BJP Vs YSRCP : ఇక సీఎంగా ఎందుకు జగన్ ? - బీజేపీ జాతీయ నేత ప్రశ్న
జగన్మోహన్ రెడ్డి ఇక సీఎంగా ఎందుకని బీజేపీ నేత సత్యకుమార్ ప్రశ్నించారు. సీఎం జగన్ పై సోషల్ మీడియాలో ఘాటు విమర్శలు గుప్పించారు.
BJP Vs YSRCP : ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై .. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఘాటు విమర్శలు చేశారు. తనకు తెలియకుండానే ప్రతిపక్ష నాయకుడి అరెస్ట్ జరిగిందని ముఖ్యమంత్రి జగన్ అంటున్నారంటే రాష్ట్రంలో పాలన ఎటువంటి దయనీయ పరిస్థితుల్లో ఉన్నదో తెలుస్తోందని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. అలాంటప్పుడు, నెపం బిజెపి పైకి నెట్టే టక్కుటమార మాటలెందుకని సత్యకుమార్ ప్రశ్నించారు. మీకు తెలియకపోతే, మరి సిఐడి కి ఆదేశాలిస్తున్న ఆ అదృశ్య శక్తి ఎవరు?. కేసు వాదనకు వందల కోట్ల ప్రజాధనాన్ని దారపోస్తున్న ఆ ఉదార కుభేరుడు ఎవరు? అని సత్యకుమార్ ప్రశ్నించారు. వెకిలి మాటలకు, వికృత చేష్టలకు స్క్రిప్ట్ అందిస్తున్న ఆ అజ్ఞాత రచయిత ఎవరు? అని ప్రశ్నించారు.
తనకు తెలియకుండానే ప్రతిపక్ష నాయకుడి అరెస్ట్ జరిగిందని ముఖ్యమంత్రి @ysjagan అంటున్నారంటే రాష్ట్రంలో పాలన ఎటువంటి దయనీయ పరిస్థితుల్లో ఉన్నదో తెలుస్తోంది.
— Satya Kumar Y (సత్యకుమార్ యాదవ్) (@satyakumar_y) October 10, 2023
మరి అలాంటప్పుడు, నెపం బిజెపి పైకి నెట్టే టక్కుటమార మాటలెందుకు?
మీకు తెలియకపోతే, మరి సిఐడి కి ఆదేశాలిస్తున్న ఆ అదృశ్య శక్తి…
కరువు, కరెంటు కొరత మీద సమీక్షలు చేయడం తెలియదు .. సాగునీటి, విద్యుత్ నిర్వహణ చేయడం ఎలాగూ రాదు ... సమయానికి ఉద్యోగులకి జీతాలివ్వడం అసలే గుర్తుండదు ... పిల్లలకు పాఠ్యపుస్తకాలు, బాలింతలకు పోషకాహారం, పేదలకు ఇల్లు, ప్రజలకు రహదారులు, బహుజనులకు సబ్ ప్లాన్ నిధులు, యువతకు ఉద్యోగాలు…లాంటివి ఏవి ఇవ్వడం తెలియనప్పుడు ... మీరు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఎందుకు జగన్ ? అని సూటిగా ప్రశ్నించారు.
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం బీజేపీ కనుసన్నల్లో జరిగిందని చెప్పడానికి సీఎం జగన్ ప్రయత్నించారు. ఈ అంశంపై సత్యకుమార్ సోమవారం కూడా విమర్శలు గుప్పించారు. కేంద్రంలో బిజెపి ఉంది''ఐటి శాఖ నోటీసులు ఇచ్చిందని.. అని ఎవరికీ తెలియని నిజాలు మాట్లాడుతున్న సీఎం నక్కజిత్తులు మాని, మైండ్ గేమ్ ఆపి, దమ్ముంటే ప్రతిపక్ష నాయకుడి అరెస్ట్ వెనుక కేంద్రం ఉంది అని చెప్పాలని సవాల్ చేశారు. ఎన్ని అబద్దాలు ప్రచారం చేసినా, ఎన్ని మోసపు మాటలు మాట్లాడినా విశ్వసనీయత లేని ముఖ్యమంత్రి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనన్నారు. ప్రధాన సమస్యల నుండి, తన వైఫల్యాల నుండి తమ దృష్టిని మరల్చడానికే జగన్ ఈ కొత్త నాటకానికి తేర లేపారని ప్రజలకు తెలుసన్నారు.
అబద్దాలు చెప్పడంలో ఆంధ్రా సీఎం కు పోటీపడేవాడు ఏడేడు లోకాల్లో ఉండడని ..బీజేపీలో సగం మంది టిడిపి వాళ్లే అని నిర్లజ్జగా బొంకిన జగన్, వైఎస్సార్సీపీ లో 80 శాతం కాంగ్రెస్, 20 శాతం టిడిపి వాళ్ళు అనే విషయం మరిస్తే ఎలా అని సత్యకుమార్ ప్రశ్నించారు. పార్టీ మారని నిఖార్సైనోడు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టనోడు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మనోడు మీలో ఒక్కడైనా ఉన్నాడా చెప్పాలన్నారు. గురువింద జగన్ కు కాదనే దైర్యం ఉందా? ఎక్కడో ఎందుకు మీ సొంత జిల్లా కడపలోనే మైదుకూరు, జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి, ఎమ్మెల్యేలు టిడిపి నుండి వచ్చిన వాళ్ళు కాదా? అని ప్రశ్నించారు.
బూతుల ట్రైనింగ్ ఇచ్చి మీ చుట్టూ కవచంలా ఉంచుకున్న వారంతా గతంలో ఆ పార్టీ వారు కాదా? అని మండిపడ్డారు.