YS Viveka murder case: సీబీఐ ఎస్పీపై తప్పుడు కేసులు పెట్టిన వారికి షాక్ - ఇద్దరు పోలీసులపై కేసులు నమోదు
Police Case: సీబీఐ ఎస్పీపై తప్పుడు కేసులు పెట్టిన ఇద్దరు కడప జిల్లా పోలీసులపై కేసులు నమోదయ్యాయి. నిందితులతో కుమ్మక్కయి ఈ పని చేశారని అనుమానిస్తున్నారు.

Cases registered against two Kadapa district police officers: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి వివేకా కుమార్తె వైఎస్ సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌లపై తప్పుడు కేసులు నమోదు చేయించిన ఇద్దరు పోలీసు అధికారులపై పులివెందుల పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఏఎస్‌ఐ రామకృష్ణారెడ్డి, విశ్రాంత ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డి అనే ఇద్దరిపై ఈ కేసులు నమోదయ్యాయి. సుప్రీంకోర్టు తాజా తీర్పు వెలువడిన తర్వాత కేసులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
వివేకా హత్య కేసు 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందులలో జరిగింది. ఆయన ఇంట్లోనే మృతదేహం కనుగొన్నారు. ఈ కేసు సీబీఐకి హైకోర్టు అప్పగించింది. విచారణ సమయంలో ఆరోపణలు, సాక్షుల మరణాలు, తప్పుడు కేసులు చాలా వచ్చాయి 2019-2021 మధ్య, వివేకా హత్య కేసు దర్యాప్తులో సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌లపై రాజేశ్వర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి నేతృత్వంలో తప్పుడు కేసులు నమోదు చేయించారని ఆరోపణ. ఇవి కేసు దర్యాప్తును ప్రభావితం చేయడానికి, సాక్షులను బెదిరించడానికి ఉద్దేశించినవని ఆరోపణలు ఉన్నాయి.
సుప్రీంకోర్టు ఇటీవల వివేకా కేసు ట్రాన్స్‌ఫర్, మరిన్ని దర్యాప్తులపై తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఆధారంగా, తప్పుడు కేసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మొత్తం 22 మంది సాక్షుల విచారణలో ఈ అధికారుల పాత్ర బయటపడినట్లుగా తెలుస్తోంది. పులివెందుల పోలీసులు శుక్రవారం ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఇది IPC సెక్షన్లు 211 (తప్పుడు కేసు నమోదు), 506 (బెదిరింపు) కింద కేసు రిజిస్టర్ చేశారు.
సీబీఐ వివేకా హత్య కేసులో దూకుడుగా దర్యాప్తు చేస్తున్న సమయంలో వివేకా పీఏ కృష్ణారెడ్డి తనను వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డితోపాటు సీబీఐ ఎస్పీ రాంసింగ్ బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాంసింగ్ తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా చెప్పాలని బెదిరించారని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ సంచలనాత్మకమైన హత్య కేసులో దర్యాప్తు జరుపుతున్న అధికారిపై నేరుగా రివర్స్ లో పోలీసులు కేసు పెట్టడం అప్పట్లోనే కలకలం రేపింది. అప్పటి ప్రభుత్వం వివేకా కేసులోసీబీఐపై ఆరోపణలు చేస్తూ రావడతో .. విచారణకు సహకరించలేదని తేలిపోయింది.
సీబీఐని తప్పు పట్టడానికి, విచారణను స్లో చేయడానికి ఈ తప్పుడు కేసుల వ్యూహం ఎంచుకున్నారని అనుమానిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆ కేసులన్నీక్వాష్ చేసి.. తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ఇప్పుడు కేసులు నమోదు చేశారు. ఒకరు ఇప్పటికే రిటైర్ అయ్యారు. మరొకరు సర్వీసులో ఉన్నారు. ఆ అధికారిని సస్పెండ్ చేసే అవకాశం ఉంది.





















