా, రాష్ట్ర, గ్రామస్థాయిలో రోడ్డు బాగా ఛిద్రమైపోయాయి. ఓ గ్రామంలో కూడా ఇలానే రోడ్లనీ గుంతలు పడి ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. అందరిలా ఈ సర్పంచ్ ఉండలేకపోయారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. రోడ్లు గుంతలతో నిండి ఉన్నాయని, రహదారిపై ప్రయాణించే ప్రయాణీకులకు ఇబ్బందులు పడుతున్నారని లేఖ రాశారు. రోడ్లు మరమ్మత్తులకు చర్యలు తీసుకోవాలని కోరిని సర్పంచ్ వినతికి సీఎం జగన్ స్పందించారు. రహదారి మరమ్మత్తులను చేపట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
ఏపీలో హాట్ టాపిక్
గ్రామాల్లో సమస్యలు ఉంటే ఆ గ్రామ సర్పంచ్ దే ముఖ్య విధి. కానీ నిధులకు మాత్రం అధికారులను సంప్రదించాల్సిందే. అధికారులు స్పందించకపోతే జిల్లా అధికారులకు లేఖలు రాస్తుంటారు. అప్పటికీ అధికారుల నుంచి ఎటువంటి సమాధానం రాకపోతే అధికార పార్టీ నేతలను సంప్రదిస్తారు. చివరికీ ఏదోలా తమ పనులను చేయించుకుంటారు. గ్రామ సమస్యలను సొంత ఎజెండాగా తీసుకుని అధికారులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు వరుస విన్నపాలు చేస్తుంటారు. కానీ ఓ మహిళా సర్పంచ్ చేసిన పని ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది. ఆమె చేసిన పనితో జిల్లా స్థాయి అధికారులు పరుగులు పెట్టాల్సి వచ్చింది.
Also Read: AP, TS Letters To KRMB : నదీ బోర్డుల భేటీకి ముందు లేఖల యుద్ధం..! ఏపీ, తెలంగాణ పరస్పర ఫిర్యాదులు..!
భళా బండి మహాలక్ష్మి
తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడి నుంచి గన్నవరం వరకు రోడ్లు గుంతలు పడి, పూర్తిగా పాడైపోయాయి. ఈ మార్గంలో రోడ్లు వేయాలని బెల్లంపూడి సర్పంచ్ బండి మహాలక్ష్మి సీఎం జగన్ కు లేఖ రాశారు. ఈ మార్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని సర్పంచ్ లేఖలో తెలిపారు. ఈ లేఖ సీఎం దృష్టికి వెళ్లింది. వెంటనే సీఎం కార్యాలయం ఈ ఉత్తరంపై స్పందించింది. రోడ్ల మరమ్మత్తులకు కావాల్సిన నిధులను విడుదల చేసింది. దీంతో పి.గన్నవరం నుంచి గంటి పెదపూడి వరకు రహదారి అధికారులు మరమ్మతులు చేపట్టారు. త్వరలోనే టెండర్లు పిలిచి రోడ్లు నిర్మిస్తామని సర్పంచ్ మహాలక్ష్మికి అధికారులు స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాల సర్పంచ్ లు సైతం ఇలాగే వ్యవహరించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
Also Read: RRR Vs YSRCP : కోర్టులపై దారుణమైన అభిప్రాయం ఉంది.. బొత్సపై రఘురామ ఆగ్రహం..!