Polavaram Project: వరదలొచ్చాయిగా, పోలవరం ఆలస్యమవుతుందేమో-పార్లమెంట్‌లో కేంద్రమంత్రి వ్యాఖ్యలు
Polavaram Project: లోక్‌సభలో వైసీపీ ఎంపీ భరత్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి షెకావత్ సమాధానమిచ్చారు. వరదల కారణంగా పోలవరం నిర్మాణం ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని చెప్పారు.
Polavaram Project:
పోలవరం ప్రాజెక్ట్ నిత్యం వార్తల్లోనూ నిలుస్తూనే ఉంటుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురిసిన వర్షాలతో పోలవరానికి వరదలు పోటెత్తడం వల్ల మరోసారి ఈ ప్రాజెక్ట్ వార్తల్లో నిలిచింది. ఈ విషయమై తెలుగు రాష్ట్రాల మంత్రుల మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే పార్లమెంట్‌లో పోలవరం ప్రస్తావన వచ్చింది. వైసీపీ ఎంపీ భరత్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి షెకావత్ సమాధానమిచ్చారు. వరదల కారణంగా ప్రాజెక్టు ఆలస్యం అయ్యే అవకాశముందని చెప్పారు. భారీ వర్షాల కారణంగా అనూహ్య స్థాయిలో వరదలు రావటం వల్లే ప్రాజెక్టులోని లోయర్ కాఫర్ డ్యాం దెబ్బ తిందని వివరించారు. ధవళేశ్వరం వద్ద మరో ప్రాజెక్టు కట్టే ప్రతిపాదన ఏమైనా ఉందా అన్న ఎంపీ భరత్ ప్రశ్నకు, అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి షెకావత్. ఏపీ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపామని అన్నారు.
ఈ అంశంపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తూనే ఉంది. పోలవరం అంశాన్ని వివాదం చేయాలని కావాలనే కుట్ర చేస్తున్నారంటూ భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ప్రాజెక్టు ఎత్తుపై చేస్తున్న వ్యాఖ్యల్ని ఖండించారు. పోలవరానికి సంబంధించి ఎలాంటి వివాదం చేసినా, చివరకు అది విభజనపై చర్చకు దారి తీస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన బిల్లు ఆధారంగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిందేనని తేల్చి చెప్పారు.