AP Loans Issue : " ఆ " అప్పుల వివరాలు కూడా చెప్పాల్సిందే - ఏపీ సర్కార్‌కు కేంద్రం మరో లేఖ !
ఆఫ్ బడ్జెట్ రుణాల వివరాలను వెల్లడించాలని కేంద్రం ఏపీ ప్రభుత్వానికి మరోసారి లేఖ రాసింది. నెలాఖరులోపు పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న రుణాల వివరాల గురించి వెల్లడించాల్సిందేనని కేంద్రం వెంట పడుతోంది. గతంలో ఇచ్చిన వివరాలు అసమగ్రంగా ఉండటంతో మరోసారి ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (పీఏజీ) కార్యాలయం ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇప్పటి వరకు తీసుకున్న అప్పుల వివరాలను ఈనెల 31లోపు అందించాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శికి లేఖ అందింది.
బడ్జెట్‌లో నమోదుకాని రుణాల వివరాలు చెప్పాలని పేర్కొంది. ప్రభుత్వ హామీతో పీఎస్‌యూలు, కార్పొరేషన్లు, సొసైటీలు తీసుకున్న రుణాలపై వివరాలను తెలపాలని లేఖలో కోరింది. రుణం తీసుకున్న సంస్థ పేరు, ఏ ఆర్థిక సంవత్సరం నుంచి తీసుకున్నారు? ఎంత మొత్తంలో తీసుకున్నారు? తదితర అంశాలను నిర్దేశిత ఫార్మాట్‌లో వివరాలు ఇవ్వాలని సూచించింది. ప్రభుత్వ హామీకి సంబంధించిన ఉత్తర్వులను కూడా అందజేయాలని ఆదేశించింది. గతంలోనే కేంద్రం ఏజీ కార్యాలయం నుంచి ఇలాంటి లేఖలు పంపింది. అప్పుడు ఏపీ ప్రభుత్వం వివరాలు ఇచ్చింది. అయితే అవి సమగ్రంగా లేవి కేంద్రం వెనక్కి పంపింది.
ప్రభుత్వ రంగ సంస్థలైన అనేక కార్పొరేషన్లు ఇటీవల కాలంలో భారీగా రుణాలు తీసుకుంటు న్నాయి. దాదాపు 33 సంస్థలు రెండు లక్షల కోట్లకుపైగా రుణాలు తీసుకున్నట్లుగా ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో సింహభాగం ప్రభుత్వ అవసరాలకు పిడి ఖాతాల ద్వారా మళ్లిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇందులో అత్యధికంగా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ రూ.35 వేల కోట్ల వరకు రుణాలు తీసుకున్నట్లు తేలింది. ఇంధన శాఖకు సంబంధించి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ.14 వేల కోట్లు, పవర్ కో-ఆర్డినేషన్ సంస్థ ద్వారా డిస్కామ్‌లు రూ.11 వేల కోట్లు, జెన్‌కో రూ.5 వేల కోట్లు, పవర్ డెవలప్‌మెరటు కార్పొరేషన్ రూ.వెయ్యి కోట్లు రుణంగా తీసుకున్నట్లు సమాచారం.
ఇళ్ల నిర్మాణానికి సంబంధించి టిడ్కో రూ.12 వేల కోట్లు, గృహ నిర్మాణ సంస్థ రూ.4 వేల కోట్లు రుణంగా సమీకరించుకున్నట్లు తెలిసింది. రహదారుల అభివృద్ధి సంస్థ, నీటివనరుల అభివృద్ధి సంస్థ, ఆర్‌టిసి కూడా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ తీసుకున్న జాబితాలో ఉన్నాయి. కొత్తగా ఏర్పాటుచేసిన రాష్ట్రాభివృద్ధి సంస్థ రూ.23 వేల కోట్లు, ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ రూ.10 వేల కోట్లు తీసుకోగా, గ్యారెంటీలు లేకుండా మరికొన్ని సంస్థలు రూ.65 వేల కోట్ల వరకు రుణాలు తీసుకున్నట్లు సమాచారం. భారీ రుణాలపై ఏటా రూ.15 వేల కోట్ల నుంచి రూ.17 వేల కోట్ల వరకు అసలుకు వాయిదాలు, వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని తెలుస్తోంది. వీటన్నింటి గురించి పూర్తి సమాచారం కేంద్రానికి చెప్పకపోతూడంటంతో సమస్య వస్తోంది.