GVL On Alliance : బీజేపీ కలయికతో ప్రత్యామ్నాయం అంటే టీడీపీతో పొత్తు కాదు - క్లారిటీ ఇచ్చిన జీవీఎల్ !
టీడీపీతో పొత్తు పెట్టుకునే దిశగా భీమవరంలో తీర్మానం చేయలేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పష్టం చేశారు. కుటుంబ పార్టీలకు వ్యతిరేకమన్నారు.
GVL On Alliance : భీమవరంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో .. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ బీజేపీ కలయికతో రావాలని తీర్మానం చేసిన అంశంతో... బీజేపీ కూడా టీడీపీకి దగ్గరవుతోందన్న ప్రచారం ప్రారంభమయింది. దీనిపై విశాఖలో మీడియాతో మాట్లాడిన జీవీఎల్ నరసింహారావు .. ఆ ప్రచారాన్ని ఖండించారు. ప్రత్యామ్నాయ వ్యవస్థ బిజెపి కలయికతో రావాలి - అని చెప్పారు. కానీ కొందరు అప్పుడే దీనికి వక్రభాష్యాలు చెపుతున్నారని ఆరోపించారు. వైసీపీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలి. కానీ అది టిడిపి కాదు. భ్రమలు వద్దని స్పష్టం చేశారు. మేమూ జనసేనా కలిసే ఉన్నాము. ఈ విషయాన్ని మేమూ, జనసేనా చెపుతుంటే కాదు కాదని కొందరు ప్రచారం చేయటం ఏమిటని జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు.
వారసత్వ రాజకీయాలకు బిజెపి దూరమని జీవఎల్ ప్రకటించారు. కుటుంబమయం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో ఈ వారసత్వాల మీదే మా పోరు ఉంటుందని ప్రకటించారు. రాష్ట్రంలో హిందూ వ్యతిరేక వైఖరి పెరిగింది. తిరుమల దేవుడినించి భక్తులను దూరం చేస్తున్నారు. బిజెపి తప్ప ఎవరూ గొంతెత్తటం లేదన్నారు. మంగళవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. విశాఖ, ఉత్తరాంధ్ర అభివృద్ధి పనుల గురించి తన స్థాయిలో ప్రయత్నిస్తానన్నారు. అరకు రోడ్డు అభివృద్ధి గురించి నితిన్ గడ్కరీని అడుగుతాను. స్టీలు ప్లాంటు సమస్యలు, ఉత్తరాంధ్రలో ఇబిసి రిజర్వేషన్లు, మత్స్యకారుల సమస్యలు వంటివి ప్రస్తావిస్తామని తెలిపారు. అన్ని పెండింగు పనులూ పూర్తయేలా నావంతు కృషి చేస్తాను. స్థానిక అంశాలన్నీ నాకు తెలుసు. రానున్న రెండు నెలల్లో రాష్ట్ర సమస్యలు, విశాఖ సమస్యలు అన్నీ కేంద్ర దృష్టికి తీసుకు వెళతాం. వందేభారత్ విశాఖకు రావటం ఒక వరం. భవిష్యత్తులో మరిన్ని వందే భారత్ రైళ్లు వస్తాయి. విశాఖనుంచి తిరుపతి మీదుగా బెంగుళూరుకు ఒక వందేభారత్ కావాలని అడుగుతున్నామని తెలిపారు.
పవన్ కల్యాణ్ చెబుతున్న విషయాలను ఎవరికి వారు అనుకూలంగా అర్థాలు తీసుకుంటున్నారని జీవీఎల్ విమర్శించారు. ఇటీవల వారాహి వాహనానికి పూజ చేసేందుకు పవన్ కల్యాణ్ .. తెలంగాణలో కొండగట్టు వెళ్లారు. అక్కడ తాము బీజేపీతోనే ఉన్నామని బీజేపీ కాదంటే... వేరే పార్టీలతో పొత్తుకు ప్రయత్నిస్తామన్నారు. అయితే ఆ వ్యాఖ్యలు తెలంగాణను ఉద్దేశించి చేశారని.. ఏపీ పొత్తులపై కాదన్న అభిప్రాయం ఉంది. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. తర్వాతి రోజు మంగళగిరి పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడారు. అయితే బీజేపీతో పొత్తుల విషయంలో కొండగట్టులో చేరిన తరహా ప్రకటనలు చేయలేదు. అయితే ఓట్లు చీలనివ్వబోమని పదే పదే ప్రకటిస్తున్నారు., టీడీపీ అధినేతతో భేటీ అవుతున్నారు. అదే సమయంలో 2014 పొత్తులు కుదరవచ్చన్న ప్రచారమూ జరుగుతోంది.
భీమవరం కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ కూడా ... జనసేనతో పొత్తు విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ బీజేపీ కలయికతో రావాలని తీర్మానం చేశారు. ఇది రకరకాల చర్చలకు కారణం అయింది. అందుకే టీడీపీతో పొత్తు ఉండదని జీవీఎల్ క్లారిటీ ఇచ్చారు.