(Source: ECI/ABP News/ABP Majha)
Jagan In Investers Meet : పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ బెస్ట్ - ఇన్వెస్టర్లను ఆహ్వానించిన సీఎం జగన్ !
పెట్టుబడులు పెట్టేందుకు ఏపీకి రావాలని సీఎం జగన్ దౌత్యవేత్తలను కోరారు. ఢిల్లీలో లీలా ప్యాలెస్ హోటల్లో పలు దేశాల దౌత్యవేత్తలతో భేటీ అయ్యారు
Jagan In Investers Meet : త్వరలో రాజధాని అవుతున్న విశాఖకు రావాలని పెట్టుబడిదారులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు. ఢిల్లీలో నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కర్టెన్ రైజర్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన.. తాను కూడా త్వరలో విశాఖ రాజధానికి మారుతున్నానని స్పష్టం చేశారు. మార్చి 3, 4న విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగబోతోందని, అందరూ రావాలని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ లో బిజినెస్ ఎంత ఈజీగా చేయొచ్చో అక్కడికి వచ్చి తెలుసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు.
దేశంలో వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఏపీ ఒకటని జగన్మోహన్ రెడ్డి వివరణ
దేశంలో వేగంగా వృద్ది చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ వేదికపై ఏపీని నిలబెట్టేందుకు మీ సహకారం కావాలని వ్యాపారవేత్తలను జగన్ ను కోరారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని చెప్పారు. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి చాలా ప్రత్యేకతలున్నాయని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్టర్లకు వివరించారు. భారత్ ను కూడా అంతర్జాతీయంగా ప్రత్యేక స్ధానంలో నిలబెట్టినందుకు ప్రధాని మోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్‌గా ఏపీ
ఏపీ వరుసగా మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్‌గా ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ పెట్టుబడిదారులకు వివరించారు. పరిశ్రమల స్థాపనకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు పారిశ్రామిక వేత్తలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తోనే టాప్ ప్లేసులో ఉన్నామని జగన్ చెప్పారు. ఇప్పటికే ఆరు పోర్టులున్నాయని జగన్ వారికి తెలిపారు. మరో నాలుగు త్వరలో మొదలుపెడతామన్నారు. మూడు పారిశ్రామిక కారిడార్లు ప్రారంభించబోతున్నట్లు జగన్ వెల్లడించారు. కేంద్రం దేశంలో మొదలుపెడుతున్న 11 కారిడార్లలో మూడు ఏపీకే రావడం శుభపరిణామం అన్నారు. 48 ఖనిజ నిక్షేపాలకు ఏపీ కేంద్రమని ఇన్వెస్టర్లకు వివరించారు ముఖ్యమంత్రి. ఎలక్ట్రానిక్, తయారీ క్లస్టర్లు ఇప్పటికే ఎన్నో పనిచేస్తున్నాయని పెట్టుబడిదారులకు తెలిపారు. టెక్స్ టైల్, ఫార్మా, ఆటోమొబైల్ క్లస్టర్లు ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయన్నారు.
పెట్టుబడుల సదస్సు కోసం టిమ్ కుక్, ఎలన్ మస్క్ లను కూడా ఆహ్వానించిన ప్రభుత్వం
మార్చి మొదటి వారంలో జరగనున్న పెట్టుబడుల సదస్సు కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలందర్నీ పిలుస్తున్నామని ప్రకటించారు. టెస్లా చీఫ్ ఎలన్ మస్క్, ఆపిల్ సీఈవో టిమ్ కుక్ లను కూడా ఆహ్వానించామని పరిశ్రమల మంత్రి అమర్నాథ్ ప్రకటించారు. అలాగే సన్నాహాక సమావేశాలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూండటంతో... ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలందరూ విశాఖకు తరలి వస్తారని భావిస్తున్నారు. ఏపీలో పెట్టుబడుల అనుకూల వాతావరణం ఉందని.. దేశీయ పారిశ్రామికవేత్తలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తారని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దానికి తగ్గట్లుగా విశాఖలో కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేయనున్నారు.