Chittoor News: మూడేళ్ల వయసులో తప్పిపోయి పద్నాలుగేళ్ల తర్వాత ఇంటికి... ఇన్నాళ్లు ఆ బాలుడు ఎక్కడున్నాడో తెలుసా..!
మూడేళ్ల వయసులో తప్పిపోయిన ఓ బాలుడు పద్నాలుగేళ్ల తర్వాత తల్లిదండ్రులు వద్దకు చేరారు. ఇన్నేళ్ల తర్వాత కన్నబిడ్డ తిరిగి ఇంటికి రావడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు.
మూడేళ్ల వయసులో తప్పిపోయిన బాలుడు పద్నాలుగు ఏళ్ల తరువాత తల్లిదండ్రుల చెంతకు చేరాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు కనిపించకుండా పోతే ఆ తల్లిదండ్రుల బాధను వర్ణించలేం. చిన్నారులు తెలిసి తెలియని వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయి తప్పిపోయిన ఘటనలు చూస్తుంటాం. కనిపించకుండా పోయిన పిల్లల కోసం ఆ తల్లిదండ్రులు బాధపడని రోజు ఉండదు. ఏ దేవుడో కరుణించి తమ పిల్లలు తిరిగి ఇంటికి రావాలని కోరుకుంటారు. ఇలాంటి ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. మూడేళ్ల వయసులో తప్పిపోయిన బాలుడు పద్నాలుగు ఏళ్ల తర్వాత ఇంటికి చేరుకున్నాడు. ఇన్నాళ్లు తమ బిడ్డ ఆచూకీ కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూసిన ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. ఇన్నాళ్లు తమ బిడ్డ ఆచూకీ కోసం వెతకనీ చోటు లేదు.. పలకరించని మనిషి లేడు.. తమ బిడ్డ ఆచూకీ దొరికిందా, ఎలాగైనా తమ బిడ్డను తమ వద్దకు చేర్చాలని పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగారు. అంతలా బిడ్డ కోసం పరితప్పించే ఆ తల్లిదండ్రుల వద్దకు పద్నాలుగు ఏళ్ల తరువాత కన్న కొడుకు చెంతకు చేరిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read: పులివెందులలో పదివేల ఉద్యోగాలు.. ఆదిత్య బిర్లా కంపెనీకి జగన్ శంకుస్థాపన !
2008లో తప్పిపోయిన బాలుడు
చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్ మండలం నీరుగట్టువారి పల్లెకు చెందిన రమణ, రెడ్డమ్మలు చేనేత వృతి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు ఆకాష్ మూడేళ్ల వయసులో ఇంటి ఆవరణంలో ఆడుకుంటూ ఎటో వెళ్లి పోయాడు. అయితే ఆకాష్ ఆచూకీ కోసం చుట్టు పక్కల తెలిసిన వారిని, బంధువులను ఆరా తీశారు. కానీ తమ బిడ్డ కనిపించకపోవడంతో 2008లో మదనపల్లె టూటౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మూడేళ్ల బాలుడు ఆకాష్ ఆచూకీ కోసం పోలీసులు అన్ని ప్రాంతాల్లో గాలించారు. కానీ బాలుడి ఆచూకీ మాత్రం దొరకలేదు. పోలీసులు ఒక వైపు గాలిస్తుండే మరో వైపు తల్లిదండ్రులు తమ ప్రయత్నం చేశారు. బంధువులు కూడా ఆ చిన్నారి కోసం గాలింపులు చేపట్టారు. కానీ బాలుడి ఆచూకీ లభించలేదు.
ఆటో డ్రైవర్ ఇంట్లో...
2019లో తెలిసినవారు తమ కుమారుడు ఆకాష్ మదనపల్లెకు సమీపంలోని కొత్తపేట గ్రామంలో ఓ ఆటో డ్రైవర్ ఇంటిలో ఉన్నాడని సమాచారం ఇచ్చారు. అయితే కొత్తపేటకు వెళ్లిన ఆకాష్ తల్లిదండ్రులు తమ బిడ్డకు ఉన్న పచ్చబొట్టులను గుర్తుగా చెప్పి తమ బాలుడే అని వాదించారు. కానీ ఆకాష్ తమ బాలుడే అని ఆటో డ్రైవర్ వారించారు. అప్పుడు బాలుడు రెడ్డమ్మ, రమణలతో వెళ్లేందుకు అంగీకరించక పోవడంతో ఏమీ చేయలేక తిరిగి ఇంటికి చేరుకున్నారు. కన్న ప్రేమతో తమ బాలుడిని చూసేందుకు ఆ తల్లిదండ్రులు వారంలో రెండు మూడు సార్లు ఆ గ్రామానికి వెళ్లి వచ్చేవారు. చుట్టు పక్కల వారు ఆ తల్లిదండ్రుల బాధను చూడలేక బాలుడికి విషయం చెప్పారు. తనను కన్న తల్లిదండ్రులు రెడ్డమ్మ, రమణలే అని చెప్పి ఆకాష్ కు వివరించడంతో వారి వద్దకు వెళ్లేందుకు అంగీకరించాడు. దీంతో గురువారం మదనపల్లె టూటౌన్ పోలీసుల సమక్షంలో ఆకాష్ తమ తల్లిదండ్రులు రెడ్డమ్మ, రమణలను కలిశాడు. దీంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Also Read: వేర్వేరుగా ప్రార్థనలు.. నివాళులు... ! జగన్, విజయమ్మ మధ్య కూడా మాటల్లేవా ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి