Chandrababu Chit Chat: జగన్‌కు వివేకా కేసే చిన్నది, పరకామణి కేసు పెద్దదవుతుందా - చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Parakamani case: పరకామణి కేసులో జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తప్పు పట్టారు. దేవుడి సొమ్మును దోచిన దొంగతో సెటిల్మెంట్ చేసి..త సమర్థించుకోవడం ఏమిటని ప్రశ్నించారు.

Chandrababu Chit Chat on Parakamani case: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరకామణి చోరీ కేసును 'చిన్నది' అంటూ చేసిన వ్యాఖ్యలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ప్రజల నుంచి వినతులు తీసుకునేందుకు టీడీపీ కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ తీరును విమర్శిస్తూ సెటైర్లు వేశారు. "బాబాయ్ హత్య కేసు కూడా చిన్నదే అయితే, పరకామణి కేసు పెద్దదవుతుందా?" అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ వ్యవహార శైలి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, దేవుడు మరియు ఆలయాల పవిత్రతపై ఆయనకు ఎలాంటి లెక్కలేదని అన్నారు.
జగన్ హయాంలో బాబాయ్ హత్య కేసును సెటిల్ చేయాలని చూసినట్లుగానే, పరకామణి చోరీ కేసును కూడా సెటిల్ చేయాలని ప్రయత్నించారని చంద్రబాబు విమర్శించారు. "దొంగతనం చేసిన వ్యక్తి డబ్బులు కట్టాడు కదా, ఇంక కేసులెందుకు అని జగన్ అనైతికంగా వాదిస్తున్నారు. సెంటిమెంట్ విషయాల్లో సెటిల్‌మెంట్లు చేసి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. "దొంగతనాన్ని కూడా తప్పుకాదని చెప్పేవారిని ఏమనాలి? సున్నితమైన అంశాలను సెటిల్ చేశామని తేలికగా మాట్లాడుతున్నారు. కానుకలు, భక్తులు హుండీలో వేసిన సొమ్మును చోరీ చేసిన దొంగతో సెటిల్‌మెంట్ ఏమిటి?" అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్‌కు దేవుడు, ఆలయాల పవిత్రత అంటే ఎలాంటి గౌరవం లేదని వ్యాఖ్యానించారు.
వైసీపీ హయాంలో నేరస్తులను పెంచి పోషించారని విమర్శించారు. "వారి తీరు వల్లనే మహిళలు కూడా డాన్లుగా ఎదిగారు. లేడీ డాన్లు పెరిగిపోయారు. వారి తోకలు కట్ చేస్తాము" అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రౌడీ షీటర్లు లేకుండా చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ చిట్ చాట్ సందర్భంగా చంద్రబాబు మీడియాతో సరదాగా మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాలు, వైసీపీ విమర్శలు, భక్తుల మనోభావాలు వంటి అంశాలపై విస్తృతంగా స్పందించారు.





















