Brijesh kumar tribunal: నవంబర్ 15లోపు అభిప్రాయం చెప్పాలి, ఏపీకి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆదేశం
కృష్ణా జలాలు అంశంపై ట్రిబ్యునల్ తీర్పును వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 15 లోపు తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణ జలాల పంపిణీ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 15 లోపు తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ పై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందని అందుకు అవకాశం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రిబ్యునల్ ను కోరగా.... ఆంధ్ర ప్రదేశ్ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణ ట్రిబ్యునల్ వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ ప్రారంభించింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు సంబంధించిన విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలని ఈనెల 6న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కృష్ణ నది జలాల పంపకాలపై విచారణ అధికారులను కేంద్రం నోటిఫై చేసింది.
అయితే ఏపీ ప్రభుత్వం అభ్యర్థనను తెలంగాణ ప్రభుత్వం తోసిపుచ్చింది. నీటి పంపకాల పై విచారణను వెంటనే చేపట్టాలని ట్రిబ్యునల్ ను తెలంగాణ ప్రభుత్వం కోరింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను ట్రిబ్యునల్ వాయిదా వేసింది. వచ్చే నెల నవంబర్ 22, 23వ తేదీల్లో ట్రిబ్యునల్ విచారణ చేపట్టనుంది.
ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ
బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌పై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్రిబ్యునల్‌కు కొత్త విధి విధానాలు ఇవ్వడంపై ఏపీ సర్కార్ సుప్రీంకి వెళ్లింది. కేంద్ర నిర్ణయాలన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.
కృష్ణా నది జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర హక్కుల పరిరక్షణలో రాజీ పడే ప్రశ్నే లేదని సీఎం జగన్ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేంద్ర జల్ శక్తి శాఖ కొత్త మార్గదర్శకాలతో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలని కోరింది.
కృష్ణానదిలో మొత్తం 2,130 టీఎంసీల్లో మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలను బచావత్ నేతృత్వంలోని కేడబ్ల్యూడీటీ–1 పంపిణీ చేసింది. అయితే ఈ అవార్డు గడువు ముగియడంతో కృష్ణానది జలాలను పునఃపంపిణీ చేయాలని నదీ పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కోరడంతో అంతర్‌రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956 మేరకు 2004 ఏప్రిల్ 2న జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నేతృత్వంలో కేడబ్ల్యూడీటీ–2 ఏర్పాటు చేశారు.
మూడు రాష్ట్రాల వాదనలను విన్న కేడబ్ల్యూడీటీ–2.. కేడబ్ల్యూడీటీ–1 కేటాయింపులను కొనసాగిస్తూనే.. 75 శాతం, 65 శాతం లభ్యత మధ్య ఉన్న 448 టీఎంసీల్లో మహారాష్ట్రకు 81, కర్ణాటకకు 177, ఉమ్మడి ఏపీకి 190 టీఎంసీలను కేటాయిస్తూ 2010 డిసెంబర్ 30న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. విభజన తర్వాత తెలంగాణ సర్కార్ కూడా కేడబ్ల్యూడీటీ–2 తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎస్సెల్పీ దాఖలు చేసింది. వీటిపై సుప్రీంకోర్టు విచారణ నిర్వహిస్తోంది.