Jagan talks with Congress : కాంగ్రెస్‌లో వైసీపీ విలీనానికి జగన్ చర్చలు - బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
BJP MLA Nallamilli : కాంగ్రెస్ లో వైసీపీని విలీనం చేసేందుకు జగన్ చర్చలు జరుపుతున్నారని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. డీకే శివకుమార్ తో చర్చలు జరిపేందుకే బెంగళూరు వెళ్లారన్నారు.
Ysrcp : వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్లింది ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో చర్చలకు అని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనపర్తిలో మీడియాతో మాట్లాడిన ఆయన .. ప్రజలు ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వకుండా ఓడించడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు డీకే శివకుమార్ తో చర్చలు జరిపినట్లుగా సమచారం ఉందన్నారు.
బెంగళూరు లో ఉంటున్న జగన్మోహన్ రెడ్డి
ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి పులివెందుల వెళ్లారు. అక్కడ రెండు రోజులు ఉన్న తరవాత బెంగళూరు చేరుకున్నారు. ప్రస్తుతానికి ఆయన అక్కడే ఉంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు ఏపీకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తారని లేకపోతే రారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయ. ఒక వేళ అసెంబ్లీకి రాకూడదని నిర్ణయం తీసుకుంటే ఆయన బెంగళూరులోనే ఉండిపోయే అవకాశం ఉంది.
కాంగ్రెస్‌తో విలీనం చర్చలు వాస్తవమేనా ?
అయితే కాంగ్రెస్ తో విలీనానికి చర్చలు అన్నది మాత్రం రాజకీయవర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ఆయన ఇప్పటి వరకూ కాంగ్రెస్ గురించి ఎప్పుడూ సానుకూలంగా మాట్లాడలేదు. పైగా రాహుల్ గాంధీపై పలుమార్లు విమర్శలు చేశారు కూడా. ఇటీవల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు ఉంటుందని చెప్పారు. అంతే కానీ ఇండియా కూటమి వైపు వెళ్తున్నామన్న సంకేతాలు కూడా ఇవ్వలేదు.
బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఇంకా స్పందించని వైసీపీ
ఇటీవల ఈవీఎంలపై జగన్మోహన్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహించాలంటున్నరు. ఇండియా కూటమి డిమాండ్ కూడా ఇదే . దాంతో మెల్లగా ఇండియా కూటమి దారిలోకి జగన్ వెళ్తున్నారన్న చర్చ జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని.. తమ పార్టీ ఓటమిపై ఉన్న అనుమానాల్ని మాత్రం వ్యక్తం చేస్తున్నామని అంటున్నారు. వైఎస్ చనిపోయిన తర్వాత రాహుల్ ను ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని జగన్ ప్రకటించారు. తర్వాత మనసు మార్చుకున్నారు. అయితే ఇప్పుడు సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ చీఫ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును వెనక్కి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అదే జరిగితే వైసీపీ ఎక్కువ నష్టం జరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ లో విలీనానికి వైసీపీ చర్చలేనే పుకార్లు రావడం ఆసక్తికరంగా మారింది.