![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
CM Jagan: నేడు ఢిల్లీకి సీఎం జగన్ - ప్రధాని మోదీతో భేటీ, ఎందుకంటే?
Andhrapradesh News: సీఎం జగన్ గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యి, ఏపీకి రావాల్సిన నిధుల గురించి చర్చించనున్నారు.
![CM Jagan: నేడు ఢిల్లీకి సీఎం జగన్ - ప్రధాని మోదీతో భేటీ, ఎందుకంటే? cm jagan delhi tour on february 8th and will meet pm modi CM Jagan: నేడు ఢిల్లీకి సీఎం జగన్ - ప్రధాని మోదీతో భేటీ, ఎందుకంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/08/a6e577317a699691aa7dce37d58d9be51707378302189876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
CM Jagan Delhi Tour: సీఎం జగన్ (CM Jagan) గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం ఢిల్లీ చేరుకోనున్న ఆయన.. శుక్రవారం ప్రధాని మోదీతో (PM Modi) భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు భేటీ అయ్యి ఏపీ అభివృద్ధి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఆయనతో సీఎం చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, తాజా రాష్ట్ర రాజకీయాలపైనా కూడా ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర అభివృద్ధి అంశాలు, పోలవరం నిర్మాణం, వెనుకబడిన జిల్లాలు, వైద్య కాలేజీలు సహా పలు అంశాలపై సీఎం పదే పదే కేంద్రానికి లేఖలు అందిస్తూ వచ్చారు. కాగా, ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన తన పర్యటన ముగించుకుని తిరుగు పయనమయ్యారు. జనసేనాని పవన్ కల్యాణ్ సైతం గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ క్రమంలో ప్రధానితో సీఎం భేటీ ప్రాధాన్యతను సంతరించుకోనుంది.
ముగిసిన చంద్రబాబు పర్యటన
అటు, మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన సైతం ముగిసింది. ఆయన బీజేపీ నేతలతో భేటీ అయిన క్రమంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బుధవారం అర్ధరాత్రి 11.30 గంటలు తరువాత కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమైన చంద్రబాబు సుమారు గంటపాటు చర్చించారు. వీరితో పాటు చర్చల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. ముగ్గురు నేతలు ఏం చర్చించుకున్నారన్న దానిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాకపోయినప్పటికీ.. రాష్ట్రంలో బీజేపీ పోటీ చేయాలనుకుంటున్న సీట్లు, పొత్తులో భాగంగా సీట్ల పంపకాలపై చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. మరోవైపు, గురువారం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలవబోతున్నారు. చంద్రబాబుతో జరిపిన చర్చలు విషయాలను పవన్ కల్యాణ్‌కు వారు వివరించనున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకాలు దాదాపు కొలిక్కి వచ్చాయి. బీజేపీ కోరుకున్న సీట్లను టీడీపీ, జనసేన ఇస్తాయా..? లేదా..? అన్న దానిపై ఇప్పుడు స్పష్టత రావాల్సి ఉంది. కాగా, దేశంలో ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలను పెంచుకునే ఉద్ధేశంలో బీజేపీ అగ్రనాయకత్వం.. ఆ దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఏపీలో పొత్తుకు సిద్ధపడినట్టు చెబుతున్నారు. బీజేపీ అడిగిన సీట్లపై ముఖ్య నాయకులతో చర్చించి తెలియజేస్తామని చంద్రబాబు చెప్పి వచ్చినట్టు చెబుతున్నారు. దీనిపై టీడీపీ ముఖ్య నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో పొత్తులు, ఆయా పార్టీలు పోటీ చేయబోయే స్థానాలపై గురువారం ఫైనల్ నిర్ణయం వెలువడే అవకాశముంది. ముందుగా పవన్ బీజేపీ నేతలతో ఒంటరిగా సమావేశమైన అనంతరం.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి మరోసారి బీజేపీ అగ్ర నాయకులతో కలిసి చర్చించే అవకాశం ఉంది. ఈ క్రమంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై అంతటా ఉత్కంఠ నెలకొంది.
Also Read: Kodikathi Case: కోడికత్తి శ్రీనుకు బెయిల్ మంజూరు - హైకోర్టు కీలక ఆదేశాలు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)