Pawan Meet Babu : చంద్రబాబుతో మరోసారి పవన్ సమావేశం - ఎన్నికల ప్రచార సమన్వయంపై కీలక నిర్ణయాలు
Andhra News : చంద్రబాబు, పవన్ కల్యాణ్ మరోసారి భేటీ అయ్యారు. ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
Chandrababu and Pawan Kalyan met once again : జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో చంద్రబాబు నివాసానికి మరోసారి వెళ్లారు. చంద్రబాబు 26వ తేదీ నుంచి ప్రచారం ప్రారంభించనున్నరాు. పవన్ క్లాయణ్ కూడా ఒక రోజు అటూ ఇటూగా ప్రచారం ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలో ప్రచార సమన్వయం, బహిరంగసభలతో పాటు ఇతర అంశాలపైనా చర్చలు జరిపారు. అలాగే పెండింగ్ ఉన్న అభ్యర్థులు, సీట్ల అంశంపైనా మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ ఇంకా 16అసెంబ్లీ, 17పార్లమెంట్ అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. అలాగే పవన్ కల్యాణ్ కూడా మరికొన్ని సీట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నారు. ఈ భేటీలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఖరారుకు తుది కసరత్తు, ఉమ్మడి ప్రచార వ్యూహం పై అధినేత ల మధ్య కీలక చర్చ జరిపారు.
27 నుంచి పవన్ కల్యాణ్ ప్రచారం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 27వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ముందుగా ఉత్తరాంధ్ర నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. తొలి విడత ప్రచారంలో భాగంగా ముఖ్యమైన నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ప్రచారం ఉండనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వారాహి వాహనాన్ని ఇందుకోసం సిద్ధం చేస్తున్నారు. గ్యాప్ లేకుండా ఈ నెల 27వ తేదీ నుంచి పవన్ కల్యాణ్ ప్రచారం ఉండనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తాను పోటీ చేయనున్న పిఠాపురం నియోజకవర్గంలోనూ పవన్ కల్యాణ్ తొలి విడత ప్రచారంలో పర్యటించనున్నారని చెబుతున్నారు. పవన్ కల్యాణ‌్ ప్రచారానికి సంబంధించి పూర్తి సెడ్యూల్ నేడో రేపో విడుదల అయ్యే అవకాశం ఉంది.
26 నుంచి చంద్రబాబు ప్రచారం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 26వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. మొత్తం ఇరవై రోజుల పాటు ఆయన ఏకబిగిన ప్రచారం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రజాగళం పేరుతో చంద్రబాబు ప్రచారాన్ని నిర్వహించడానికి రెడీ అయ్యారు. తొలుత చిత్తూరు జిల్లా నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ నెల 24, 25వ తేదీల్లో తొలుత కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన అనంతరం ఈనెల 25న ఆయన చిత్తూరు జిల్లాలో ప్రచారాన్ని ప్రారంభించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు ఎన్నికల ప్రచారం కోసం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రధానితో కలిసి నాలుగు ఉమ్మడి సభలు
బీజేపీతో కలిసి ఉమ్మడి ప్రచారం నిర్వహించనున్నారు. మొత్తంగా నాలుగు చోట్ల బహిరంగసభలు పెట్టే అవకాశం ఉంది. అన్ని వైపులా .. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రచారం ఒకేసారి ఉండేలా చూసుకోనున్నారు. చంద్రబాబు, పవన్ తో పాటు లోకేష్ కూడా ప్రచారం చేయనున్నారు.