CM Chandrababu : సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం, ఇకపై ప్రతి సోమవారం పోలవరం టూర్
Polavaram Project : ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌కు వెళ్లి నిర్మాణ పనులు స్వయంగా పరిశీలించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. వెలగపూడి సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌కు వెళ్లి నిర్మాణ పనులు స్వయంగా పరిశీలించాలని ఆయన నిర్ణయించుకున్నారు. శుక్రవారం అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో అన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని నీటి పారుదల శాఖ ప్రాజెక్టుల స్థితిగతులపై ఆయన ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఈనెల 17న పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని నిర్ణయించారు.
ప్రాజెక్ట్ పరిస్థితిపై ఆరా
పోలవరం ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటూ సమీక్షలో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రశ్నలను అధికారులకు సంధించారు. దీంతో వారిచ్చిన సమాధానానికి చంద్రబాబు సంతృప్తి చెందలేదు. దీంతో ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లాలని ఆయన నిర్ణయించారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట నిర్మాణంపై సమీక్ష నిర్వహించేవారు. అందులోభాగంగా ఆయన పోలవరం ప్రాజెక్ట్ ను కూడా సందర్శించేవారు.
వైసీపీలో ప్రాజెక్టులపై శీతకన్ను
కాగా, 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అనంతరం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్‌ను మార్చారు. ఆ తర్వాత సదరు ప్రాజెక్ట్ నిర్మాణం ఎంత వరకు వచ్చింది. ప్రాజెక్టు నిర్మాణం ఏ దశలో ఉందో చెప్పే వారు జగన్ ప్రభుత్వంలో కరువయ్యారు. ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో ఏపీ ఓటరు.. ఎన్డీయే కూటమికి పట్టం కట్టారు. అదీకాక ఎన్నికల ప్రచారంలో రాజధాని అమరావతి నిర్మాణానికి.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సహయ సహకారాలందిస్తామని ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఏపీకి జీవనాడి పోలవరం ప్రాజెక్ట్
వాస్తవానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన పోలవరం ప్రాజెక్ట్ ఒకటి. ఎన్నికల ప్రచారంలో సైతం ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీకి జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. రాష్ట్రంలో అత్యంత వేగవంతంగా పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ ఇది. ఈ పోలవరం నిర్మాణ బాధ్యతలను నీటి పారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడికి అప్పగించారు. ఆయనక అప్పగించడానికి కారణం పోలవరాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ ఆయన అప్పట్లో పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అనేకసార్లు ప్రెస్‌మీట్లు పెట్టి మరీ అప్పటి ప్రభుత్వాన్ని విమర్శించారు. పోలవరంపై ఆయనకు పూర్తి అవగాహన ఉండటంతో పాటు ఆయన పోరాటాన్ని దృష్టిలో పెట్టుకుని రామానాయుడికి దీని బాధ్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.