Chittoor News : చిత్తూరు జిల్లాలో అమానవీయ ఘటన, చిన్నారులను గదిలో బంధించి తాళం వేసిన అంగన్వాడీ టీచర్
Chittoor News : చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ అంగన్వాడీ టీచర్ చిన్నారులను గదిలో పెట్టి తాళం వేసింది.
Chittoor News : చిత్తూరు జిల్లాలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. అంగన్వాడీ చిన్నారులను గదిలో బంధించి వేశారు. బైరెడ్డిపల్లి మండలం పాతూరునత్తం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులను బంధించి తాళం వేశారు అంగన్వాడీ టీచర్,సిబ్బంది (ఆయా). గదిలో ఉన్న భయంతో ఏడుస్తుండడంతో స్థానికులు గమనించి పిల్లల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అభం శుభం తెలియని చిన్నారుల అరుపులను విని తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రానికి చేరుకున్నారు. చిన్న పిల్లలపై శ్రద్ధ వహించని అంగన్వాడీ టీచర్ పై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ పంతులమ్మ సొంత పనుల బిజీలో పిల్లల శ్రద్ధను గాలికి వదిలేసిందని ఆరోపిస్తున్నారు. దీంతో పాటు ఈ అంగన్వాడీ కేంద్రంపై స్థానికులు పలు ఆరోపణలు చేస్తున్నారు. బైరెడ్డిపల్లి మండలంలో అంగన్వాడీ పర్యవేక్షణ అధికారి పర్యవేక్షణ చేయడంలేదని తల్లిదండ్రులు అంటున్నారు. గతంలో ఈ అంగన్వాడీ సెంటర్ లో పిల్లల పట్ల అశ్రద్ధ చూపుతున్న టీచర్ పై పత్రికల్లో కథనాలు వచ్చినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలోనూ ఫిర్యాదులు
పిల్లలను అంగన్వాడీ గదిలో బంధించి తాళం వేసి పంతులమ్మ ఎక్కడికి వెళ్లిందని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అసలు పిల్లల్ని చూసుకోవాల్సిన టీచర్, ఆయా ఇలా నిర్లక్ష్యంగా చిన్నారులను గదిలో బంధించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులు అంగన్వాడీ కేంద్రానికి రావడమే తప్పా అని మండిపడుతున్నారు. పాతూరునత్తo అంగన్వాడీ కేంద్రంపై పదే పదే ఫిర్యాదులు వస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్న పిల్లలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.
గత ఏడాది దారుణ ఘటన
అనంతపురంలోని కొవ్వూరు నగర్ లో గత ఏడాది ఏప్రిల్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారి మూతిపై ఆయా వాత పెట్టింది. బాలుడు అంగన్వాడీ కేంద్రంలో ఉండకుండా అమ్మ కావాలని బయటకు వెళ్లిపోతున్నాడని అక్కడ పనిచేస్తున్న ఆయా మూడేళ్ల చిన్నారి మూతిపై వాత పెట్టి తీవ్రంగా గాయపరిచింది. కొవ్వూరు నగర్‌లో లక్ష్మీదేవి, శింగారెడ్డి దంపతులు ఉంటున్నారు. వీరి మూడేళ్ల బాలుడు ఈశ్వర్ కృష్ణారెడ్డిని కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి పంపిస్తున్నారు. రోజూలాగే బాలుడ్ని అంగన్వాడీలో వదిలిపెట్టి వచ్చామని తల్లి చెబుతున్నారు. బాలుడు అమ్మ కావాలని ఏడవడంతో ఆయా చెన్నమ్మ బాలుడి మూతిపై వాత పెట్టిందని తల్లి ఆరోపించింది. బాలుడి మూతిపై బొబ్బలు వచ్చాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది. చిన్నారి అని కూడా చూడకుండా కర్రతో కొట్టిందని తెలిపింది. బాలుడి కాళ్లు, వీపుపై వాతలు పడి ఎర్రగా కమిలిపోయాయని తల్లి ఆవేదన చెందుతుంది. ఆయాపై చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ అప్పట్లో ఆరా తీశారు. స్థానిక అధికారులు అంగన్వాడీ కేంద్రంలో జరిగిన ఘటనపై విచారణ చేశారు.