Tirupati: తిరుపతిలో విషాదం.. వర్షపు నీటిలో మునిగిన వాహనం.. నవ వధువు దుర్మరణం
తిరుపతిలో విషాద ఘటన చోటు చేసుకుంది. నవ వధువు నీటిలో మునిగి చనిపోయింది.
ఆ కుటుంబంలో పెళ్లి చేసిన ఆనందం ఎంతో కాలం నిలవలేదు. కొత్త జంట నూరేళ్లు.. ఆనందంగా కలిసి.. ఒకరికొకరు తోడుగా ఉండలనుకుంది. కానీ విధి ఆడిన ఆటలో నవ వధువు మృతి చెందింది. పెళ్లి చేసుకున్న సంతోషం ఆవిరైపోయింది.
కర్ణాటకకు చెందిన ఓ కుటుంబం శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చింంది. అయితే.. అప్పుడే కురిసిన భారీ వర్షానికి బాలాజీ కాలనీ నుంచి యం.ఆర్.పల్లికి వెళ్లే దారిలో వెంగమాంబ కూడలి వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గరలో భారీగా వరద నీరు చేరింది. దాదాపు నీళ్లు 8 అడుగులకు పైగా ఉన్నాయి. అయితే .. అంత లోతుగా ఉంటుందని ఊహించని డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. నీటిలోకి వెళ్లిన వాహనం మధ్యలో ఆగింది. వాహనంలో ఉన్న వారంతా నీటిలో చిక్కుకున్నారు. అర్ధరాత్రి సమయం కావడంతో నరకం చూశారు.
వరద నీటిలో చిక్కుకున్న వాళ్లు కేకలు వేయడంతో. .స్థానికులు ఈ విషయాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు వచ్చి సహాయం కార్యక్రమాలు చేశారు. వాహనంలోనే ఉన్న కుటుంబ సభ్యులను ఒక్కక్కొరిగా బయటకు తీసుకు వచ్చారు. చాలా సేపు నీటిలోనే ఉండటంతో ఊపిరి ఆడక నవ వధువు మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒక చిన్నారి ఉంది.
రాత్రి సుమారు 1:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కొత్తగా పెళ్లైన జంటను తిరుమల శ్రీవారి దర్శనానికి తీసుకొస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నవ వధువు మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వర్షం పడితే ఆ ప్రాంతంలో వరదీ నీరు నిలుస్తుందని స్థానికులు అంటున్నారు. ఎంతో కాలంగా ఈ సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటున్నారు. సమస్యను పరిష్కారిస్తే.. నవ వధువు మృతి చెందేది కాదని.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా.. సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తాం
వర్షపు నీటిలో చిక్కుకుని నవ వధువు మృతి చేందడం చాలా భాధాకరమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఘటన స్థలాన్ని తిరుపతి నగర పాలక సంస్థ అధికారులతో కలిసి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు. ఎనిమిది అడుగులఎత్తు వరకు వర్షపు నీళ్లు నీలవడంతో పాటు డ్రైవర్ అజాగ్రత వల్ల నవ వధువు మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు. కేవలం 15 నిమిషాలు మాత్రమే ఇక్కడ నీళ్లు నిలిచాయని.. అంతలోపు ఈ ఘటన జరిగిందన్నారు. 15 నిమిషాల్లో ఇక్కడ నిలిచిన వర్షపు నీరు పూర్తిగా తొలగిపోయిందని చెప్పారు. ఇలాంటివి పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు చేపడతామని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
Also Read: CBI Arrest: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు.. మరో ఆరుగురిని అరెస్టు చేసిన సీబీఐ