Chandrababu Delhi Tour: ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు - 2 ముఖ్యమైన పనులతో బిజీబీజీగా టీడీపీ అధినేత
Chandrababu Delhi Tour: రెండు ముఖ్యమైన పనుల నిమిత్తం తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లారు.
Chandrababu Delhi Tour: హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లారు. హైదరాబాద్ నుంచి ఆదివారం రాత్రి బయలుదేరిన ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. చంద్రబాబు సోమవారం ఢిల్లీలో రెండు ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొననున్నారు.
దివంగత నటుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రంతో కూడిన రూ.100 నాణేన్ని కేంద్ర ప్రభుత్వం ముద్రించడం తెలిసిందే. ఎన్టీఆర్ బొమ్మతో ఉండే ఈ నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం (ఆగస్టు 28న) ఢిల్లీలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించనున్న ఎన్టీఆర్ రూ.100 నాణెం విడుదల కార్యక్రమంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయన కుటుంబ సభ్యులకు ఆహ్వానాలు పంపింది.
నకిలీ ఓటర్లపై మరోసారి ఈసీకి ఫిర్యాదు
వైసీపీ ప్రభుత్వం ఏపీలో పెద్ద ఎత్తున నకిలీ ఓటర్లను జాబితాలో చేర్చిందని టీడీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో నకిలీ ఓట్లు పెద్ద ఎత్తున చేర్చారని వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. టీడీపీ, ఇతర పార్టీల సానుభూతిపరుల ఓట్లను నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం తొలగించిందని ఈసీఐ ప్రధాన కమిషనర్ దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లనున్నారు. ఒకే ఇంటి అడ్రస్ తో వందలు, వేల ఓట్లు ఓటర్ల జాబితాలో చేర్చారని ఈసీకి టీడీపీ అధినేత వివరించనున్నారు. ఇందుకు సంబంధించి టీడీపీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం సేకరించిన సమాచారాన్ని సీఈసీకి చంద్రబాబు సమర్పించనున్నారు. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరనున్నారు. ఇటీవల అనంతపురం జిల్లా ఉరవకొండలో ఎన్నికల అధికారిపై తీసుకున్న తరహాలో చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో టీడీపీ నేతలు పేర్కొనున్నారు.
ఎన్టీఆర్ నాణెం ఎలా ఉంటుందంటే..
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణేన్ని ముద్రించింది. 44 మిల్లీ మీటర్ల చుట్టు కొలతతో ఉండే ఈ వంద రూపాయిల నాణేన్ని 50శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు. అలాగే ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు. ఆయన శతజయంతి ఈ ఏడాదితో ముగిసింది. కనుక 1923- 2023 అని ముద్రితమై ఉంటుంది. ఎన్టీఆర్‌తో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులను సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. పాదయాత్రలో ఉన్నందున లోకేష్ హాజరు కావడం లేదు.
రాష్ట్రపతికి లక్ష్మీపార్వతి లేఖ
తాను ఎన్టీఆర్ భార్యనని.. ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమానికి తననూ ఆహ్వానించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లకు లక్ష్మీపార్వతి లేఖ రాయడం తెలిసిందే. ఎన్టీఆర్ రూ.100 నాణెం విడుదల కార్యక్రమానికి తనను ఆహ్వానించాలని లేఖలో లక్ష్మీపార్వతి కోరారు. ఆహ్వానితుల జాబితాలో తన పేరునూ చేర్చాలని లేఖలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ తన భర్త అని, తన భర్త పేరుపైన నాణెం విడుదల చేస్తూ తనకు ఆహ్వానం పంపకపోవడం ఏమిటని ప్రశ్నించారు.