Brother Anil Controversy : దేవుడి పథకాలు వేరే ఉంటాయి - బ్రదర్ అనిల్ హెచ్చరించింది సీఎం జగన్ నేనా ?
జగన్ ప్రభుత్వంపై బ్రదర్ అనిల్ చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేలా ప్రార్థనల్లో ఆయన కామెంట్లు చేస్తున్నారు.
Brother Anil Controversy : పక్క రాష్ట్రాల్లో పుట్టి ఉంటే బాగుండేదని బ్రదర్ అనిల్ విశాఖ జిల్లా భీమిలీలో క్రిస్మిస్ ప్రార్థనల సందర్భంగా దైవవాక్యంలో భాగంగా వ్యాఖ్యానించిన అంశం వైరల్ అవుతోంది. ఓ ప్రధాన దినపత్రిక ఈ విషయాన్ని హైలెట్ చేసింది. దీంతో అసలు బ్రదర్ అనిల్ కుమార్ ఏం మాట్లాడారన్నదానిపై విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఆ పత్రిక ప్రకటించిన దాని ప్రకారం దైవ వాక్యం మధ్యలో ప్రతీ సారి పరోక్షంగా ప్రభుత్వంపై బ్రదర్ అనిల్ కుమార్ విమర్శలు గుప్పించారు. ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారని పక్క రాష్ట్రంలో పుట్టి ఉండినా బాగుండేదని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
స్వార్థంతో ఇచ్చే పథకాలపై ఆధారపడవద్దని ప్రజలకు బ్రదర్ అనిల్ పిలుపు
తమ స్వార్థం కోసం ప్రభుత్వాలు ఇచ్చే పథకాలపై ఆధారపడవద్దని ప్రార్థనలో పాల్గొన్న వారికి సూచించారు. ప్రజలను ఇలా వేధించే వారి విషయంలో దేవుడి పథకాలు వేరే ఉంటాయని కూడా హెచ్చరికలు చేయడం సంచలనంగా మారింది. ఇలా ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు ప్రార్థనలకు హాజరైన వారి నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడం అందరిలోనూ ఆశ్చర్యం కలిగించింది. బ్రదర్ అనిల్ కుమార్.. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల భర్త. షర్మిలకు, జగన్ మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయన్న ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది. ఈ క్రమంలో బ్రదర్ అనిల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
గతంలోనూ ప్రభుత్వంపై విమర్శలు చేసిన బ్రదర్ అనిల్
అయితే బ్రదర్ అని ఏపీ ప్రభుత్వంవైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ విజయవాడ, విశాఖల్లో క్రైస్తవ సంఘాలతో సమావేశం పెట్టి తనపై పార్టీ పెట్టాలనే ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందని చెప్పుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆయన ఏపీలో పలు చోట్ల సమావేశాలు నిర్వహించారు. ఆ సందర్భంగా కూడా ప్రభుత్వంప విమర్శలు చేశారు. క్రిస్టియన్ మైనారిటీలు చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని అనిల్ తెలిపారు. జగన్ గెలుపు కోసం శ్రమించిన వారంతా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. వారి సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. వాటిని తెలుసుకునేందుకు కొందరితో సమావేశమైనట్టు అప్పట్లో చెప్పారు. బ్రదర్ అనిల్ విమర్శలు కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉన్నాయి. ఆయనతో భేటీకి వచ్చిన నేతలు కూడా నేరుగా ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. తాము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామని.. వాటిని వివరించేందుకు జగన్ ప్రభుత్వం సమయం ఇవ్వడం లేదని గోడు వెళ్లబోసుకున్నారు.
ఏపీలోనూ బ్రదర్ అనిల్ రాజకీయాలు చేయాలనుకుంటున్నారా ?
ఆ తర్వాత ఏమయిందో కానీ.. ఆయన సైలెంట్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు ఏపీలో క్రిస్మిస్ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ప్రార్థనా కూటములకు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి అక్కడే పని చేసుకుంటున్నారు. ఆమెకు తెలంగాణ రాజకీయాలు కన్నా ఏపీ రాజకీయాల్లో మంచి భవిష్యత్ ఉంటుందని చాలా మంది సలహాలిస్తున్నారు. షర్మిల అంటే ఏపీలో రాజకీయాలు చేసుకోవాలన్న అభిప్రాయం ఎక్కువ మంది వినిపిస్తున్నారు .ఈ క్రమంలో బ్రదర్ అనిల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూండటం హైలెట్ అవుతోంది.