Supreme Court : చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా - ఏప్రిల్ 16న మళ్లీ విచారణ !
Andhra News : చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. హోలీ తర్వాత విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.
Chandrababu Bail Cancellation Petition: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. ఏప్రిల్ 16వ తేదీన ఈ పిటిషన్‌పై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్టు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం పేర్కొంది.
చంద్రబాబు కుటుంబం ఒక డైరీ పెట్టి... అందులో అధికారుల పేర్లు నమోదు చేస్తున్నట్లు చెపుతోందని, తాము అధికారంలోకి వస్తే... అందరిపై చర్యలు తీసుకుంటామని బెదిరిస్తోందని ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ ప్రధాన ఉద్దేశం ఏమిటని ప్రభుత్వ న్యాయవాదులను జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు. బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నట్లు ముకుల్‌రోహత్గి చెప్పారు. స్కిల్ కేసులో బెయిల్ మంజూరు తర్వాత... చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయని, నిందితుడి కుటుంబ సభ్యులు అధికారులను, దర్యాప్తు సంస్థను బెదిరిస్తున్నారన్న ముకుల్ రోహత్గి అన్నారు. వెంటనే బెయిల్ రద్దు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని, తక్షణం విచారణ చేపట్టాలని ముకుల్ రోహత్గి కోరారు.
కాగా ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి అంశానికి తాము సమాధానం ఇస్తామని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ.. తదుపరి విచారణ మూడు వారాల తరువాత చేపట్టనున్నట్లు ప్రకటించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో హైకోర్టు చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ మరోసారి సుప్రీంకోర్టు విచారణ జరుపనుంది. చంద్రబాబుకు బెయిల్ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందన్న అంశాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోలేదని సీఐడీ ప్రధానంగా పిటిషన్‌లో పేర్కొంది.
స్కిల్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేయగా.. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో 50 రోజులకు పైగా రిమాండ్‌లో ఉన్నారు.. ముందు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే.. దీంతో. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది.. ఆ పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిగింది. ఈ సందర్భంగా బెయిల్ రద్దుపై ఏప్రిల్ 16న పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంటి.. విచారణను వాయిదా వేసింది.