Polavaram Funds : నిధులపై కేంద్రం - రాష్ట్రం టగ్ ఆఫ్ వార్ ! పోలవరం కల సాకారం ఎప్పటికి ?
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం అదే పనిగా బిల్లులు వెనక్కి పంపుతోంది. రకరకాల కారణాలు చెబుతోంది. సవరించిన అంచనాలూ ఆమోదించడం లేదు. దీంతో పోలవరం ప్రాజెక్ట్ భవితవ్యంపై ఆంధ్రుల్లో ఆందోళన కనిపిస్తోంది.
"పోలవరం" .. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓ కల. కానీ ఇప్పటికి అది సాకారం కావడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి నికరంగా ఇచ్చిన హామీ ఒక్క పోలవరం మాత్రమే. జాతీయ హోదా ఇచ్చి ప్రతీ పైసా చెల్లించి పూర్తి చేస్తామని కేంద్రం చట్టంలో హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు అనేకాకనేక నిబంధనలు చూపిస్తోంది. ఫలితంగా పోలవరం భవిష్యత్ మరోసారి అంధకారంలో పడింది.
బిల్లుల రీఎంబర్స్ కోసం ఆంధ్రప్రదేశ్ తీవ్ర ప్రయత్నం !
దుబాయ్ శీను సినిమాలో పట్నాయక్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. హీరో మిత్రబృందంతో వ్యాపారం చేయించి వచ్చిన డబ్బులన్నీ రకరకాల లెక్కలు చెప్పి తనే తీసుకుంటాడు. చివరికి మీరే బాకీ ఉన్నారని లెక్క చెబుతాడు. ప్రస్తుతం పోలవరం నిధుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు అచ్చంగా అంతే ఉంది. పనులు చేయిస్తున్నామని బిల్లులు చెల్లించాలని రీఎంబర్స్ కోసం రాష్ట్రం పంపితే.. వాటన్నింటినీ రకరకాల కారణాలతో తిప్పి పంపుతోంది. ఇటీవల ప్రభుత్వం రూ.1,303 కోట్లు విడుదల చేయాలని బిల్లులు పంపింది. వాటిలో రూ.532.80 కోట్లు ఇవ్వబోమని బిల్లులను తిప్పి పంపేశారు. దానికి కారణం ఆ పనులు చేసింది పోలవరం కుడి, ఎడమ కాలువల కోసమని చెబుతోంది. కేంద్రం ఆమోదించిన అంచనాల ప్రకారం వాటికి నిధులు ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర అధికారులు చెబుతున్నారు. ఎడమకాలువ కింద ఖర్చుచేసిన రూ.169.10 కోట్లు, కుడి కాలువ కింద రూ.57.18 కోట్లు తిరస్కరించారు. ఇవికాక మరికొన్ని బిల్లులనూ తిప్పి పంపారు. ఇప్పుడు మాత్రమే కాదు ... గత రెండున్నరేళ్లుగా పోలవరం కోసం రీఎంబర్స్ చేసిన నిధుల కన్నా.. తిప్పి పంపిన బిల్లులే ఎక్కువ.
Also Read : ఏపీలో పాఠశాలలకు దసరా సెలవులు ఎప్పటి నుంచి.. ఎప్పటి వరకు అంటే..?
తాగునీటి కోసం చేసే ఖర్చు.. విద్యుత్ ప్లాంట్ ఖర్చులూ నో రీఎంబర్స్ !
ప్రాజెక్ట్ అంటేనే తాగు, సాగునీటి కోసం వాడుకుంటారు. అందులో సాగునీటి కోసం అయ్యే ప్రాజెక్టు ఖర్చుమాత్రమే భరిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రానికి ఎలా చెప్పాలో తెలియక ఏపీ అధికారులు తలు పట్టుకుంటున్నారు. బిల్లులు పంపుతున్నారు కానీఅందులో సగానికిపైగా వెనక్కి వస్తున్నాయి. ప్రధానడ్యాంకు అవసరమైన మట్టి, రాయిని విద్యుత్ కేంద్రం ప్రాంతంలో తవ్వి తీసి ఉపయోగిచుకున్నారు. ఆ పనులకు రూ. యాభై కోట్లు రీ ఎంబర్స్ చేయాలని బిల్లులు పెట్టారు. దాన్ని కేంద్రం తిరస్కరించింది. విద్యుత్ కేంద్రం పనులతో సంబంధం లేదని కేంద్రం వాదిస్తోంది. ఆ వివాదాన్ని తర్వాత చూసుకుందాం.. ప్రస్తుతం ప్రధాన డ్యాం పనుల కోసమే అక్కడ మట్టిని తవ్వామని ఉభయతారకంగా ఉంటుందని విద్యుత్ ప్లాంట్ స్థలంలో తవ్వామని చెప్పినా కేంద్రం పట్ిటంచుకోవడం లేదు. బిల్లులు ఇచ్చేది లేదని తేల్చేసింది.
సవరించిన అంచనాలను ఆమోదించడానికి ఇష్టపడని కేంద్రం !
ఓ చిన్న ఇల్లు సగం కట్టి ఆపేసి..మరో ఏడాది తర్వాత ప్రారంభిస్తేనే వ్యయం ఎంత పెరుగుతుందో అంచనా వేయవచ్చు. అలాంటిది పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యమయ్యేకొద్దీ ఎంత భారం పెరుగుతుంతో ఊహించడం కష్టమేం కాదు. పోలవరం నిర్మాణ వ్యయం 2010- 11 లెక్కల ప్రకారం వ్యయం రూ.16,010 కోట్లు. 2017-18 ధరలను పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు సవరించారు. సవరించిన అంచనాలను ఆమోదింపచేసుకోవడానికి గత ఏపీ ప్రభుత్వం అప్పట్నుంచి ప్రయత్నిస్తోంది. కేంద్ర జలసంఘం పరిధిలోని సాంకేతిక సలహా సంఘం ఆమోద ముద్ర వేసింది. కానీ కేంద్ర ఆర్థిక శాఖ మాత్రం కొర్రీలు పెట్టింది. 2017 మార్చిలో జరిగిన క్యాబినెట్ తీర్మానం ప్రకారం 2013 ముందు నాటి లెక్కలనే పరిగణలోకి తీసుకుంటామని కేంద్రం ఇటీవల తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టు 2013-14 అంచనాలు రూ.20,398 కోట్లు. ఇప్పటి వరకూ ఇచ్చిన వాటిని తీసేస్తే ఇక ఇవ్వాల్సింది రూ. 7053 కోట్లు మాత్రమేనని చెబుతోంది.ఆ మత్తాన్ని నాబార్డు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఈ మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తూ బిల్లులు పెట్టి రీఎంబర్స్ చేయించుకోవాలి.
Also Read : రాష్ట్రాల హక్కులపై ఒక్క స్టాలిన్‌కేనా బాధ? మిగతా సీఎంలు ఎందుకు స్పందించరు?
అసలు సమస్య నిర్వాసితుల పునారావాసమే !
సాగునీటి ప్రాజెక్ట్ అంటే.. అందులో మొట్టమొదటిగా వచ్చే అంశం భూసేకరణ. ముంపు ప్రాంతాల్లో ఉన్న వారందరికీ పరిహారం ఇచ్చి ఖాళీ చేయించాలి. దీన్ని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అంటారు. ఇదంతా ప్రాజెక్టులో భాగం. పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం నిధులు భరిస్తామని చెబుతున్న కేంద్రం.. ఈ ఆర్ అండ్ ఆర్ బాధ్యత మాత్రం తమది కాదంటోంది. గత ఏపీ సర్కార్ దీనిపై తీవ్రంగా పోరాడింది. అందుకే.. నేరుగా ప్రకటన చేయలేకపోయింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి.. తమకేం సంబంధం లేదని మొహం మీదే చెబుతోంది. దీంతో పోలవర సహాయ, పునరావాసానికి అయ్యే రూ. 35వేల కోట్ల రాష్ట్రానికి భారంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. 2007 నుంచి ప్రారంభించి ఇప్పటి వరకూ పునరావాసంలో 10శాతం మాత్రమే పూర్తి చేశారు.
Also Read : సమస్య ఆర్యన్ ఖానా ? డ్రగ్సా ? ఎప్పటికి తెలుసుకుంటారు ?
మధ్యేమార్గం నీటి నిల్వను తగ్గించే యోచనలో ప్రభుత్వం !
పోలవరం ప్రాజెక్ట్ నీటి నిల్వకు సిద్ధం చేయాలంటే కేంద్రం ఇచ్చే నిధులు సరిపోవు. అంచనాలు ఆమోదించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిధులు వచ్చించే పరిస్థితి లేదు. ఇలాంటి కారణంగా పోలవరంలో మొదటగా 41.5 మీటర్ల వరకే నీటి నిల్వ చేయాలని నిర్ణయించారు. అంటే 120 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేస్తారు. ఇలా చేయడం వల్ల సహాయ పునరావాసానికి భారీగా ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు. 41.5 మీటర్ల వరకే నీటి నిల్వ చేయడానికి అవసరమైన నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం నిధులు పూర్తి స్థాయిలో సమకూర్చుతామని జగన్ ప్రకటించారు. కానీ.. ఈ 120 టీఎంసీల నీటి వల్ల గ్రావిటీ ద్వారా..రైతులకు నీళ్లివ్వడానికి అవకాశమే ఉండదు. మళ్లీ ఎత్తి పోసుకోవాలి. ఉత్తరాంధ్రకు నీటి పంపిణీ సాధ్యం కాదు. రాయలసీమ సంగతి చెప్పాల్సిన పని లేదు.
Also Read : టాలీవుడ్ పెద్ద దిక్కెవరో తేల్చనున్న "మా" ఎన్నికలు ! అసలు పోటీ మోహన్‌బాబు, చిరంజీవి మధ్యేనా ?
పోలవరంలో తేడా వస్తే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగానికే ముప్పు !
పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకపోయినా సామర్థ్యం తగ్గిపోయినా ఆ ప్రాజెక్ట్ ఆసరాగా రాష్ట్రం నలుమూలలకు తరలించాలనుకుంటున్న ప్రాజెక్టులన్నీ ఆగిపోతాయి. ఆ ప్రాజెక్టుల విలువ రూ. 70వేల కోట్లకుపైగానే ఉంటుంది. పోలవరం నీటిని రాష్ట్రం నలుమూలలకు తీసుకెళ్లడానికి ఎన్నో ప్రణాళికలు వేశారు. పోలవరం పూర్తి చేస్తే మొదటగా లాభపడేది రాయలసీమ ప్రజలు. దాదాపుగా రూ. 40వేల కోట్లతో 'సీమ' దుర్భిక్ష నివారణ పథకానికి ప్రణాళిక సిద్ధం చేశారు. అలాగే.. విశాఖకు తాగు, పారిశ్రామిక అవసరాల కోసం నీటిని తరలించడానికి పనులు ప్రారంభించారు. దానికి రూ. 9 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. శ్రీకాకుళం వరకు గోదావరి జలాలను తీసుకెళ్లేందుకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు కూడా ప్రారంభించారు. పల్నాడు దుర్భిక్ష నివారణ పథకం, కొల్లేరు భారజల సాంద్రత నివారణ పథకాలు కూడా ఆగిపోతాయి.
Watch Video : నేను బతికున్నానని చెప్పండయ్యా.. రెవెన్యూ ఆఫీస్ వద్ద ఓ వృద్ధుని ఆవేదన
కేంద్రంపై ఒత్తిడి చేయలేకపోతున్న పార్టీలు !
ఏపీకి జీవనాడి వంటి ప్రాజెక్ట్ అని అందరూ అంగీకరిస్తారు కానీ ప్రాజెక్ట్ పూర్తి విషయంలో సహకరించాలని విభజన చట్టాన్ని పాటించాలని అన్ని పార్టీలు కలసి కట్టుగా కేంద్రంపై ఒత్తిడి తేలేకపోతున్నాయి. కారణం ఏమైనా పోలవరంపై కేంద్రం తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్నా రాష్ట్రం వీలైనంత మౌనం పాటిస్తోంది. ప్రతిపక్షాలూ ప్రశ్నించడం లేదు. పోలవరం ప్రాజెక్ట్ ఎంత ఆలస్యమైతే అంత భారం అవుతుంది. అంతిమంగా రాజకీయ అశక్తతకు పోలవరం ప్రాజెక్టు మూల్యం చెల్లించుకుంటోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read : ఎరక్కపోయి ఇరుక్కున్న ఎయిరిండియా.. ఫ్లైట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఎలా ఇరుక్కుందో చూడండి