CM Chandrababu: 'కొందరి తప్పిదాల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు' - మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం, నేతల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్
Andhra News: కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వారి వ్యవహారశైలి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని క్లాస్ తీసుకున్నట్లు సమాచారం.
Chandrababu Serious On Ministers And MLAs: కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వివాదాస్పదంగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. ఈ మేరకు కొందరి వ్యవహారశైలి పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కేబినెట్ భేటీ (AP Cabinet Meeting) ముగిసిన అనంతరం అంతర్గతంగా పలు రాజకీయ అంశాలపై ముఖ్యమంత్రి నేతలతో చర్చించినట్లు సమాచారం. ఒకరిద్దరు చేసిన తప్పు వల్ల ప్రభుత్వం చేసే మంచి పక్కకు పోయి చెడ్డ పేరే హైలెట్ అవుతోందని ఆయన అమాత్యులతో అన్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. వంద రోజుల పనితీరుపై మంత్రులకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వనున్నట్లు చెప్పారు. జనసేన మంత్రుల రిపోర్ట్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అందిస్తామని అన్నారు. అటు, కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కేంద్ర నిర్ణయంపై హర్షం
అటు, పోలవరం ప్రాజెక్ట్, పరిశ్రమలకు సంబంధించి కేంద్ర కేబినెట్ రెండు నోట్స్‌ను క్లియర్ చేయడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర చర్యలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం కలుగుతుందని అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.12,127 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని.. ప్రాజెక్టును 2027 మార్చిలోగా పూర్తి చేసేందుకు షెడ్యూల్ ఏర్పాటు చేశారని చెప్పారు. పోలవరం విషయంలో ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అభినందనలు తెలిపారు.
Also Read: Chandrababu Politics: ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ - చంద్రబాబు అసలు వ్యూహం అదే!
'అదే మా లక్ష్యం'
2019లో పోలవరాన్ని ప్రాజెక్టును శనిగ్రహం ఆవరించిందని.. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టు పనులకు గ్రహణం పట్టిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. '2021 నాటికి పోలవరం పూర్తి చేసి ఉండాలి. వైసీపీ హయాంలో కేంద్రం రూ.8 వేల కోట్లు ఇచ్చింది. పీపీపీ లేఖ కూడా రాసింది. ఐదేళ్లుగా పురుషోత్తమపట్నం, పట్టిసీమను ఉపయోగించుకోలేదు. ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి మళ్లీ పోలవరాన్ని గాడిలో పెట్టగలిగాం. చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేంద్రానికి ధన్యవాదాలు. ప్రాజెక్టు సకాలంలో పూర్తవుతుందనే నమ్మకం కలిగింది. గోదాట్లో మునిగిన పోలవరం ఇప్పుడు మళ్లీ గట్టెక్కింది. ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించడమే మేలని నిపుణులు తేల్చారు. రూ.992 కోట్లతో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తాం. 41.15 మీటర్ల ఎత్తుతో తొలి దశ ప్రాజెక్ట్ 2027 నాటికి పూర్తి చేయాలనేదే మా లక్ష్యం.' అని చంద్రబాబు పేర్కొన్నారు.
'రాష్ట్రంలో 3 కారిడార్లు'
దేశంలో మొత్తం 12 పారిశ్రామిక కారిడార్లు నిర్మిస్తుంటే.. రాష్ట్రంలో 3 కారిడార్లు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. వీటిపై మొత్తం రూ.28 వేల కోట్ల వ్యయం చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు చెప్పారు. కడప జిల్లా కొప్పర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పారిశ్రామిక హబ్స్ వస్తున్నట్లు పేర్కొన్నారు. నక్కపల్లికి ఫార్మా క్లస్టర్ వస్తోందని.. కృష్ణపట్నానికి కూడా అనుమతి వచ్చినట్లు వివరించారు. కేంద్ర నిర్ణయం రాష్ట్రానికి మంచి రోజని.. ఈ చర్యలు రాష్ట్రాభివృద్ధికి కారణమవుతాయని అన్నారు.