Lokesha Padayatra : లోకేశ్ పాదయాత్రలో అపశృతి, గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
Lokesha Padayatra : నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో అపశృతి జరిగింది. బందోబస్తు విధుల్లో ఉన్న కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించారు.
Lokesha Padayatra : టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. యువగళం పాదయాత్రకు బందోబస్తు విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఏ.రమేష్ గుండెపోటుతో మృతి చెందారు. గంగాధర్ నెల్లూరులో మధ్యాహ్నం బ్రేక్ సమయంలో భోజనం తిన్న కొద్దిసేపటికే హెడ్ కానిస్టేబుల్ రమేష్ గుండెపోటుకు గురి కావడంతో పక్కనే ఉన్న పోలీసు సిబ్బంది హుటాహుటిన పోలీసు వాహనంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రమేష్ ను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధృవీకరించారు.
లోకేశ్ పాదయాత్రలో ఉద్రిక్తత
అంతకు ముందు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో లోకేశ్ చేస్తున్న పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. లోకేశ్ ప్రసంగాన్ని పోలీసులు అడ్డుకున్నారని... ఆయన్ని తమ గ్రామంలోకి రానీయకుండా చూస్తున్నారని టీడీపీ కార్యకర్తలు, నేతలు ధర్నాకు దిగారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం అక్కడ పరిస్థితి వేడెక్కించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేస్తున్న 14వ రోజు పాదయాత్ర జీడీ నెల్లూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. 8 గంటలకు ఆత్మకూరు ముత్యాలమ్మ గుడి ఆవరణలోని విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభించారు లోకేశ్. ఆత్మకూరు ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మూర్తినాయకనపల్లి చర్చిలో ప్రార్థనలు జరిపారు. కడపగుంట ఎస్సీ కాలనీలో ఎస్సీలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. మహదేవ మంగళంలో స్థానికులతో మాటామంతీ నిర్వహించారు. అక్కడి నుంచి సంసిరెడ్డిపల్లెకు వచ్చే క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
రాజ్యాంగం పట్టుకుని లోకేశ్ నిరసన
గంగాధరనెల్లూరు నియోజకవర్గం సంసిరెడ్డిపల్లెలో లోకేశ్ ప్రసంగాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మైక్ పట్టుకున్న వ్యక్తిని లాగేశారు. స్టూల్‌పై నిల్చొని ప్రసంగిస్తున్న లోకేశ్ ను కూడా లాగేందుకు యత్నించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. పోలీసుల చర్యల కారణంగానే టీడీపీ కార్యకర్తల్లో అసహనం పెరిగిందని తిరగబడ్డారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రోడ్డుపై బహిరంగ సభలకు అనుమతి లేదన్న అధికారులు... అక్కడి నుంచి వెళ్లిపోవాలని పట్టుబట్టారు. దీంతో రాజ్యాంగాన్ని పట్టుకున్న లోకేశ్.. దాన్ని పోలీసులకు చూపిస్తూ ఎక్కడ అలాంటి రూల్స్ ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసుల వైఖరిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే పార్టీ శ్రేణులతో కూర్చొని ధర్నా చేశారు. ఆయన స్టూల్‌పై నిల్చొని తన అసంతృప్తిని పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెనుగులాట కూడా జరిగింది. ఈ పెనుగులాటలో కొందరు టీడీపీ కార్యకర్తలు గాయపడినట్టు తెలుస్తోంది. తమ గ్రామంలోకి వచ్చిన లోకేశ్ మాట్లాడతామంటే పోలీసులకు అభ్యంతరం ఎందుకని స్థానికులు ప్రశ్నించారు.
లోకేశ్ పాదయాత్ర జీడీ నెల్లూరు ఐజడ్ఎం స్కూలుకు చేరుకోనుంది. అక్కడి విద్యార్థులతో ఆయన మాట్లాడాల్సి ఉంది. అనంతరం అవలకొండలో కొత్తగా నిర్మించిన దర్గా ప్రారంభిస్తారు. రంగాపురం క్రాస్ వద్ద బహిరంగసభలో ప్రసంగించనున్నారు. సాయంత్రానికి రేణుకాపురం విడిది కేంద్రంలో బస చేయనున్నారు. సంసిరెడ్డిపల్లెలో జరిగిన గొడవ కారణంగా షెడ్యూలు కొంత ఆలస్యం కానుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ముందుకు అనుకున్నట్టుగా ఆయా వర్గాలను, ప్రజలను కలిసిన తర్వాత లోకేశ్ ముందుకు వెళ్తారని చెబుతున్నారు.