RRR Vs YSRCP : కోర్టులపై దారుణమైన అభిప్రాయం ఉంది.. బొత్సపై రఘురామ ఆగ్రహం..!
న్యాయస్థానాలపై దారుణమైన అభిప్రాయంతో కోర్టు పరిధిలోని రాజధాని అంశంపై మంత్రి బొత్స దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారని రఘురామ వ్యాఖ్యానించారు. వైజాగ్‌ను రాజధానిగా పేర్కొన్న అంశంపై కేంద్రానికి లేఖ రాశారు.
మంత్రి బొత్స సత్యనారాణకు న్యాయస్థానాలపై దారుణమైన అభిప్రాయాలు ఉన్నాయని ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ముఖ్యంగా రాజధాని రైతులపై బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సీనియర్ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ రాజధానికి భూములిచ్చిన రైతులతో " మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్ " అని అనడమేమిటని మండిపడ్డారు. త్వరలో విశాఖకు రాజధానిని తీసుకెళ్తామన్న ఆయన వ్యాఖ్యలు చట్టబద్ధం కాదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ విహారయాత్రకు వెళ్లినప్పుడల్లా వేడి రాజేయడానికి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూంటారని విమర్శలు గుప్పించారు.
అసలు రాజధాని అంటే అర్థం ఏమిటని వైసీపీ నేతలను రఘురామ ప్రశ్నించారు. బుద్ది ఉన్న వారెవరూ మూడు రాజధానులు అనరన్నారు. లోక్‌సభకు కేంద్ర పెట్రోలియం శాఖ ఇచ్చిన సమాధానంలో ఏపీ రాజధాని వైజాగ్‌గా పేర్కొన్న అంశంపై కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ హోదాలో రఘురామకృష్ణరాజు లేఖలు రాశారు. ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో చెప్పాలని ఆయన కోరారు. కర్నూలులో మానవ హక్కుల కమిషన్ కార్యాలయాన్ని ప్రారంభించడంపైనా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ఏపీలో మానవ హక్కులు ఎక్కడ ఉన్నాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం వడ్డీలు కట్టడానికి సరిపోవడం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై లక్షా తొంభై నాలుగువేల కేసులు ఉన్నాయని .. వాటి తీవ్రత దృష్ట్యా కూడా నిర్ణయాన్ని పునంపరిశీలించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ప్రజలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో గేదెల స్విమ్మింగ్ పూల్స్ కట్టారని పత్రికల్లో వచ్చిన కుంటల ఫోటోలను చూపించారు. అలాగే రోడ్ల దుస్థితిపైనా విమర్శలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతారాహిత్య ప్రకటనలు చేయడంపై ఆలోచించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసినా దాచాలంటే దాగవని .. అప్పులు ఐదు లక్షల కోట్లు దాటిపోయాయన్న పత్రికా కథనాలను చూపిస్తూ వ్యాఖ్యానించారు. అదేసమయంలో కేంద్ర ప్రభుత్వం .. తమ పథకాల వాటాల కింద ఇచ్చే నిధులను కూడా బ్యాంకుల్లో చూపించి ఓడీలుగా అప్పులు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని రఘురామ ఆరోపించారు.
తాను ప్రకటించిన సర్వేలపై విమర్శలు చేసిన వైసీపీ నేతలపై రఘురామ మండిపడ్డారు. ఎవరి సర్వేలు హాస్యమో.. అపహాస్యమో తనకు తెలుసునన్నారు. తన సర్వేలకు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయన్నారు. ఇలా మాట్లాడేవాళ్లు ముఖ్యమంత్రి జగన్ చేయించుకుంటున్న సర్వేల వివరాలను బయట పెట్టాలని అన్నారు. ఎవరో మాట్లాడంటే తనపై ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడేవాళ్లకు ఎన్ని సార్లు తిట్టినా బుద్దిరాదా అనిప్రశ్నించారు. అందరికీ రఘురామ కృష్ణాష్టమి శుభాకాంక్షలు చెప్పారు. రాక్షసుడైన పాలకుడ్ని అంతమొందించడానికే కృష్ణుడు వచ్చాడని గుర్తు చేశారు.