Jagan Meets Modi: ప్రధాని మోదీని కలిసిన సీఎం జగన్, ఏం మాట్లాడారంటే!
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా జగన్ కలవనున్నారు. ఇతర కేంద్ర మంత్రులను కూడా సీఎం జగన్ కలిసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. గురువారం (మార్చి 16) సాయంత్రం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. పార్లమెంటు ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో జగన్, మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీతో చర్చించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సీఎం జగన్‌కు పార్లమెంటులో స్వాగతం పలికారు. వైఎస్ఆర్ సీపీ ఎంపీలు కూడా సీఎం జగన్ వెంట ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా జగన్ కలవనున్నారు.
- రాష్ట్ర విభజన జరిగి 9 సంవత్సరాలు కావొస్తున్నా.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చాలా ద్వైపాక్షిక అంశాలు పరిష్కారం జరగలేదు.
- గతంలో నేను ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై కేంద్రం ఆర్థికశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపి కొంత పురోగతి సాధించింది. కీలక అంశాలన్నీ ఇంకా పెండింగులోనే ఉన్నాయి.
- 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయి.
- గతంలో ఉన్న ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు వాడిందన్న కారణంతో ఇప్పుడు రాష్ట్ర రుణాల పరిమితులపై ఆంక్షలు విధించారు. 2021–22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లు తగ్గించారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
- పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖజానానుంచి రూ.2600.74 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా.. 2 సంవత్సరాలుగా ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను.
- పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించింది. వెంటనే దీనికి ఆమోదం తెలపాల్సిందిగా కోరుతున్నారు.
- పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10వేల కోట్లు మంజూరుచేయాలని కోరుతున్నాను.
- తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రావాల్సిన బకాయిలు అలానే ఉన్నాయి. 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ సరఫరాచేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉంది. వీటిని వెంటనే ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను.
మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ తిరుగు ప్రయాణం
ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన అనంతరం సీఎం జగన్ విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు. మూడు గంటలకు జన్ పథ్ నివాసం నుంచి బయలుదేరి 3.30 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకొని 3.45 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో రానున్నారు. 6 గంటలకు రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్నారు.
టీడీపీ నేతల వ్యంగ్యపు ట్వీట్లు
సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ నేతలు వ్యంగ్యపు ట్వీట్లు చేస్తున్నారు. ఓ వైపు వైఎస్ వివేకా హత్య కేసు.. ఇంకో వైపు లిక్కర్ కేసు.. రెండు కేసుల్లో సీబీఐ, ఈడీ దూకుడుగా ఉన్నాయి. అందుకే జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుందని టీడీపీ నేతలు అంటున్నారు.