Chandrababu : రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం - పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు !
పొత్తుల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులతో ఇష్ఠాగోష్ఠిగా మాట్లాడారు.
Chandrababu : బీజేపీ .. టీడీపీ , జనసేనతో కలిసి పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. ‘‘ఎవరెవరో మాట్లాడిన వాటిపై స్పందించి చులకన కాదల్చుకోలేదు. దగాపడ్డ ఏపీ రాష్ట్ర ప్రయోజనాలే ఇప్పుడు నాకు ముఖ్యం. ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే నా లక్ష్యం. పెద్ద బాధ్యత నాపై ఉన్నప్పుడు పెద్ద ఆలోచనలూ అవసరం. పోరాడితే కేంద్రం దిగొస్తుందనడానికి జల్లికట్టు ఘటనే ఉదాహరణ. ఓట్ల అవకతవకలపై దిల్లీని కూడా వదిలిపెట్టబోం’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుల గురించి అందరూ మాట్లాడుతున్నారని.. తీసుకునే ప్రతి నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడు కునే విధంగా ఉంటుందని ప్రకటించారు. అన్ని ఆలోచించి రాష్ట్రానికి మంచి జరిగే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేసారు.
మహిళల కోసం మరిన్ని పథకాలు
మినీ ఎన్నికల మేనిఫెస్టో లో ప్రకటించిన సూపర్ 6 హామీలు అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా చేశామని.. ఇండియా జనాభాలో యువత ఎక్కువ.. రానున్న రోజుల్లో మిగతా దేశాల కంటే ఇండియా యువ భారత్ గా ఉంటుందన్నారు. చైనా అప్పట్లో తీసుకున్న విధానం వల్ల ఇప్పుడు సంపద ఉన్నా జనాభా పరంగా చైనా ఇబ్బంది పడుతోంది .. మనం కూడా జనాభా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పిల్లల్ని బాగా చదివిస్తే వారు ప్రపంచానికి ఆస్తి అవుతారన్నారు. అందుకోసమే మేం తల్లికి వందనం కార్యక్రమం తీసుకు వచ్చాం తల్లికి, పిల్లలకు మధ్య అనుబంధాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందన్నారు.
పూర్ టు రిచ్ అర్థం చేసుకోవడ కష్టమే..కానీ కష్టపడితే అద్భుత ఫలితాలు
మినీ మేనిఫెస్టోలో పెట్టిన పూర్ టు రిచ్ విధానం వినూత్నమైందని.. ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యమే పీ4 విధానం అని వివరించారు. పేదలకు ఇప్పుడు రోజుకు రూ.150 మాత్రమే వస్తోందని.. – సంపద సృష్టి ద్వారా పేదరికం పోగొట్టాల్సి ఉందన్నారు. పూర్ టు రిచ్ అర్థం చేసుకోవడం కొంచెం కష్టం కానీ.. కష్టమైన ఆచరణలో అద్భుత ఫలితం ఇస్తుంది ఇస్తుందన్నారు. మహిళలకు ఇప్పటివరకు 4 పథకాలే ప్రకటించాం .. మహిళలకు వీలైనన్ని ఎక్కువ పథకాల కోసం ఆలోచిస్తున్నామన్నారు. మహిళల భాగస్వామ్యంతో కుటుంబం .. సమాజం బాగుపడేలా చూస్తామన్నారు. కట్టెల పొయ్యిపై మా అమ్మ పడిన కష్టాలు ఎన్నో చూశా .. మా అమ్మ కష్టాలు చూసే ఆనాడు దీపం పథకాన్ని తీసుకొచ్చామన్నారు. పెరిగిన ధరలతో మళ్లీ కట్టెల పొయ్యికి పరిమితమయ్యేలా ఉన్నారు అందుకే ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు.
అమరావతి నిర్వీర్యం... పోలవరం ముంచేస్తే ప్రజల్లో చైతన్యం ఏమయింది ?
మహిళా శక్తి అనేది ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోందని.. అమెరికాకు ఇప్పటివరకూ మహిళా అధ్యక్షురాలు కాలేదన్నారు. మినీ మేనిఫెస్టో మహాశక్తి పేరిట మహిళలకు ప్రాధాన్యమిచ్చామన్నారు. సంపద సృష్టించే అమరావతిని జగన్ చంపేశారు .. ఒకరి మూర్ఖత్వానికి-పిచ్చితనానికి రాష్ట్రం బలికావాలా? అని ప్రశ్నించారు. అమరావతిని రాజధానిగా ప్రకటించకముందు అక్కడ భూమి ధరెంత? రాజధానిగా కొనసాగి ఉంటే ఎంత ఉండేదో ఎవరైనా బేరీజు వేశారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. జీవనాడి పోలవరాన్ని ముంచేస్తే, ప్రజల్లో చైతన్యం ఏమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా-గోదావరితో రెండు రాష్ట్రాల్లో ప్రతి ఎకరాకు నీళ్లివ్వొచ్చు – భూ కబ్జాలు, సెటిల్ మెంట్లతో వేల కోట్లు దోచేశారు. రైతులు కోలుకోలేని దుస్థితిలో ఉన్నారు.. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గితే ఏపీలో పెరుగుతున్నాయి. కౌలు రైతులు పూర్తిగా నాశనమయ్యారని ఆరోపించారు.