Jagan CBI Court Verdict : నేడు జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై తీర్పు.. వైసీపీలో ఉత్కంఠ !
బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్న కారణంగా ఏపీ సీఎం జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని ఎంపీ రఘురామ వేసిన పిటిషన్‌పై బుధవారం సీబీఐ కోర్టు తీర్పు చెప్పనుంది. ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ ఏపీలో ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు బుధవారం తీర్పు చెప్పనుంది. రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్‌పై జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేశారు. ఈ పిటిషన్లపై తీర్పును బుధవారం న్యాయమూర్తి వెల్లడించనున్నారు.
ముఖ్యమంత్రి జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నందున బెయిల్ రద్దు చేసి.. ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని రఘురామకృష్ణరాజు ఏప్రిల్ మొదటి వారంలో పిటిషన్ దాఖలు చేశారు. రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌లో కీలకమైన అంశాలను వివరించారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన వివిధ కారణాలు చెబుతూ కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని అధికారాన్ని ఉపయోగించి. అందరి నోళ్లు నొక్కేలా వ్యవహరిస్తున్నారని తప్పుడు కేసులు పెడుతున్నారని ఇలా ఇతర అంశాలను వివరించారు. అయితే ఎంపీ వ్యక్తిగత కక్షతోనే పిటిషన్ వేశారని జగన్ కౌంటర్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ వేయడానికి నిరాకరించింది. మెరిట్ ప్రకారం నిర్ణయం తీసుకోండి అని సీబీఐ కోర్టుకే చాయిస్ వదిలేసింది. సీఎం జగన్, పిటిషనర్ తరపు న్యాయవాదులు రిజాయిండర్ వేసినప్పటికీ సీబీఐ అధికారులు మాత్రం కేవలం కోర్టుకు విచక్షణ అధికారానికే వదిలేస్తున్నామని తెలిపారు. బెయిల్ రద్దు చేయాలా వద్దా అనే అంశానికి సంబంధించి న్యాయపరమైన చర్యలు కోర్టే తీసుకోవాలని రిజాయిండర్లో పేర్కొన్నారు. దీంతో జగన్, రఘురామ తరపు న్యాయవాదులు మాత్రం వాదనలు వినిపించారు.
మరో వైపు విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై కూడా బుధవారం విచారణ కొనసాగనుంది. ఇప్పటికే విజయసాయిరెడ్డి కూడా లిఖితపూర్వకమైన కౌంటర్ దాఖలు చేశారు కోర్టే నిర్ణయం తీసుకోవాలని సీబీఐ చెప్పింది. ఎంపీ పదవిని అడ్డం పెట్టుకుని విజయసాయిరెడ్డి సాక్షుల్ని బెదిరిస్తున్నారని... బెయిల్‌పై ఉండి న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని రఘురామకృష్ణరాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే రఘురామ పబ్లిసిటీ కోసమే పిటిషన్ వేశారని.. ఆయనపై అనేక కేసులు ఉన్నాయని విజయసాయిరెడ్డి కౌంటర్‌లో పేర్కొన్నారు.
జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత ఆయనపై రాజద్రోహం కేసు పెట్టిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలను కూడా కోర్టులో రఘురామ తరపు న్యాయవాదులు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. బెయిల్ రద్దు పిటిషన్‌పై రాజకీయ దుమారం కూడా రేగింది. జగన్ బెయిల్ రద్దవుతుందని కొంత మంది బీజేపీ నేతలు విమర్శలు చేశారు. దానిపై ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. మీకెలా తెలుసంటూ విరుచుకుపడ్డారు. ఈ పరిణామాల నేపధ్యంలో జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై తీర్పు పై ఆసక్తి ఏర్పడింది.